basavatharakam cancer hospital
-
ప్రపంచస్థాయి హెల్త్ హబ్: సీఎం రేవంత్‌రెడ్డి
బంజారాహిల్స్ (హైదరాబాద్): రాష్ట్రంలో వెయ్యి ఎకరాల్లో హెల్త్ టూరిజం హబ్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, ప్రపంచ దేశాల నుంచి ఎవరైనా హైదరాబాద్‌కు వస్తే.. ఇక్కడ అన్ని రకాల వైద్య సేవలు అందుతాయనేలా హబ్‌ను తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బంజారాహిల్స్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 24వ వ్యవస్థాపక దినోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి హెల్త్ హబ్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అందులో బసవతారకం ఆస్పత్రికి స్థానం కచ్చితంగా ఉంటుందని చెప్పారు. పేదలకు సేవలందించే ఉద్దేశంతో ఆనాడు ఎన్టీఆర్ ఈ ఆస్పత్రి నిర్మాణానికి పూనుకున్నారని, ఆయన ఆలోచనా విధానాలను కొనసాగించాలని.. చంద్రబాబునాయుడు ఆస్పత్రిని పూర్తి చేసి పేదలకు సేవలందించేలా చేశారని పేర్కొన్నారు. ఆస్పత్రికి సంబంధించి ఎలాంటి సహకారం కావాలన్నా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఆస్పత్రి వేడుకల్లో పాల్గొనడం తనకెంతో సంతోషాన్నిచ్చిందన్నారు. ఏపీ ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ తాము అడిగిన వెంటనే పెండింగ్‌లో ఉన్న భూమి లీజు పొడిగించిన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ట్రస్ట్ బోర్డు సభ్యుడు, ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఆ ఘనత సాధించిన తొలి డాక్టర్‌గా అనస్తీషియాలజిస్ట్ వైభవరి నాయక్
బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న అనస్తీషియాలజిస్ట్, ఇంటెన్సివ్ వైద్య నిపుణురాలు డాక్టర్ విభావరి నాయక్ ఏషియన్ సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్ అనస్తీషియాకు గౌరవ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఈనెల 16 నుంచి 18వరకు జరిగిన మూడు రోజుల కాన్ఫరెన్స్‌లో ఆమెను ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండేళ్ల పాటు ఆమె ఈ పదవికి ప్రాతినిధ్యం వహిస్తారు. 2010 నుంచి బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో ఆమె పని చేస్తున్నారు. అంతకు ముందు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ వేలూరులోని నిమ్స్, హైదరాబాదులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. అంతే కాకుండా యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఎంజిల్స్‌లో ప్రత్యేకమైన రీసెర్చి ఫెలోషిప్ చేశారు. భారత దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో పలు సంస్థలతో కలసి పీడియాట్రిక్ అనస్థీషియాపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇండియన్ సొసైటీ అఫ్ అనస్థీషియాలజిస్టులు, ఇండియన్ ఆసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్ అనస్థీషియాలజీ, ఇండియన్ కాలేజీ ఆఫ్ అనస్థీషియాలజిస్టులు, సొసైటీ ఆఫ్ ఆంకో అనస్థీషియా, పెరీ ఆపరేటివ్ కేర్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాలయేటివ్ కేర్, ఇండియన్ సొసైటీ అఫ్ క్రిటికల్ మెడిసన్ లాంటి ఎన్నో ప్రఖ్యాత సంస్థలలో ఆమె సభ్యులుగా కొనసాగుతున్నారు. భారత దేశంతో పాటూ పలు దేశాలలో ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా పలు ప్రఖ్యాత మెడికల్ జర్నల్స్ అయిన ఇండియన్ జర్నల్ ఆఫ్ అనస్థీషియా, జర్నల్ ఆఫ్ అనస్థీషియా ,క్లినికల్ ఫార్మకాలజీ, జర్నల్ ఆఫ్ సెల్యులర్ మరియు మాలిక్యులర్ అనస్థీషియా వంటి వాటికి రివ్యూయర్ గా కూడా పని చేస్తున్నారు. 50కి పైగా ఇండెక్సెడ్ ప్రచురణలు ,ఎనిమిది పుస్తకాలలో ప్రత్యేకమైన చాప్టర్లను డా. విభావరి నాయక్ రచించారు. ఇప్పుడు ఏషియన్ సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్ అనస్తీషియా గౌరవ కార్యదర్శిగా ఎన్నికకావడం పట్ల డా.విభావరి నాయక్ ఆనందం వ్యక్తం చేశారు. ఆసియా ఖండంలోని ప్రతి ఒక్కరితో పని చేసే గొప్ప అవకాశాన్ని తాను పొందానని, మూల ప్రాంతాలకు కూడా వైద్య నైపుణ్యాన్ని చేర్చడానికి తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు. -
మందుబాబుపై కేసు
బంజారాహిల్స్: మద్యం సేవించి బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వైపు నుంచి కేబీఆర్ పార్కు వైపు బైక్ వెళుతూ వాహనదారులు, పాదచారులను భయబ్రాంతులకు గురి చేస్తున్న మందుబాబును ట్రాఫిక్ పోలీసులు ఆపి శ్వాసపరీక్షలు నిర్వహించారు. నంబర్ ప్లేట్ లేని బైక్‌పై వెళుతూ ఇతర వాహనదారులను ఇబ్బందులకు గురిచేసిన సతీష్ అనే వ్యక్తిని పరీక్షించగా 396 బీఏసీ నమోదైంది. వాహనాన్ని రెండు నెలల క్రితం కొనుగోలు చేయగా ఇంతవరకు రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోకపోగా మోతాదుకు మించి మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు తేలింది. వాహనాన్ని సీజ్ చేసి కేసు నమోదు చేశారు. -
చండీయాగంలో బాలయ్య
బంజారాహిల్స్: లోక కల్యాణార్థం బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి విజయగణపతి ఆలయంలో జరుగుతున్న మహారుద్రయాగ సహిత చండీ మహాయాగంలో ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు. ఈనెల 17న ప్రారంభమైన యాగం శనివారంతో ముగిసింది. చవరిరోజు బాలకృష్ణ పాల్గొని మహాపూర్ణాహుతి నిర్వహించారు. విజయగణపతి ఆలయం ప్రధాన అర్చకుడు విష్ణుభట్ల ఆంజనేయ చయనులు నేతృత్వంలో ఈ మహాయాగం జరిగింది. విశేష పూజల్లో భక్తులు పాల్గొని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.