హెల్త్ హబ్‌గా హైదరాబాద్
‘డబ్ల్యూసీవో–2017’లో మంత్రి లక్ష్మారెడ్డి
హైదరాబాద్: వైద్య, ఆరోగ్య రంగానికి ప్రత్యేక బడ్జెట్, అధిక నిధులు కేటాయించడంతో హైదరాబాద్ హెల్త్ హబ్‌గా మారిందని రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ మాదాపూర్ హెచ్‌ఐసీసీలో ‘వరల్డ్ కాంగ్రెస్ ఆఫ్ ఆప్తోమెట్రీ(డబ్ల్యూసీవో)–2017’అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు. కంటి ఆరోగ్యం, నాణ్యమైన చూపు అందరికీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో సదస్సు నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఐఎంఆర్, ఎంఎంఆర్, వ్యాక్సినేషన్ వంటి హెల్త్ ఇండికేటర్స్‌లో ఎంతో ప్రగతి సాధించామన్నారు. 3 రోజుల పాటు జరిగే సదస్సుకు 48 దేశాల నుంచి 1,500 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ జి.ఎన్. రావు, ప్రొఫెసర్ కోవిన్‌నాయుడు, డబ్ల్యూసీవో ప్రెసిడెంట్ డాక్టర్ ఉదక్ ఉడోమ్, ఇండియా విజన్ సీఈవో వినోద్ డానియేల్, ఆప్తోమెట్రీ వరల్డ్ కౌన్సిల్ ఎండీ స్యూచైలిస్ తదితరులు పాల్గొన్నారు.
ఎసిలార్, ఎఫ్‌ఐఏ ఒప్పందం
నానాటికీ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అంతర్జాతీయ సంస్థ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ అటోమొబైల్ (ఎఫ్‌ఐఏ), కంటి అద్దాల తయారీ సంస్థ ఎసిలార్‌లు చేతులు కలిపాయి. ఈ సందర్భంగా సదస్సులో ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.