సాక్షి, అమరావతి: హెల్త్‌హబ్స్ ద్వారా రాష్ట్రంలో 13 కార్పొరేట్ ఆస్పత్రుల నిర్మాణంలో పాలుపంచుకునేందుకు దేశవ్యాప్తంగా పలు ప్రముఖ వైద్య సంస్థలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. అన్ని జిల్లాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 13 చోట్ల మల్టీ/సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణానికి ఆసక్తి కలిగిన సంస్థల నుంచి ఆహ్వానించిన టెండర్లకు భారీ స్పందన వచ్చింది. తాజాగా టెండర్లలో పాల్గొనడానికి ముందు నిర్వహించే ప్రీ బిడ్డింగ్ సమావేశంలో దేశవ్యాప్తంగా 28కి పైగా సంస్థలు పాల్గొన్నట్లు ఏపీఐఐసీ అధికారులు వెల్లడించారు. వర్చువల్ విధానంలో జరిగిన ప్రీ బిడ్ మీటింగ్‌లో ఏఐజీ, అపోలో, కేర్, కిమ్స్, సన్‌షైన్, రెయిన్‌బో, నారాయణ హృదయాలయ, మణిపాల్ లాంటి ప్రముఖ కార్పొరేట్ వైద్యసంస్థలు పాల్గొన్నాయి.
ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తూనే..
అత్యున్నత వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒకపక్క నాడు – నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తూనే ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున కార్పొరేట్ ఆస్పత్రులను అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి పట్టణాల్లో మల్టీ/ సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణానికి బిడ్లను ఆహ్వానిస్తూ ఏపీఐఐసీ టెండర్లను పిలిచింది.
హెల్త్ హబ్స్ పేరుతో అభివృద్ధి చేస్తున్న 13 కార్పొరేట్ ఆస్పత్రుల ప్రాధాన్యం గురించి ప్రీ బిడ్డింగ్‌లో వివరించారు. కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి, 100 పడకలతో ఆస్పత్రుల నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుంది. వీటిలో 50 శాతం బెడ్లను వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద కేటాయిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను కార్పొరేట్ వైద్య సంస్థలు స్వాగతించాయని, బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపినట్లు ఏపీఐఐసీ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment