Andhra Pradesh: రాష్ట్రంలో 16 హెల్త్‌ హబ్స్‌ | CM Jagan has decided to set up health hubs at 16 places in AP | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: రాష్ట్రంలో 16 హెల్త్‌ హబ్స్‌

Published Sat, May 29 2021 3:00 AM | Last Updated on Sat, May 29 2021 10:27 AM

CM Jagan has decided to set up health hubs at 16 places in AP - Sakshi

వైద్య రంగాన్ని మనం బలోపేతం చేస్తున్నాం. ప్రభుత్వాసుపత్రుల రూపు మారుస్తున్నాం. కొత్తగా హెల్త్‌ హబ్‌లు ఏర్పాటు చేస్తే అక్కడ ఏర్పాటు చేసే ప్రయివేటు ఆసుపత్రులతో వైద్య రంగం మరింత బలోపేతమవుతుంది.  మనం ఇచ్చే ప్రోత్సాహంతో ప్రైవేట్‌ రంగంలో కూడా మంచి ఆస్పత్రులు వస్తాయి. ఈ పాలసీ వల్ల ప్రతి జిల్లా కేంద్రంతో పాటు కార్పొరేషన్లలో మల్టీ స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయి. టెరిషియరీ కేర్‌ విస్తృతంగా మెరుగు పడుతుంది. రాష్ట్ర ప్రజలు ఇతర ప్రాంతాలకు వైద్యానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు ఉత్తమ ప్రమాణాలతో వైద్యం అందుతుంది. 
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ఆస్పత్రులను అన్ని మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్ది ఆరోగ్యశ్రీతో ఉచితంగా కోట్ల మందికి చికిత్స అందిస్తూ ప్రజలను ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకవైపు కోవిడ్‌ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటూనే భవిష్యత్తు వ్యూహాలను సిద్ధం చేసింది. అత్యంత మెరుగైన వైద్య చికిత్సలు రాష్ట్రంలోనే లభ్యమయ్యేలా 16 చోట్ల హెల్త్‌ హబ్‌లను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. అన్ని జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో ఈ హెల్త్‌ హబ్‌లు ఏర్పాటు కానున్నాయి. తద్వారా కనీసం 80 సూపర్‌ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి. ఒకవేళ అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఆస్పత్రులను నెలకొల్పేందుకు ముందుకొచ్చినా ఆసక్తి ఉన్నవారికి అవకాశం కల్పించాలని సూచించారు.

హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని పెద్ద ఆస్పత్రుల్లో మాదిరిగా ఎం ప్యానల్డ్‌ నెట్‌వర్క్‌ వైద్య సేవలందిస్తున్న తరహాలో వీటిలోనూ ఆరోగ్యశ్రీ వర్తించేలా సదుపాయాలుంటాయి. ఆయా చోట్ల 30 నుంచి 50 ఎకరాల భూసేకరణ చేయాలని, మూడేళ్లలో కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చి ఆస్పత్రులు ఏర్పాటు చేస్తే ఉచితంగా 5 ఎకరాలు కేటాయించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. డిమాండ్‌ ఉండే చోట్ల అవసరం మేరకు అదనంగా భూ సేకరణ చేయాలని సూచించారు. హెల్త్‌ హబ్‌లపై నెల రోజుల్లో పాలసీ తీసుకురావాలని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వ్యాక్సిన్‌ తయారయ్యేలా చర్యలు చేపట్టి సమగ్ర విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. కోవిడ్‌ నియంత్రణ, నివారణ, చికిత్స, వ్యాక్సినేషన్, ఆక్సిజన్‌ సరఫరాపై ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యాంశాలు ఇవీ..
కోవిడ్‌ నియంత్రణ, నివారణ, చికిత్స, వ్యాక్సినేషన్, ఆక్సిజన్‌ సరఫరాపై క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

హబ్‌లతో కనీసం 80 మల్టీ, సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు
రాష్ట్ర ప్రజలు మెరుగైన వైద్యం కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ ఎందుకు వెళ్లాల్సి వస్తోందన్నది ఆలోచించాలి. టెరిషియరీ కేర్‌ (అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యం) కోసం వాళ్లు వెళ్తున్నారు. అందువల్ల రాష్ట్రంలో ప్రత్యేకంగా హెల్త్‌ హబ్‌లు ఏర్పాటు చేయాలి. అన్ని జిల్లా కేంద్రాలు, మూడు కార్పొరేషన్లలో హెల్త్‌ హబ్‌లు ఏర్పాటు కావాలి. విజయవాడ, తిరుపతి, రాజమండ్రితో కలిపి మొత్తం 16 చోట్ల హెల్త్‌ హబ్‌లు నెలకొల్పాలి. ఇందుకోసం ఒక్కో చోట కనీసం 30 నుంచి 50 ఎకరాలు సేకరించాలి. ఒక్కో ఆస్పత్రికి 5 ఎకరాలు చొప్పున ఉచితంగా భూమి కేటాయించాలి. మూడేళ్లలో కనీసం రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆస్పత్రులకు ఆ భూములు ఇవ్వాలి. దీనివల్ల కనీసం 80 మల్టీ, సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు అందుబాటులోకి వస్తాయి. వీటితో పాటు ప్రభుత్వం తరఫున కొత్తగా మరో 16 వైద్య కళాశాలలు, 16 నర్సింగ్‌ కాలేజీలు వస్తున్నాయి.

నెల రోజుల్లోనే సిద్ధం కావాలి..
హెల్త్‌ హబ్‌లపై ఒక నెల రోజుల్లో పాలసీ తీసుకురావాలి. వాక్సిన్‌ కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో తయారయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలి. దానిపైనా ఒక విధానాన్ని తేవాలి.

ఆ మందులపై కంపెనీలతో మాట్లాడి తెప్పించండి..
బ్లాక్‌ ఫంగస్‌ కేసుల సంఖ్యను పరిశీలిస్తే వచ్చే వారం రోజుల్లో కనీసం 40 వేల ఇంజక్షన్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం ఉన్న ఇంజక్షన్లు ఏ మూలకు సరిపోవు. ఇంజక్షన్ల కేటాయింపు పూర్తిగా కేంద్రం నియంత్రణలో ఉంది. అవసరాలకు అనుగుణంగా కేటాయింపులు ఉండడం లేదు. ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి. బ్లాక్‌ ఫంగస్‌కు మందులు ఎక్కడ ఉన్నా కంపెనీలతో సమన్వయం చేసుకుని తెప్పించుకోవాలి. ఆస్పత్రుల్లో కోవిడ్‌ బాధితుల అడ్మిషన్లు తగ్గినా సరే ఆక్సిజన్‌ పైపులైన్లు, నిల్వ తదితర పనులను ఆపవద్దు. ఏ సమయంలో కోవిడ్‌ విస్తరించినా పూర్తిస్థాయిలో వైద్యం అందించేలా సిద్ధంగా ఉండాలి. 

సరైన పథకంలో డిపాజిట్‌ చేయండి
కోవిడ్‌ వల్ల తల్లిదండ్రులు మరణించడంతో అనాథలైన 78 మంది చిన్నారులను ఇప్పటివరకు గుర్తించారు. ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశాల మేరకు వీరిని ఆదుకునేందుకు ఇప్పటికే 10 మందికి రూ.10 లక్షలు చొప్పున అధికారులు డిపాజిట్‌ చేశారు. ప్రభుత్వం అందచేస్తున్న డబ్బులను వివిధ పాలసీలను పరిశీలించి సరైన స్కీంలో డిపాజిట్‌ చేయాలని సీఎం ఆదేశించారు. మరోవైపు 104కు వచ్చే కాల్స్‌ బాగా తగ్గాయని, మే 4వతేదీన 19,175 కాల్స్‌ రాగా మే 27న 5,421 కాల్స్‌ మాత్రమే వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

కేసులు తగ్గుముఖం
► మే 16న పాజిటివిటీ రేటు 25.56 శాతం కాగా 27న 19.20 శాతం ఉంది.
► 10 – 12 రోజులుగా పాజిటివిటీ రేటు, యాక్టివ్‌ కేసులు తగ్గుతున్నాయి.
► మే 18న 2.11 లక్షలకు పైగా కేసులు ఉండగా  మే 26 నాటికి 1.86 లక్షలకు తగ్గాయి.
► రికవరీ రేటు మెరుగుపడి మే 7న 84.3 శాతం ఉండగా మే 27 నాటికి 87.99 శాతానికి పెరిగింది.
► గత ఏడు వారాల డేటాను పరిశీలిస్తే అన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

► రాష్ట్రవ్యాప్తంగా 597 కోవిడ్‌ కేర్‌ ఆస్పత్రులుండగా 46,596 బెడ్లు ఉన్నాయి. 32,567 బెడ్లు ఆక్యుపై కాగా 24,985 మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారు. 116 కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో 52,941 బెడ్లు ఉండగా, 16,689 బెడ్లు ఆక్యుపై అయ్యాయి. హోం ఐసొలేషన్‌లో 1,37,436 మంది ఉన్నారు.
► రాష్ట్రంలో ఇప్పటి వరకు 808 బ్లాక్‌ ఫంగస్‌ కేసుల గుర్తింపు. వచ్చిన మొత్తం ఇంజక్షన్లు 5,200. 
► రాష్ట్రంలో అందుబాటులో 16 ఐఎస్‌వో కంటైనర్లు .తుపాను దృష్ట్యా 4 ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌లతో ప్రత్యామ్నాయ  ఏర్పాట్లు చేయడంతో మే 26న 812.78 టన్నుల ఆక్సిజన్‌ సేకరణ. గత ఐదు రోజుల్లో సగటున 670 టన్నులు అందుబాటులోకి.
► కోవిడ్‌ చికిత్స నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకూ 66 ఫిర్యాదులు అందగా 43 ఆస్పత్రులకు రూ.2.4 కోట్ల మేర జరిమానా విధించారు.

– సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎంటీ కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజ్‌మెంట్, వ్యాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జ్‌ ఏ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ ఏ.మల్లికార్జున్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు, ఆయుష్‌ కమిషనర్‌ వి.రాములుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
చదవండి: రాష్ట్రాలకు నాస్తి.. ప్రైవేటుకు జాస్తి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement