కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
వెయ్యి ఎకరాల్లో ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్న సీఎం రేవంత్‌రెడ్డి
అన్ని రకాల వైద్యసేవలూ అందేలా ఆ హబ్‌ను తీర్చిదిద్దుతామని వెల్లడి..
బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న రేవంత్‌రెడ్డి
బంజారాహిల్స్ (హైదరాబాద్): రాష్ట్రంలో వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా హైదరాబాద్‌కు వస్తే.. ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు అందుతాయనేలా హబ్‌ను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 24వ వ్యవస్థాపక దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి హెల్త్ హబ్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.
అందులో బసవతారకం ఆస్పత్రికి స్థానం కచ్చితంగా ఉంటుందని చెప్పారు. పేదలకు సేవలందించే ఉద్దేశంతో ఆనాడు ఎన్టీఆర్ ఈ ఆస్పత్రి నిర్మాణానికి పూనుకున్నారని, ఆయన ఆలోచనా విధానాలను కొనసాగించాలని.. చంద్రబాబునాయుడు ఆస్పత్రిని పూర్తి చేసి పేదలకు సేవలందించేలా చేశారని పేర్కొన్నారు. ఆస్పత్రికి సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్నా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఈ ఆస్పత్రి వేడుకల్లో పాల్గొనడం తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ తాము అడిగిన వెంటనే పెండింగ్‌లో ఉన్న భూమి లీజు పొడిగించిన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ట్రస్ట్ బోర్డు సభ్యుడు, ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment