చికిత్సలన్నీ మన వద్దే | CM YS Jagan Review on Health Hubs Family Doctor Concept Covid Control Vaccination | Sakshi
Sakshi News home page

చికిత్సలన్నీ మన వద్దే

Published Thu, Oct 7 2021 2:56 AM | Last Updated on Thu, Oct 7 2021 12:05 PM

CM YS Jagan Review on Health Hubs Family Doctor Concept Covid Control Vaccination - Sakshi

జనవరి 26 నాటికి పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను అమల్లోకి తీసుకురావడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలి. కొత్త పీహెచ్‌సీల నిర్మాణం, ఇప్పటికే ఉన్న పీహెచ్‌సీల్లో నాడు–నేడు పనులు, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలుకు అవసరమైన 104 వాహనాల కొనుగోళ్లు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలి. విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: వైద్యం కోసం ఇతర నగరాలు, రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండకూడదని  సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులకు స్పష్టం చేశారు. ఏ రకమైన చికిత్సలకు ఇతర రాష్ట్రాలకు, నగరాలకు వెళ్తున్నారో అలాంటి చికిత్సలు అందించే ఆస్పత్రులను రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో ఏర్పాటు చేసే హెల్త్‌ హబ్స్‌లో నిర్మించాలని ఆదేశించారు. హెల్త్‌ హబ్స్‌ ఏర్పాటు, మెడికల్‌ కాలేజీలు, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్, ఏపీ డిజిటల్‌ హెల్త్, కోవిడ్‌–19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హెల్త్‌ హబ్స్‌లో  ఏర్పాటయ్యేఆస్పత్రుల్లో అన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉండాలని, తద్వారా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలకు వైద్యం కోసం వెళ్లాల్సిన అవసరం ఉండకూడదని చెప్పారు. ఎలాంటి చికిత్స అయినా మన రాష్ట్రంలోనే అందించేలా స్పెషలైజేషన్‌తో కూడిన ఆస్పత్రులు ఏర్పాటు కావాలని  ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి సంబంధించి ఏమైనా అంశాలు పెండింగ్‌లో ఉంటే.. వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ నెలాఖరు నాటికి వాటిని పరిష్కరించి, పనులు శరవేగంగా ముందుకు సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జనవరి 26 నాటికి పూర్తి స్థాయిలో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు కావాలని, ఇందుకోసం ఇంకా అవసరమైన 104 వాహనాల కోనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
కోవిడ్‌ నియంత్రణపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం జగన్‌. చిత్రంలో మంత్రి ఆళ్ల నాని తదితరులు 

పీహెచ్‌సీల్లో మహిళా డాక్టర్ల నియామకం
► మహిళలు, బాలికల ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ద్వారా బాలికల ఆరోగ్యంపై దృష్టి పెట్టాం. దీని ద్వారా బాలికల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నాం. నెలకు ఒకసారి ఈ రకమైన కార్యక్రమం చేపడుతున్నాం. వీటిని దృష్టిలో ఉంచుకుని పీహెచ్‌సీ వైద్యుల నియామకాల్లో మహిళా డాక్టర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి. 
► ఆరోగ్య శ్రీపై గ్రామ, వార్డు సచివాలయాల్లో హోర్డింగ్స్‌ పెట్టాలి. ఆరోగ్య శ్రీ రిఫరెల్‌ మీద ప్రచారంతో పాటు ఆరోగ్య మిత్రల ఫోన్‌ నంబర్లను ఈ హోర్డింగ్స్‌లో ఉంచాలి. ఆరోగ్య శ్రీలో ఎంప్యానెల్‌ ఆస్పత్రుల జాబితాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలి. డిజిటల్‌ పద్ధతుల్లో పౌరులకు ఎంప్యానెల్‌ ఆస్పత్రుల జాబితాలు అందుబాటులో ఉంచాలి. 108 వాహనాల సిబ్బందికి కూడా రిఫరెల్‌ ఆస్పత్రుల జాబితా అందుబాటులో ఉంచాలి.

బ్లడ్‌ గ్రూప్‌ సహా ఆరోగ్య వివరాలన్నీ ఉండాలి
► ఏపీ డిజిటల్‌ హెల్త్‌కు సంబంధించి.. హెల్త్‌ కార్డుల్లో సంబంధిత వ్యక్తి ఆరోగ్య వివరాలన్నీ క్యూఆర్‌ కోడ్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఉండాలి. పరీక్షలు, వాటి ఫలితాలు, చేయించుకుంటున్న చికిత్సలు, వినియోగిస్తున్న మందులు.. ఇలా అన్ని వివరాలను ఆ వ్యక్తి డేటాలో భద్రపరచాలి. దీనివల్ల భవిష్యత్‌లో ఎక్కడకు వెళ్లినా సులభంగా వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుంది. 
► బ్లడ్‌ గ్రూపు లాంటి వివరాలు కూడా ఇందులో ఉండాలి. 104 ద్వారా వైద్యం అందించే క్రమంలో చేస్తున్న పరీక్షల ఫలితాలకు సంబంధించిన డేటాను ఎప్పటికప్పుడు ఈ హెల్త్‌ కార్డుల్లో పొందుపర్చాలి. (డిజిటిల్‌ హెల్త్‌ కార్యక్రమంలో భాగంగా పౌరులందరికీ హెల్త్‌ ఐడీలు క్రియేట్‌ చేస్తున్నామని అధికారులు తెలిపారు.) రాష్ట్రంలో కోవిడ్‌–19 నివారణ, నియంత్రణ, చికిత్సలపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. వ్యాక్సినేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు వీలైనంత త్వరగా పూర్తి చేయాలి.
► ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

కోవిడ్‌ కేసుల పరిస్థితి
► రాష్ట్రంలో యాక్టివ్‌ పాజిటివ్‌ కేసులు : 9,141
► రికవరీ రేటు శాతం : 98.86 
► ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు: 2,201
► కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్న వారు : 313 
► హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు: 6627
► జీరో కేసులు నమోదైన సచివాలయాలు : 11,997
► పాజిటివిటీ రేటు శాతం : 1.62 
► 0 నుంచి 3 శాతం వరకు పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలు : 12
► 3కు పైగా పాజిటివిటీ రేటు ఉన్న జిల్లా: 1

థర్డ్‌ వేవ్‌ సన్నద్ధత
► మొత్తం అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్స్‌ : 20,964
► ఇంకా రావాల్సినవి : 2,493
► అందుబాటులో ఉన్న డి టైప్‌ ఆక్సిజన్‌ సిలెండర్లు : 27,311 
► రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు : 140 
(ఇవి అక్టోబర్‌ ఆఖరుకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయి)   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement