Health Hub
-
ప్రపంచస్థాయి హెల్త్ హబ్: సీఎం రేవంత్‌రెడ్డి
బంజారాహిల్స్ (హైదరాబాద్): రాష్ట్రంలో వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా హైదరాబాద్‌కు వస్తే.. ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు అందుతాయనేలా హబ్‌ను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 24వ వ్యవస్థాపక దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి హెల్త్ హబ్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అందులో బసవతారకం ఆస్పత్రికి స్థానం కచ్చితంగా ఉంటుందని చెప్పారు. పేదలకు సేవలందించే ఉద్దేశంతో ఆనాడు ఎన్టీఆర్ ఈ ఆస్పత్రి నిర్మాణానికి పూనుకున్నారని, ఆయన ఆలోచనా విధానాలను కొనసాగించాలని.. చంద్రబాబునాయుడు ఆస్పత్రిని పూర్తి చేసి పేదలకు సేవలందించేలా చేశారని పేర్కొన్నారు. ఆస్పత్రికి సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్నా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఆస్పత్రి వేడుకల్లో పాల్గొనడం తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ తాము అడిగిన వెంటనే పెండింగ్‌లో ఉన్న భూమి లీజు పొడిగించిన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ట్రస్ట్ బోర్డు సభ్యుడు, ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
రాయలసీమ హెల్త్ హబ్
-
ఏపీలో16 చోట్ల హెల్త్ హబ్‌లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 చోట్ల హెల్త్ హబ్‌ల ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారని, ఆ దిశగా చర్యలు కూడా తీసుకున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని తెలిపారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (భారత పరిశ్రమల సమాఖ్య) ఆధ్వర్యంలో సోమవారం రాత్రి న్యూ ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ఉన్నతస్థాయి ప్రతినిధులతో ప్రపంచ స్థాయిలో పేరున్న ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ యూనిట్ల అధినేతల సమావేశాన్ని నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంలో మంత్రి విడదల రజినితోపాటు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జీఎస్ నవీన్‌కుమార్ ఉన్నారు. మేదాంత- ద మెడ్‌సిటీ, మణిపాల్, పనాసియా ఇండియా, పోలీ మెడిక్యూర్ లిమిటెడ్, బాస్క్ మరియు లోంబ్ ఐ కేర్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ అలియన్స్, పారాస్ హాస్పిటల్స్, అపోల్ హాస్పిటల్స్ గ్రూప్, పీడీ హిందూజా హాస్పిటల్స్, చార్నాక్ హాస్పిటల్స్, ఉజాలా సైనస్, ప్రిస్టిన్ కేర్, మ్యాక్స్ హెల్త్ కేర్.... ఇలా దాదాపు 25కుపైగా ప్రఖ్యాత ఆస్పత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లు, వైద్య పరికరాల తయారీ కంపెనీల అధినేతలు హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అనువైన అవకాశాలను వారికి వివరించారు. సీఐఐ ప్రతినిధులు సైతం ఏపీలో వైద్య ఆరోగ్య రంగం కొత్త పుంతలు తొక్కుతోందని ఈ సమావేశంలో ప్రశంసించారు. పేదలకు మరింత మేలు చేసేందుకే హెల్త్ హబ్‌లు మంత్రి విడదల రజిని మాట్లాడుతూ పేదలకు మరింత మెరుగైన వైద్యం, మరింత చేరువ చేసే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెల్త్ హబ్‌లను ఏర్పాటుచేస్తున్నారని తెలిపారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో కనీసం 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి ఎవరైతే ముందుకు వస్తారో.. వారికి ఉచితంగా 5 ఎకరాల స్థలం ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. ఆస్పత్రులను త్వరగా నిర్మించి, 50 శాతం పడకలను ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకు కేటాయించాల్సి ఉంటుందన్నారు. దీనివల్ల పేదలకు ప్రపంచస్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించేవీలు ఏర్పడుతుందని తెలిపారు. హెల్త్ హబ్‌ల ఏర్పాటుకు ముందుకు వచ్చే ఆస్పత్రుల యాజమాన్యాలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని తెలిపారు. సింగిల్ విండో విధానం ద్వారా ప్రభుత్వ అనుమతులన్నీ ఇచ్చేలా సీఎం జగన్ చర్యలు తీసుకున్నారని చెప్పారు. విశాఖపట్టణంలోని మెడ్ సిటీ లో ఇప్పటికే ఎన్నో సంస్థలు ఏర్పాటయ్యాయని, అవి వాటి కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. మెడ్‌సిటీలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నదన్నారు. 2200కుపైగా ఆస్పత్రుల్లో 3255 చికిత్సలకు ఉచితంగా వైద్యం ఏపీలో ప్రస్తుతం 2200కుపైగా ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందుతోందని మంత్రి తెలిపారు. ఏకంగా 3255 చికిత్సలకు ఉచితంగా వైద్యం అందుతోందన్నారు. ఏటా రూ.3వేల కోట్లు ప్రభుత్వం ఈ పథకం కోసం ఖర్చు చేస్తున్నదన్నారు. వైద్యం చేసిన ప్రతి ఆస్పత్రికి బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తున్నామని తెలిపారు. భారీగా ఖర్చయ్యే 15 చికిత్సలకు పూర్తి ఉచితంగా ప్రభుత్వమే వైద్యం చేయిస్తోందని వివరించారు. వేల కోట్ల ఖర్చు కాదు.. హెల్త్ హబ్‌ల ఏర్పాటుకు కావాల్సిన భూమి, అన్ని వసతులు కూడా ఇచ్చేందుకు జగనన్న ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పెట్టుబడులు పెట్టండి మంత్రి విడదల రజిని మాట్లాడుతూ రాష్ట్రంలో 16 చోట్ల హెల్త్ హబ్ ల ఏర్పాటు, సమగ్ర క్యాన్సర్ కేర్ సెంటర్ల ఏర్పాటు, ఎమ్ ఆర్ ఐ, సీటీ, క్యాత్ ల్యాబ్‌ల ఏర్పాటు, డయాగ్నస్టిక్ సెంటర్ల ఏర్పాటు, వాటి నిర్వహణ, ఏపీలో ఆరోగ్యసేవల డిజిటలైజేషన్లో సహకారం..... లాంటి కీలక అంశాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయా సంస్థలను కోరారు. పారిశ్రామిక వేత్తలకు తమ ప్రభుత్వం ఫోన్ కాల్ దూరంలో ఉంటుందని స్పష్టంచేశారు. అత్యాధునిక వైద్య వసతులు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందించేందుకు జగనన్న కట్టుబడి ఉన్నారని తెలిపారు. పేదలకు రూపాయి ఖర్చు లేకుండా నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని ప్రభుత్వ పెద్ద ఆస్పత్రులన్నింటినీ ఆధునికీకరిస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని మెడికల్ కళాశాలల అనుబంధ ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు ఎన్ఏబీహెచ్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పటల్స్) గుర్తింపు కూడా పొందుతున్నాయని తెలిపారు. ఏలూరు లాంటి ఆస్పత్రులకు ఎన్ఏబీహెచ్ గుర్తింపు రావడం తమ ప్రభుత్వ విజయానికి నిదర్శమని వివరించారు. -
హెల్త్ హబ్స్ టెండర్ల నిబంధనల్లో మార్పులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలందరికీ కార్పొరేట్ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంలో భాగంగా అంతర్జాతీయస్థాయి వైద్య సంస్థలను ఆకర్షించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాలతో పాటు విజయవాడ, తిరుపతి, రాజమండ్రితో కలిపి మొత్తం 16 చోట్ల కార్పొరేట్ ఆస్పత్రులను హెల్త్ హబ్స్ పేరుతో ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. తొలుత పిలిచిన బిడ్డింగ్‌లో కర్నూలు జిల్లాలో కార్పొరేట్ హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి ఓ సంస్థ ముందుకు వచ్చింది. మిగిలిన చోట్ల కూడా ప్రముఖ కార్పొరేట్ సంస్థలను ఆకర్షించే విధంగా టెండర్ నిబంధనల్లో సవరణలు చేశారు. బ్యాంక్ గ్యారెంటీ అవసరం లేకుండా, పెర్ఫార్మెన్స్ గ్యారెంటీనీ రెండేళ్లకే పరిమితం చేస్తూ నిబంధనల్లో మార్పులు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీ ఎండీ జవ్వాది సుబ్రమణ్యం మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెద్ద కార్పొరేట్ వైద్య సంస్థలను తీసుకువచ్చే విధంగా నిబంధనల్లో మార్పులు చేశామని చెప్పారు. నిబంధనలు మారినందున బిడ్ల దాఖలు గడువును ఈనెల 18 వరకు పెంచుతూ ఏపీఐఐసీ నిర్ణయం తీసుకుంది. బిడ్లను పరిశీలించిన తర్వాత.. ఎంపికైన సంస్థ వివరాలను ఏప్రిల్ 15న వెల్లడిస్తామని తెలిపింది. ఈ ఆస్పత్రుల నిర్మాణం ద్వారా రూ.2,500 కోట్లకు పైగా పెట్టుబడులు 2,000 అదనపు పడకలు అందుబాటులోకి వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆస్పత్రుల ఏర్పాటుకు అవసరమైన భూమిని ఇప్పటికే ఏపీఐఐసీ సేకరించింది. ఈ ఆస్పత్రుల్లో 50 శాతం పడకలను ఆరోగ్య శ్రీకి కేటాయించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. దీని ద్వారా పేద ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి రానుంది. -
'హెల్త్ హబ్స్'పై ప్రముఖ వైద్య సంస్థల ఆసక్తి
సాక్షి, అమరావతి: హెల్త్‌హబ్స్ ద్వారా రాష్ట్రంలో 13 కార్పొరేట్ ఆస్పత్రుల నిర్మాణంలో పాలుపంచుకునేందుకు దేశవ్యాప్తంగా పలు ప్రముఖ వైద్య సంస్థలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. అన్ని జిల్లాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 13 చోట్ల మల్టీ/సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణానికి ఆసక్తి కలిగిన సంస్థల నుంచి ఆహ్వానించిన టెండర్లకు భారీ స్పందన వచ్చింది. తాజాగా టెండర్లలో పాల్గొనడానికి ముందు నిర్వహించే ప్రీ బిడ్డింగ్ సమావేశంలో దేశవ్యాప్తంగా 28కి పైగా సంస్థలు పాల్గొన్నట్లు ఏపీఐఐసీ అధికారులు వెల్లడించారు. వర్చువల్ విధానంలో జరిగిన ప్రీ బిడ్ మీటింగ్‌లో ఏఐజీ, అపోలో, కేర్, కిమ్స్, సన్‌షైన్, రెయిన్బో, నారాయణ హృదయాలయ, మణిపాల్ లాంటి ప్రముఖ కార్పొరేట్ వైద్యసంస్థలు పాల్గొన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తూనే.. అత్యున్నత వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒకపక్క నాడు – నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తూనే ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున కార్పొరేట్ ఆస్పత్రులను అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి పట్టణాల్లో మల్టీ/ సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణానికి బిడ్లను ఆహ్వానిస్తూ ఏపీఐఐసీ టెండర్లను పిలిచింది. హెల్త్ హబ్స్ పేరుతో అభివృద్ధి చేస్తున్న 13 కార్పొరేట్ ఆస్పత్రుల ప్రాధాన్యం గురించి ప్రీ బిడ్డింగ్‌లో వివరించారు. కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి, 100 పడకలతో ఆస్పత్రుల నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుంది. వీటిలో 50 శాతం బెడ్లను వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద కేటాయిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను కార్పొరేట్ వైద్య సంస్థలు స్వాగతించాయని, బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపినట్లు ఏపీఐఐసీ అధికారులు వెల్లడించారు. -
చికిత్సలన్నీ మన వద్దే
జనవరి 26 నాటికి పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను అమల్లోకి తీసుకురావడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి. కొత్త పీహెచ్‌సీల నిర్మాణం, ఇప్పటికే ఉన్న పీహెచ్‌సీల్లో నాడు–నేడు పనులు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు అవసరమైన 104 వాహనాల కొనుగోళ్లు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలి. విలేజ్ క్లినిక్స్ నిర్మాణంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: వైద్యం కోసం ఇతర నగరాలు, రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండకూడదని సీఎం వైఎస్ జగన్ అధికారులకు స్పష్టం చేశారు. ఏ రకమైన చికిత్సలకు ఇతర రాష్ట్రాలకు, నగరాలకు వెళ్తున్నారో అలాంటి చికిత్సలు అందించే ఆస్పత్రులను రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో ఏర్పాటు చేసే హెల్త్ హబ్స్‌లో నిర్మించాలని ఆదేశించారు. హెల్త్ హబ్స్ ఏర్పాటు, మెడికల్ కాలేజీలు, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, ఏపీ డిజిటల్ హెల్త్, కోవిడ్–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెల్త్ హబ్స్‌లో ఏర్పాటయ్యేఆస్పత్రుల్లో అన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉండాలని, తద్వారా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు వైద్యం కోసం వెళ్లాల్సిన అవసరం ఉండకూడదని చెప్పారు. ఎలాంటి చికిత్స అయినా మన రాష్ట్రంలోనే అందించేలా స్పెషలైజేషన్‌తో కూడిన ఆస్పత్రులు ఏర్పాటు కావాలని ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి ఏమైనా అంశాలు పెండింగ్‌లో ఉంటే.. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ నెలాఖరు నాటికి వాటిని పరిష్కరించి, పనులు శరవేగంగా ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జనవరి 26 నాటికి పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు కావాలని, ఇందుకోసం ఇంకా అవసరమైన 104 వాహనాల కోనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. కోవిడ్ నియంత్రణపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్. చిత్రంలో మంత్రి ఆళ్ల నాని తదితరులు పీహెచ్‌సీల్లో మహిళా డాక్టర్ల నియామకం ► మహిళలు, బాలికల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ద్వారా బాలికల ఆరోగ్యంపై దృష్టి పెట్టాం. దీని ద్వారా బాలికల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నాం. నెలకు ఒకసారి ఈ రకమైన కార్యక్రమం చేపడుతున్నాం. వీటిని దృష్టిలో ఉంచుకుని పీహెచ్సీ వైద్యుల నియామకాల్లో మహిళా డాక్టర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. ► ఆరోగ్య శ్రీపై గ్రామ, వార్డు సచివాలయాల్లో హోర్డింగ్స్ పెట్టాలి. ఆరోగ్య శ్రీ రిఫరెల్ మీద ప్రచారంతో పాటు ఆరోగ్య మిత్రల ఫోన్ నంబర్లను ఈ హోర్డింగ్స్‌లో ఉంచాలి. ఆరోగ్య శ్రీలో ఎంప్యానెల్ ఆస్పత్రుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలి. డిజిటల్ పద్ధతుల్లో పౌరులకు ఎంప్యానెల్ ఆస్పత్రుల జాబితాలు అందుబాటులో ఉంచాలి. 108 వాహనాల సిబ్బందికి కూడా రిఫరెల్ ఆస్పత్రుల జాబితా అందుబాటులో ఉంచాలి. బ్లడ్ గ్రూప్ సహా ఆరోగ్య వివరాలన్నీ ఉండాలి ► ఏపీ డిజిటల్ హెల్త్‌కు సంబంధించి.. హెల్త్ కార్డుల్లో సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ క్యూఆర్ కోడ్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉండాలి. పరీక్షలు, వాటి ఫలితాలు, చేయించుకుంటున్న చికిత్సలు, వినియోగిస్తున్న మందులు.. ఇలా అన్ని వివరాలను ఆ వ్యక్తి డేటాలో భద్రపరచాలి. దీనివల్ల భవిష్యత్‌లో ఎక్కడకు వెళ్లినా సులభంగా వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుంది. ► బ్లడ్ గ్రూపు లాంటి వివరాలు కూడా ఇందులో ఉండాలి. 104 ద్వారా వైద్యం అందించే క్రమంలో చేస్తున్న పరీక్షల ఫలితాలకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు ఈ హెల్త్ కార్డుల్లో పొందుపర్చాలి. (డిజిటిల్ హెల్త్ కార్యక్రమంలో భాగంగా పౌరులందరికీ హెల్త్ ఐడీలు క్రియేట్ చేస్తున్నామని అధికారులు తెలిపారు.) రాష్ట్రంలో కోవిడ్–19 నివారణ, నియంత్రణ, చికిత్సలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కోవిడ్ కేసుల పరిస్థితి ► రాష్ట్రంలో యాక్టివ్ పాజిటివ్ కేసులు : 9,141 ► రికవరీ రేటు శాతం : 98.86 ► ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు: 2,201 ► కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారు : 313 ► హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు: 6627 ► జీరో కేసులు నమోదైన సచివాలయాలు : 11,997 ► పాజిటివిటీ రేటు శాతం : 1.62 ► 0 నుంచి 3 శాతం వరకు పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు : 12 ► 3కు పైగా పాజిటివిటీ రేటు ఉన్న జిల్లా: 1 థర్డ్ వేవ్ సన్నద్ధత ► మొత్తం అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ : 20,964 ► ఇంకా రావాల్సినవి : 2,493 ► అందుబాటులో ఉన్న డి టైప్ ఆక్సిజన్ సిలెండర్లు : 27,311 ► రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్లు : 140 (ఇవి అక్టోబర్ ఆఖరుకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి) -
Andhra Pradesh: ఆరోగ్యశ్రీకి పెద్దపీట
ప్రభుత్వాస్పత్రుల్లో అత్యుత్తమ నిర్వహణా పద్ధతులను అనుసరించాలి. ఆరోగ్యం బాగోలేకపోయిన వారంతా ప్రభుత్వాస్పత్రులకు వెళ్లే పరిస్థితి ఉండాలి. ఆస్పత్రుల నిర్వహణలో పర్యవేక్షణ స్థాయి బలంగా ఉండాలి. సిబ్బంది సెలవులో ఉన్నందున సేవలకు అంతరాయం రాకూడదు. నిర్ణీత రోజులకు మించి సెలవులో ఉంటే, వెంటనే చర్యలు తీసుకోవాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో ఏర్పాటు చేయబోయే హెల్త్ హబ్స్‌లో ఆరోగ్య శ్రీకి 50% కంటే ఎక్కువ బెడ్లను కేటాయించే ఆస్పత్రులకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. హెల్త్ హబ్స్ ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం 50 శాతం బెడ్లను ఆరోగ్య శ్రీ రోగులకు ఇవ్వాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో హెల్త్ హబ్స్, ఆస్పత్రుల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, కోవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హెల్త్ హబ్స్ ఏర్పాటు విధివిధానాల గురించి అధికారులు సీఎంకు వివరించారు. ఏయే జిల్లాల్లో ఏ తరహా ప్రత్యేక వైద్య చికిత్సలు అవసరమో గణాంకాలు అందజేశారు. ఏ తరహా వైద్యం కోసం రోగులు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారనే వివరాలనూ అందజేశారు. వివిధ వైద్య సంస్థలు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అనుసరిస్తున్న నిర్వహణ విధానాలను వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. హెల్త్ హబ్స్ ద్వారా వచ్చే ఆస్పత్రుల బోర్డుల్లో ప్రభుత్వం నుంచి ఒక సభ్యుడు ఉంటారని తెలిపారు. మన రాష్ట్రానికి చెందిన డాక్టర్లు కూడా ఇక్కడే స్థిరపడి, మంచి వైద్య సేవలు అందించాలనే ఉద్దేశం హెల్త్ హబ్స్ ద్వారా నెరవేరుతుందని పేర్కొన్నారు. డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండాలన్నది ఆస్పత్రుల ఎంపికకు ఒక ప్రామాణికం కావాలని స్పష్టం చేశారు. అవయవ మార్పిడి చికిత్సలు చేసే ఆస్పత్రుల ఏర్పాటుపై హెల్త్ హబ్స్‌లో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. లాభాపేక్ష లేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న సంస్థలకూ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆరోగ్య బీమా కంపెనీలు చెల్లిస్తున్న చార్జీలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్న చార్జీలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్పత్రుల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ ► ఆస్పత్రుల నిర్వహణలో భాగంగా బిల్డింగ్ సర్వీసులు, ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసులు, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ సేవల నిర్వహణకు ప్రత్యేక అధికారులను నియమించాలి. సీహెచ్‌సీల నుంచి బోధనాస్పత్రుల వరకూ నిర్వహణ కోసం ప్రత్యేక అధికారులను నియమించాలి. ► కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రులు, బోధనాస్పత్రుల నిర్మాణాలు ఉత్తమ నిర్వహణా పద్ధతులకు అనుగుణంగా ఉండాలి. వీటి డిజైన్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆస్పత్రుల్లో బెడ్ల నిర్వహణ, బాత్రూమ్ల నిర్వహణ, పరిశుభ్రత, ఆహారంలో నాణ్యత చాలా ముఖ్యం. ► రిసెప్షన్ సేవలు కూడా కీలకం. సరిపడా వైద్యులు, పైన పేర్కొన్న సేవలు నాణ్యతతో అందితే.. కార్పొరేట్ ఆస్పత్రుల స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా సేవలు అందుతాయి. ► జనాభాను దృష్టిలో ఉంచుకుని 104లను వినియోగించాలి. విలేజ్ క్లినిక్స్ విధివిధానాలను, ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్)లను ఖరారు చేయాలి. పీహెచ్సీలో కనీసం ఇద్దరు డాక్టర్లను ఉంచాలి. ఒక డాక్టరు పీహెచ్సీలో సేవలు అందిస్తుండగా, మరో డాక్టరు 104 ద్వారా ఫ్యామిలీ డాక్టర్ విధానంలో సేవలు అందించేలా చూడాలి. కొత్త పీహెచ్‌సీల నిర్మాణాలు వీలైనంత త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. ► ప్రతి గ్రామ సచివాలయంలో కనీసం నెలకు 2 సార్లు 104 ద్వారా వైద్యుల సేవలు ఉండేలా విధివిధానాలు రూపొందించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. నవంబర్ 15 నుంచి 258 మండలాల్లో, జనవరి 26 నుంచి రాష్ట్రం అంతటా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలు చేయనున్నామని చెప్పారు. ► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి ► మొత్తం యాక్టివ్ కేసులు : 14,652 ► పాజిటివిటీ రేటు శాతం : 2.23 ► రికవరీ రేటు శాతం : 98.60 ► ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు : 2,699 ► కోవిడ్ కేర్ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారు : 854 ► నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్న బెడ్ల శాతం : 91.66 ► ప్రైవైట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్న బెడ్ల శాతం : 71.04 ► 104 కాల్ సెంటర్‌కు వచ్చిన ఇన్కమింగ్ కాల్స్ : 753 ► ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్ సర్వేలు : 21 ► జీరో కేసులు నమోదైన సచివాలయాలు : 10,541 ► పాజిటివిటీ రేటు 3 శాతం కంటే తక్కువగా నమోదైన జిల్లాలు : 9 థర్డ్ వేవ్ సన్నద్ధత ► అందుబాటులో ఉన్న ఆక్సిజన్ డీ టైప్ సిలెండర్లు : 27,311 ► అందుబాటులో ఉన్న ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు : 20,964 ► ఇంకా రావాల్సినవి : 2,493 ► 50 కంటే ఎక్కువ బెడ్స్ ఉన్న 140 ఆస్పత్రుల్లో ఆక్సిజన్ జనరేషన్ (పీఎస్ఏ) ప్లాంట్ల ఏర్పాటు. ► అక్టోబరు 11 నాటికి 140 ఆస్పత్రుల్లో అందుబాటులోకి పీఎస్ఏ ప్లాంట్లు వ్యాక్సినేషన్ ► సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయిన వారు : 1,33,30,206 ► రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిన వారు : 1,08,54,556 ► సింగిల్, డబుల్ డోసులు పూర్తయిన వారు : 2,41,84,762 ► వ్యాక్సినేషన్ కోసం వినియోగించిన మొత్తం డోసులు : 3,50,39,318 -
హెల్త్ హబ్‌ల కోసం భూముల గుర్తింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రధాన నగరాల్లో 16 హెల్త్‌హబ్‌లు నిర్మించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు స్థలాల కోసం కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై సీఎం జగన్‌కు ప్రాథమిక నివేదిక కూడా ఇచ్చారు. అనంతపురంలో 30 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరంలో 30 ఎకరాలు.. సుమారు రూ.24 కోట్లు అవుతుందని, అదే కాకినాడలో 30 ఎకరాలు రూ.27 కోట్లు అవుతుందని తేల్చారు. గుంటూరు జిల్లాలో ఒకచోట 16.54 ఎకరాలు, మరో చోట 22 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిశీలించారు. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 20 ఎకరాల చొప్పున ప్రభుత్వ భూములను గుర్తించారు. ఇక కర్నూలు జిల్లాలో ఒక చోట 58.44 ఎకరాలు, మరోచోట 52.45 ఎకరాల ప్రభుత్వ భూములు హెల్త్‌సిటీకి అనువుగా ఉన్నాయని నిర్ధారించారు. శ్రీకాకుళం జిల్లాలో 30 ఎకరాల ప్రైవేటు స్థలం గుర్తించగా.. దీని విలువ రూ.15 కోట్లు ఉంటుందని తేలడంతో మరో చోట 10 ఎకరాల ప్రభుత్వ భూమిని చూశారు. విశాఖలో 30 ఎకరాలు, విజయనగరంలో 74.80 ఎకరాలు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకచోట 32 ఎకరాలు, మరోచోట 50 ఎకరాల ప్రభుత్వ భూములను పరిశీలించారు. ఇవి రెండూ ఏలూరు కార్పొరేషన్‌కు సమీపంలో ఉన్నవే. పైన పేర్కొన్న అన్ని స్థలాలూ ఆయా జిల్లాల కార్పొరేషన్లకు అత్యంత సమీపంలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఒకటి, రెండు చోట్ల మినహా అన్ని జిల్లాల్లో ప్రభుత్వ భూములే గుర్తించినట్లు తెలిపారు. -
Andhra Pradesh: రాష్ట్రంలో 16 హెల్త్ హబ్స్
వైద్య రంగాన్ని మనం బలోపేతం చేస్తున్నాం. ప్రభుత్వాసుపత్రుల రూపు మారుస్తున్నాం. కొత్తగా హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేస్తే అక్కడ ఏర్పాటు చేసే ప్రయివేటు ఆసుపత్రులతో వైద్య రంగం మరింత బలోపేతమవుతుంది. మనం ఇచ్చే ప్రోత్సాహంతో ప్రైవేట్ రంగంలో కూడా మంచి ఆస్పత్రులు వస్తాయి. ఈ పాలసీ వల్ల ప్రతి జిల్లా కేంద్రంతో పాటు కార్పొరేషన్లలో మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు వస్తాయి. టెరిషియరీ కేర్ విస్తృతంగా మెరుగు పడుతుంది. రాష్ట్ర ప్రజలు ఇతర ప్రాంతాలకు వైద్యానికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఆరోగ్యశ్రీ పథకం కింద రోగులకు ఉత్తమ ప్రమాణాలతో వైద్యం అందుతుంది. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ ఆస్పత్రులను అన్ని మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్ది ఆరోగ్యశ్రీతో ఉచితంగా కోట్ల మందికి చికిత్స అందిస్తూ ప్రజలను ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకవైపు కోవిడ్ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొంటూనే భవిష్యత్తు వ్యూహాలను సిద్ధం చేసింది. అత్యంత మెరుగైన వైద్య చికిత్సలు రాష్ట్రంలోనే లభ్యమయ్యేలా 16 చోట్ల హెల్త్ హబ్‌లను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. అన్ని జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో ఈ హెల్త్ హబ్‌లు ఏర్పాటు కానున్నాయి. తద్వారా కనీసం 80 సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు విస్తృతంగా అందుబాటులోకి రానున్నాయి. ఒకవేళ అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఆస్పత్రులను నెలకొల్పేందుకు ముందుకొచ్చినా ఆసక్తి ఉన్నవారికి అవకాశం కల్పించాలని సూచించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులోని పెద్ద ఆస్పత్రుల్లో మాదిరిగా ఎం ప్యానల్డ్ నెట్వర్క్ వైద్య సేవలందిస్తున్న తరహాలో వీటిలోనూ ఆరోగ్యశ్రీ వర్తించేలా సదుపాయాలుంటాయి. ఆయా చోట్ల 30 నుంచి 50 ఎకరాల భూసేకరణ చేయాలని, మూడేళ్లలో కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చి ఆస్పత్రులు ఏర్పాటు చేస్తే ఉచితంగా 5 ఎకరాలు కేటాయించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. డిమాండ్ ఉండే చోట్ల అవసరం మేరకు అదనంగా భూ సేకరణ చేయాలని సూచించారు. హెల్త్ హబ్‌లపై నెల రోజుల్లో పాలసీ తీసుకురావాలని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే వ్యాక్సిన్ తయారయ్యేలా చర్యలు చేపట్టి సమగ్ర విధానాన్ని రూపొందించాలని ఆదేశించారు. కోవిడ్ నియంత్రణ, నివారణ, చికిత్స, వ్యాక్సినేషన్, ఆక్సిజన్ సరఫరాపై ముఖ్యమంత్రి జగన్ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యాంశాలు ఇవీ.. కోవిడ్ నియంత్రణ, నివారణ, చికిత్స, వ్యాక్సినేషన్, ఆక్సిజన్ సరఫరాపై క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్ హబ్‌లతో కనీసం 80 మల్టీ, సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు రాష్ట్ర ప్రజలు మెరుగైన వైద్యం కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఎందుకు వెళ్లాల్సి వస్తోందన్నది ఆలోచించాలి. టెరిషియరీ కేర్ (అత్యున్నత ప్రమాణాలతో కూడిన వైద్యం) కోసం వాళ్లు వెళ్తున్నారు. అందువల్ల రాష్ట్రంలో ప్రత్యేకంగా హెల్త్ హబ్‌లు ఏర్పాటు చేయాలి. అన్ని జిల్లా కేంద్రాలు, మూడు కార్పొరేషన్లలో హెల్త్ హబ్‌లు ఏర్పాటు కావాలి. విజయవాడ, తిరుపతి, రాజమండ్రితో కలిపి మొత్తం 16 చోట్ల హెల్త్ హబ్‌లు నెలకొల్పాలి. ఇందుకోసం ఒక్కో చోట కనీసం 30 నుంచి 50 ఎకరాలు సేకరించాలి. ఒక్కో ఆస్పత్రికి 5 ఎకరాలు చొప్పున ఉచితంగా భూమి కేటాయించాలి. మూడేళ్లలో కనీసం రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే ఆస్పత్రులకు ఆ భూములు ఇవ్వాలి. దీనివల్ల కనీసం 80 మల్టీ, సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రులు అందుబాటులోకి వస్తాయి. వీటితో పాటు ప్రభుత్వం తరఫున కొత్తగా మరో 16 వైద్య కళాశాలలు, 16 నర్సింగ్ కాలేజీలు వస్తున్నాయి. నెల రోజుల్లోనే సిద్ధం కావాలి.. హెల్త్ హబ్‌లపై ఒక నెల రోజుల్లో పాలసీ తీసుకురావాలి. వాక్సిన్ కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో తయారయ్యేలా తగిన చర్యలు తీసుకోవాలి. దానిపైనా ఒక విధానాన్ని తేవాలి. ఆ మందులపై కంపెనీలతో మాట్లాడి తెప్పించండి.. బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే వచ్చే వారం రోజుల్లో కనీసం 40 వేల ఇంజక్షన్లు అవసరం అవుతాయి. ప్రస్తుతం ఉన్న ఇంజక్షన్లు ఏ మూలకు సరిపోవు. ఇంజక్షన్ల కేటాయింపు పూర్తిగా కేంద్రం నియంత్రణలో ఉంది. అవసరాలకు అనుగుణంగా కేటాయింపులు ఉండడం లేదు. ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి. బ్లాక్ ఫంగస్‌కు మందులు ఎక్కడ ఉన్నా కంపెనీలతో సమన్వయం చేసుకుని తెప్పించుకోవాలి. ఆస్పత్రుల్లో కోవిడ్ బాధితుల అడ్మిషన్లు తగ్గినా సరే ఆక్సిజన్ పైపులైన్లు, నిల్వ తదితర పనులను ఆపవద్దు. ఏ సమయంలో కోవిడ్ విస్తరించినా పూర్తిస్థాయిలో వైద్యం అందించేలా సిద్ధంగా ఉండాలి. సరైన పథకంలో డిపాజిట్ చేయండి కోవిడ్ వల్ల తల్లిదండ్రులు మరణించడంతో అనాథలైన 78 మంది చిన్నారులను ఇప్పటివరకు గుర్తించారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు వీరిని ఆదుకునేందుకు ఇప్పటికే 10 మందికి రూ.10 లక్షలు చొప్పున అధికారులు డిపాజిట్ చేశారు. ప్రభుత్వం అందచేస్తున్న డబ్బులను వివిధ పాలసీలను పరిశీలించి సరైన స్కీంలో డిపాజిట్ చేయాలని సీఎం ఆదేశించారు. మరోవైపు 104కు వచ్చే కాల్స్ బాగా తగ్గాయని, మే 4వతేదీన 19,175 కాల్స్ రాగా మే 27న 5,421 కాల్స్ మాత్రమే వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కేసులు తగ్గుముఖం ► మే 16న పాజిటివిటీ రేటు 25.56 శాతం కాగా 27న 19.20 శాతం ఉంది. ► 10 – 12 రోజులుగా పాజిటివిటీ రేటు, యాక్టివ్ కేసులు తగ్గుతున్నాయి. ► మే 18న 2.11 లక్షలకు పైగా కేసులు ఉండగా మే 26 నాటికి 1.86 లక్షలకు తగ్గాయి. ► రికవరీ రేటు మెరుగుపడి మే 7న 84.3 శాతం ఉండగా మే 27 నాటికి 87.99 శాతానికి పెరిగింది. ► గత ఏడు వారాల డేటాను పరిశీలిస్తే అన్ని జిల్లాల్లో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ► రాష్ట్రవ్యాప్తంగా 597 కోవిడ్ కేర్ ఆస్పత్రులుండగా 46,596 బెడ్లు ఉన్నాయి. 32,567 బెడ్లు ఆక్యుపై కాగా 24,985 మంది ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారు. 116 కోవిడ్ కేర్ సెంటర్లలో 52,941 బెడ్లు ఉండగా, 16,689 బెడ్లు ఆక్యుపై అయ్యాయి. హోం ఐసొలేషన్‌లో 1,37,436 మంది ఉన్నారు. ► రాష్ట్రంలో ఇప్పటి వరకు 808 బ్లాక్ ఫంగస్ కేసుల గుర్తింపు. వచ్చిన మొత్తం ఇంజక్షన్లు 5,200. ► రాష్ట్రంలో అందుబాటులో 16 ఐఎస్వో కంటైనర్లు .తుపాను దృష్ట్యా 4 ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో మే 26న 812.78 టన్నుల ఆక్సిజన్ సేకరణ. గత ఐదు రోజుల్లో సగటున 670 టన్నులు అందుబాటులోకి. ► కోవిడ్ చికిత్స నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఇప్పటివరకూ 66 ఫిర్యాదులు అందగా 43 ఆస్పత్రులకు రూ.2.4 కోట్ల మేర జరిమానా విధించారు. – సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, కోవిడ్ కమాండ్ కంట్రోల్ ఛైర్మన్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎంటీ కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్ మేనేజ్మెంట్, వ్యాక్సినేషన్) ఎం.రవిచంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కాటమనేని భాస్కర్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జ్ ఏ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ ఏ.మల్లికార్జున్, ఏపీఎంఎస్ఐడీసీ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు, ఆయుష్ కమిషనర్ వి.రాములుతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. చదవండి: రాష్ట్రాలకు నాస్తి.. ప్రైవేటుకు జాస్తి -
హెల్త్ హబ్‌గా హైదరాబాద్
‘డబ్ల్యూసీవో–2017’లో మంత్రి లక్ష్మారెడ్డి హైదరాబాద్: వైద్య, ఆరోగ్య రంగానికి ప్రత్యేక బడ్జెట్, అధిక నిధులు కేటాయించడంతో హైదరాబాద్ హెల్త్ హబ్‌గా మారిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసీసీలో ‘వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఆప్తోమెట్రీ(డబ్ల్యూసీవో)–2017’అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. కంటి ఆరోగ్యం, నాణ్యమైన చూపు అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఐఎంఆర్, ఎంఎంఆర్, వ్యాక్సినేషన్ వంటి హెల్త్ ఇండికేటర్స్‌లో ఎంతో ప్రగతి సాధించామన్నారు. 3 రోజుల పాటు జరిగే సదస్సుకు 48 దేశాల నుంచి 1,500 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ జి.ఎన్. రావు, ప్రొఫెసర్ కోవిన్నాయుడు, డబ్ల్యూసీవో ప్రెసిడెంట్ డాక్టర్ ఉదక్ ఉడోమ్, ఇండియా విజన్ సీఈవో వినోద్ డానియేల్, ఆప్తోమెట్రీ వరల్డ్ కౌన్సిల్ ఎండీ స్యూచైలిస్ తదితరులు పాల్గొన్నారు. ఎసిలార్, ఎఫ్ఐఏ ఒప్పందం నానాటికీ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అంతర్జాతీయ సంస్థ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ అటోమొబైల్ (ఎఫ్ఐఏ), కంటి అద్దాల తయారీ సంస్థ ఎసిలార్లు చేతులు కలిపాయి. ఈ సందర్భంగా సదస్సులో ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.