16 More Health Hubs In Andhra Pradesh: Vidadala Rajini - Sakshi
Sakshi News home page

ఏపీలో16 చోట్ల హెల్త్‌ హ‌బ్‌లు

Published Tue, Nov 29 2022 3:18 PM | Last Updated on Tue, Nov 29 2022 6:34 PM

16 More Health Hubs In Andhra Pradesh Vidadala Rajini - Sakshi

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో 16 చోట్ల హెల్త్‌ హబ్‌ల ఏర్పాటు చేయాల‌ని ముఖ్య‌మంత్రివ‌ర్యులు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నిర్ణ‌యం తీసుకున్నార‌ని, ఆ దిశ‌గా చ‌ర్య‌లు కూడా తీసుకున్నామ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. కాన్ఫ‌డ‌రేష‌న్ ఆఫ్ ఇండియ‌న్ ఇండ‌స్ట్రీ (భార‌త  ప‌రిశ్ర‌మ‌ల స‌మాఖ్య‌) ఆధ్వ‌ర్యంలో సోమ‌వారం రాత్రి న్యూ ఢిల్లీలో ఏపీ ప్ర‌భుత్వ ఉన్న‌త‌స్థాయి ప్ర‌తినిధులతో  ప్ర‌పంచ స్థాయిలో పేరున్న‌ ప్రైవేటు ఆస్ప‌త్రులు, డ‌యాగ్న‌స్టిక్ యూనిట్ల అధినేత‌ల స‌మావేశాన్ని నిర్వ‌హించారు.

ఏపీ ప్ర‌భుత్వ ఉన్న‌త‌స్థాయి ప్ర‌తినిధి బృందంలో మంత్రి విడ‌ద‌ల ర‌జినితోపాటు వైద్య ఆరోగ్య‌శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ఎం.టి.కృష్ణ‌బాబు, ప్ర‌భుత్వ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి జీఎస్ న‌వీన్‌కుమార్ ఉన్నారు. మేదాంత‌- ద మెడ్‌సిటీ, మ‌ణిపాల్, ప‌నాసియా ఇండియా, పోలీ మెడిక్యూర్ లిమిటెడ్‌, బాస్క్ మ‌రియు లోంబ్ ఐ కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌, ఇండియ‌న్ ఫార్మాస్యూటిక‌ల్స్ అలియ‌న్స్‌, పారాస్ హాస్పిట‌ల్స్‌, అపోల్ హాస్పిట‌ల్స్ గ్రూప్‌, పీడీ హిందూజా హాస్పిట‌ల్స్‌, చార్‌నాక్ హాస్పిట‌ల్స్‌, ఉజాలా సైన‌స్‌, ప్రిస్టిన్ కేర్‌, మ్యాక్స్ హెల్త్ కేర్‌.... ఇలా దాదాపు 25కుపైగా ప్రఖ్యాత ఆస్ప‌త్రులు, డ‌యాగ్న‌స్టిక్ సెంట‌ర్లు, వైద్య ప‌రిక‌రాల త‌యారీ కంపెనీల అధినేత‌లు హాజ‌ర‌య్యారు. మంత్రి మాట్లాడుతూ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ఉన్న అనువైన అవ‌కాశాల‌ను వారికి వివ‌రించారు. సీఐఐ ప్ర‌తినిధులు సైతం ఏపీలో వైద్య ఆరోగ్య రంగం కొత్త పుంత‌లు తొక్కుతోంద‌ని ఈ స‌మావేశంలో ప్ర‌శంసించారు.

పేద‌ల‌కు మ‌రింత మేలు చేసేందుకే హెల్త్‌ హబ్‌లు
మంత్రి విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ పేద‌ల‌కు మ‌రింత మెరుగైన వైద్యం, మరింత చేరువ చేసే ల‌క్ష్యంతోనే ముఖ్య‌మంత్రి వ‌ర్యులు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హెల్త్‌ హ‌బ్‌లను ఏర్పాటుచేస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌పంచ‌స్థాయి ప్ర‌మాణాల‌తో క‌నీసం 100 ప‌డ‌క‌ల ఆస్ప‌త్రి నిర్మాణానికి ఎవ‌రైతే ముందుకు వ‌స్తారో.. వారికి ఉచితంగా 5 ఎక‌రాల స్థ‌లం ప్ర‌భుత్వ‌మే ఇస్తుంద‌ని తెలిపారు. ఆస్ప‌త్రుల‌ను త్వ‌ర‌గా నిర్మించి, 50 శాతం ప‌డ‌క‌ల‌ను ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం ల‌బ్ధిదారుల‌కు కేటాయించాల్సి ఉంటుంద‌న్నారు.

దీనివ‌ల్ల పేద‌ల‌కు ప్ర‌పంచ‌స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందించేవీలు ఏర్ప‌డుతుంద‌ని తెలిపారు. హెల్త్‌ హ‌బ్‌ల ఏర్పాటుకు ముందుకు వ‌చ్చే ఆస్ప‌త్రుల యాజ‌మాన్యాల‌కు ప్ర‌భుత్వం పూర్తి స్థాయిలో అండ‌గా ఉంటుంద‌ని తెలిపారు. సింగిల్ విండో విధానం ద్వారా ప్ర‌భుత్వ అనుమ‌తుల‌న్నీ ఇచ్చేలా సీఎం జ‌గ‌న్ చ‌ర్య‌లు తీసుకున్నార‌ని చెప్పారు. విశాఖ‌ప‌ట్ట‌ణంలోని మెడ్ సిటీ లో ఇప్ప‌టికే ఎన్నో సంస్థ‌లు ఏర్పాట‌య్యాయ‌ని, అవి వాటి కార్య‌క‌లాపాల‌ను విజ‌య‌వంతంగా కొన‌సాగిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. మెడ్‌సిటీలో పెట్టుబ‌డులు పెట్టేవారికి ప్ర‌భుత్వం అన్ని విధాలా స‌హ‌క‌రిస్తున్న‌ద‌న్నారు.

2200కుపైగా ఆస్ప‌త్రుల్లో 3255 చికిత్స‌ల‌కు ఉచితంగా వైద్యం
ఏపీలో ప్ర‌స్తుతం 2200కుపైగా ఆస్ప‌త్రుల్లో ఆరోగ్య‌శ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందుతోంద‌ని మంత్రి తెలిపారు. ఏకంగా  3255 చికిత్స‌ల‌కు ఉచితంగా వైద్యం అందుతోంద‌న్నారు. ఏటా రూ.3వేల కోట్లు ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కం కోసం ఖ‌ర్చు చేస్తున్న‌ద‌న్నారు. వైద్యం చేసిన ప్ర‌తి ఆస్ప‌త్రికి బ‌కాయిలు లేకుండా ఎప్ప‌టిక‌ప్పుడు బిల్లులు చెల్లిస్తున్నామ‌ని తెలిపారు. భారీగా ఖ‌ర్చ‌య్యే 15 చికిత్స‌ల‌కు పూర్తి ఉచితంగా ప్ర‌భుత్వ‌మే వైద్యం చేయిస్తోంద‌ని వివ‌రించారు. వేల కోట్ల ఖ‌ర్చు కాదు.. హెల్త్‌ హ‌బ్‌ల ఏర్పాటుకు కావాల్సిన భూమి, అన్ని వ‌స‌తులు కూడా ఇచ్చేందుకు జ‌గ‌న‌న్న ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌న్నారు.

పెట్టుబడులు పెట్టండి
మంత్రి విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ రాష్ట్రంలో 16 చోట్ల హెల్త్‌ హ‌బ్ ల ఏర్పాటు, స‌మగ్ర క్యాన్స‌ర్ కేర్ సెంట‌ర్ల ఏర్పాటు, ఎమ్ ఆర్ ఐ, సీటీ, క్యాత్ ల్యాబ్‌ల ఏర్పాటు, డ‌యాగ్న‌స్టిక్ సెంటర్ల ఏర్పాటు, వాటి నిర్వ‌హ‌ణ, ఏపీలో ఆరోగ్య‌సేవ‌ల డిజిట‌లైజేష‌న్‌లో స‌హ‌కారం..... లాంటి కీల‌క అంశాల్లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని ఆయా సంస్థ‌ల‌ను కోరారు. పారిశ్రామిక వేత్త‌ల‌కు త‌మ ప్ర‌భుత్వం ఫోన్ కాల్ దూరంలో ఉంటుంద‌ని స్ప‌ష్టంచేశారు. అత్యాధునిక వైద్య వ‌స‌తులు అందుబాటులోకి తీసుకొచ్చి ప్ర‌జ‌ల‌కు మెరుగైన వైద్యం ఉచితంగా అందించేందుకు జ‌గ‌న‌న్న క‌ట్టుబ‌డి ఉన్నార‌ని తెలిపారు.

పేద‌ల‌కు రూపాయి ఖ‌ర్చు లేకుండా నాణ్య‌మైన ఆరోగ్య సేవ‌లు అందించాల‌నేది త‌మ ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలోని ప్ర‌భుత్వ పెద్ద ఆస్ప‌త్రుల‌న్నింటినీ ఆధునికీక‌రిస్తున్నామ‌న్నారు. ఇప్ప‌టికే రాష్ట్రంలోని మెడిక‌ల్ క‌ళాశాలల అనుబంధ ఆస్ప‌త్రులు, జిల్లా ఆస్ప‌త్రులు ఎన్ఏబీహెచ్ (నేష‌న‌ల్ అక్రిడిటేష‌న్ బోర్డ్ ఆఫ్ హాస్ప‌ట‌ల్స్‌) గుర్తింపు కూడా పొందుతున్నాయ‌ని తెలిపారు. ఏలూరు లాంటి ఆస్ప‌త్రుల‌కు ఎన్ఏబీహెచ్ గుర్తింపు రావ‌డం త‌మ ప్ర‌భుత్వ విజ‌యానికి నిద‌ర్శ‌మ‌ని వివ‌రించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement