బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న అనస్తీషియాలజిస్ట్, ఇంటెన్సివ్ వైద్య నిపుణురాలు డాక్టర్ విభావరి నాయక్ ఏషియన్ సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్ అనస్తీషియాకు గౌరవ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఈనెల 16 నుంచి 18వరకు జరిగిన మూడు రోజుల కాన్ఫరెన్స్‌లో ఆమెను ఈ పదవికి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండేళ్ల పాటు ఆమె ఈ పదవికి ప్రాతినిధ్యం వహిస్తారు. 2010 నుంచి బసవతారకం కేన్సర్ ఆసుపత్రిలో ఆమె పని చేస్తున్నారు.
అంతకు ముందు క్రిస్టియన్ మెడికల్ కాలేజీ వేలూరులోని నిమ్స్, హైదరాబాదులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. అంతే కాకుండా యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఎంజిల్స్‌లో ప్రత్యేకమైన రీసెర్చి ఫెలోషిప్ చేశారు. భారత దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో పలు సంస్థలతో కలసి పీడియాట్రిక్ అనస్థీషియాపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఇండియన్ సొసైటీ అఫ్ అనస్థీషియాలజిస్టులు, ఇండియన్ ఆసోసియేషన్ ఆఫ్ పీడియాట్రిక్ అనస్థీషియాలజీ, ఇండియన్ కాలేజీ ఆఫ్ అనస్థీషియాలజిస్టులు, సొసైటీ ఆఫ్ ఆంకో అనస్థీషియా, పెరీ ఆపరేటివ్ కేర్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పాలయేటివ్ కేర్, ఇండియన్ సొసైటీ అఫ్ క్రిటికల్ మెడిసన్ లాంటి ఎన్నో ప్రఖ్యాత సంస్థలలో ఆమె సభ్యులుగా కొనసాగుతున్నారు.
భారత దేశంతో పాటూ పలు దేశాలలో ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా పలు ప్రఖ్యాత మెడికల్ జర్నల్స్ అయిన ఇండియన్ జర్నల్ ఆఫ్ అనస్థీషియా, జర్నల్ ఆఫ్ అనస్థీషియా ,క్లినికల్ ఫార్మకాలజీ, జర్నల్ ఆఫ్ సెల్యులర్ మరియు మాలిక్యులర్ అనస్థీషియా వంటి వాటికి రివ్యూయర్ గా కూడా పని చేస్తున్నారు. 50కి పైగా ఇండెక్సెడ్ ప్రచురణలు ,ఎనిమిది పుస్తకాలలో ప్రత్యేకమైన చాప్టర్లను డా. విభావరి నాయక్ రచించారు. ఇప్పుడు ఏషియన్ సొసైటీ ఆఫ్ పీడియాట్రిక్ అనస్తీషియా గౌరవ కార్యదర్శిగా ఎన్నికకావడం పట్ల డా.విభావరి నాయక్ ఆనందం వ్యక్తం చేశారు. ఆసియా ఖండంలోని ప్రతి ఒక్కరితో పని చేసే గొప్ప అవకాశాన్ని తాను పొందానని, మూల ప్రాంతాలకు కూడా వైద్య నైపుణ్యాన్ని చేర్చడానికి తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment