సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటి వరకు (ఫిబ్రవరి 10వ తేదీ తర్వాతి నుంచి) విదేశాల నుంచి వచ్చిన 12 వేల మందికి పైగా ప్రయాణికులను ప్రభుత్వం గుర్తించింది. వీళ్లందరిపైనా ప్రత్యేక నిఘాతో 89 శాతం మందిని (ట్రాక్ చేసి) ఇంట్లోనే ఉంచి వైద్య పర్యవేక్షణ చేయిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అనేక పటిష్ట చర్యలతో రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరించకుండా సమగ్రంగా కట్టడి చేస్తోంది. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో సీఎం వైఎస్ జగన్ రూపకల్పన చేసిన వలంటీర్ల వ్యవస్థ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇప్పటి వరకు నమోదైన 3 కరోనా వైరస్ పాజిటివ్ కేసుల్లో ఒకరు ఇటలీ నుంచి, ఇంకొకరు లండన్ నుంచి, మరొకరు సౌదీ నుంచి రాష్ట్రానికి వచ్చిన వ్యక్తులే. కరోనా లక్షణాలు కనిపించిన వారు కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వారే.
వీరిని గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వానికి వలంటీర్ల వ్యవస్థ ఎంతో ఉపకరించింది. ఏపీలో మినహా దాదాపు ఏ ఇతర రాష్ట్రంలోనూ ఇంత త్వరగా వైరస్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించ లేదు. స్థానిక ప్రజలను అప్రమత్తం చేయడంలోనూ వలంటీర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున లక్షలాది మంది వలంటీర్లను ప్రభుత్వం నియమించినందున ప్రస్తుత విపత్కర పరిస్థితులను ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఏర్పడింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ అంశాలను ప్రస్తావిస్తూ వైరస్‌ను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పటిష్ట చర్యలను వివరించారు.
స్థానిక ఎన్నికలు పూర్తయి ఉంటే...
రాష్ట్రంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్, పంచాయతీ ఎన్నికలు పూర్తయి ఉంటే ఆ ప్రజాప్రతినిధులు కూడా కరోనా వైరస్ విస్తరణ కాకుండా మరింత పటిష్ట చర్యలు చేపట్టడంలో భాగస్వాములయ్యే వారు. స్థానిక ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించే అవకాశముండేది. స్థానిక ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేయడంతో అందుకు ఆస్కారం లేకుండా పోయింది.
ప్రత్యేక నిఘాతో గట్టి చర్యలు
- పాజిటివ్ కేసులు నమోదైన వారి ఇంటికి సుమారు 2 కిలోమీటర్ల దూరం వరకు తీవ్ర స్థాయిలో పారిశుధ్య పనులు చేసి, మిగతా వారికి వైరస్ సోకకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
- కరోనా తీవ్ర రూపం దాల్చిన దేశాల నుంచి మన రాష్ట్రానికి వచ్చిన వారిని నేరుగా ఆస్పత్రుల్లోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించి, 14 రోజుల తర్వాత పరీక్షలు నిర్వహించి ఇళ్లకు పంపిస్తున్నారు.
- తమ దృష్టికి రాని విదేశీ ప్రయాణికులెవరైనా ఉంటే ఇళ్లలోనే ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
- నెల్లూరు, ఒంగోలు, విశాఖపట్నంలలో కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్న ముగ్గురూ ఆరోగ్యంగా ఉన్నారని ఆరోగ్యశాఖ తెలిపింది.
సర్కారు తాజా చర్యలు
- త్వరలో ప్రతి జిల్లాకు 100 పడకలతో కూడిన క్వారంటైన్ ఏర్పాటుకు సీఎం ఆమోదం.
- క్వారంటైన్‌లో ఉన్న వాళ్లందరికీ భోజన వసతుల బాధ్యత సర్కారుదే
- ప్రొటోకాల్ ప్రకారం సహకరించకపోతే పోలీసు కేసులకూ వెళ్లడానికి సిద్ధం
- విశాఖపట్నంలోని విమ్స్ క్వారంటైన్‌ను 300 పడకల నుంచి 500 పడకలకు పెంచేందుకు చర్యలు
- వివిధ బోధనాసుపత్రులకు చేరిన 100 వెంటిలేటర్లు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది
కరోనా వైరస్ నిరోధానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 13 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, దిశా నిర్దేశం చేశారన్నారు. కేంద్రం నుంచి సహకారం కావాలని, రాష్ట్రంలో కొత్త లాబ్స్ అవసరం ఉందని ప్రధానికి సీఎం వైఎస్ జగన్ చెప్పారన్నారు. జనతా కర్ఫ్యూ గురించి ప్రధాని రాష్ట్రాల సహకారాన్ని కోరారని, దీనిపై కార్యాచరణ చేపడతామని చెప్పారు. ఉపాధి హామీ పని దినాలు, వేతనాలు పెంచాలని కోరామన్నారు. కాగా, కరోనా కేసులకు సంబంధించి మీడియా సంయమనం పాటించాలని, సమగ్ర సమాచారంతో ఉన్నతాధికారులతో ధ్రువీకరించుకున్నాకే వార్తలు ప్రచురించాలని/చానళ్లలో ప్రసారం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎలక్టివ్ సర్జరీలు నిలిపివేత
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ముందుగా నిర్ణయించిన తేదీల్లో చేయాల్సిన సర్జరీలు నిలిపివేస్తున్నాం. అత్యవసర సర్జరీలు మాత్రమే చేయాలని ఆదేశాలు జారీ చేశాం. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ఎలక్టివ్ సర్జరీలు చేస్తాం.
– డా.కె.వెంకటేష్, వైద్యవిద్యా సంచాలకులు
అండగా ఉంటాం.. సహకరించండి
ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు నిరంతరాయంగా వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు నడుచుకోవాలి. వైద్యులకు సహకరించి, జాగ్రత్తలు పాటిస్తే వైరస్ నుంచి విముక్తి పొందడం కష్టం కాదు.
– డా.జయధీర్, కన్వీనర్, ప్రభుత్వ వైద్యుల సంఘం
Comments
Please login to add a commentAdd a comment