Medical companies
-
సైబర్‌క్రైమ్‌ను ఆశ్రయించిన సచిన్ టెండూల్కర్
తన పేరును అక్రమంగా ఉపయోగిస్తూ దుర్వినియోగం చేస్తోన్న ఓ మెడికల్ కంపెనీపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కేసు పెట్టాడు. సచిన్ అనుమతి లేకుండా అతడి ఫొటోలతో పాటు వాయిస్‌ను ప్రమోషన్స్ కోసం ఈ మెడికల్ కంపెనీ ఉపయోగించుకుంటున్నట్లు తేలింది. ఈ మెడికల్ కంపెనీపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సచిన్ టెండూల్కర్ సైబర్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది. సచిన్హెల్త్. ఇన్ పేరుతో డ్రగ్ కంపెనీ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసింది. సచిన్ ఫొటోను ఉపయోగిస్తూ తమ సంస్థకు చెందిన మెడికల్ ప్రొడక్ట్స్‌ను అమ్ముకుంటున్నట్లు సమాచారం. సచిన్ వాయిస్‌ను డబ్బింగ్ ద్వారా ఉపయోగిస్తూ ప్రమోషన్స్ చేస్తోన్నట్లు తెలిసింది. తన పేరును ఉపయోగించుకునేలా ఈ సంస్థకు సచిన్ ఎలాంటి అనుమతలు ఇవ్వలేదని తెలిసింది. తన అనుమతి లేకుండా పేరుతో పాటు వాయిస్, ఫొటోగ్రాఫ్స్ వాడుతోన్న మెడికల్ కంపెనీపై చర్యలు తీసుకోవాలంటూ సచిన్ వెస్ట్ రీజియన్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెబుతోన్నారు. సచిన్ వన్డేలకు 2012లో, టెస్ట్‌లకు 2013లో రిటైర్మెంట్ ప్రకటించాడు. అయినా అతడికి ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఒక్కో బ్రాండ్ ప్రమోషన్స్ కోసం సచిన్ టెండూల్కర్ ఏడు నుంచి ఎనిమిది కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. కోహ్లి, ధోనీ తర్వాత బ్రాండ్స్ ద్వారా అత్యధికంగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న క్రికెటర్‌గా సచిన్ నిలుస్తోన్నాడు. చదవండి: భారీ ఓటమి తప్పదనుకున్నవేళ రషీద్ సంచలన ఇన్నింగ్స్ -
మోల్బియోలో టెమసెక్ పెట్టుబడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్య పరికరాల తయారీలో ఉన్న మోల్బియో డయాగ్నోస్టిక్స్ తాజాగా అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ టెమసెక్ నుంచి రూ.695 కోట్ల నిధులను అందుకుంది. ఆధునిక సాంకేతిక ఉత్పత్తుల అభివృద్ధికి ఈ నిధులను వెచ్చిస్తామని కంపెనీ ప్రకటించింది. క్షయ వ్యాధి నిర్ధారణకు ఉపయోగించే ట్రూనాట్ పరికరాన్ని మోల్బియో డయాగ్నోస్టిక్స్ రూపొందించింది. 40కిపైగా దేశాల్లో ఈ పరికరాన్ని వినియోగిస్తున్నారు. చదవండి: స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో కొత్త రూల్స్ వచ్చాయ్.. ఇది తప్పనిసరి! -
'హెల్త్ హబ్స్'పై ప్రముఖ వైద్య సంస్థల ఆసక్తి
సాక్షి, అమరావతి: హెల్త్‌హబ్స్ ద్వారా రాష్ట్రంలో 13 కార్పొరేట్ ఆస్పత్రుల నిర్మాణంలో పాలుపంచుకునేందుకు దేశవ్యాప్తంగా పలు ప్రముఖ వైద్య సంస్థలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. అన్ని జిల్లాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 13 చోట్ల మల్టీ/సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణానికి ఆసక్తి కలిగిన సంస్థల నుంచి ఆహ్వానించిన టెండర్లకు భారీ స్పందన వచ్చింది. తాజాగా టెండర్లలో పాల్గొనడానికి ముందు నిర్వహించే ప్రీ బిడ్డింగ్ సమావేశంలో దేశవ్యాప్తంగా 28కి పైగా సంస్థలు పాల్గొన్నట్లు ఏపీఐఐసీ అధికారులు వెల్లడించారు. వర్చువల్ విధానంలో జరిగిన ప్రీ బిడ్ మీటింగ్‌లో ఏఐజీ, అపోలో, కేర్, కిమ్స్, సన్‌షైన్, రెయిన్బో, నారాయణ హృదయాలయ, మణిపాల్ లాంటి ప్రముఖ కార్పొరేట్ వైద్యసంస్థలు పాల్గొన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తూనే.. అత్యున్నత వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒకపక్క నాడు – నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తూనే ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున కార్పొరేట్ ఆస్పత్రులను అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి పట్టణాల్లో మల్టీ/ సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణానికి బిడ్లను ఆహ్వానిస్తూ ఏపీఐఐసీ టెండర్లను పిలిచింది. హెల్త్ హబ్స్ పేరుతో అభివృద్ధి చేస్తున్న 13 కార్పొరేట్ ఆస్పత్రుల ప్రాధాన్యం గురించి ప్రీ బిడ్డింగ్‌లో వివరించారు. కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి, 100 పడకలతో ఆస్పత్రుల నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుంది. వీటిలో 50 శాతం బెడ్లను వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద కేటాయిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను కార్పొరేట్ వైద్య సంస్థలు స్వాగతించాయని, బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపినట్లు ఏపీఐఐసీ అధికారులు వెల్లడించారు. -
భారతీయ ఫార్మా కంపెనీలపై దావా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఔషధ కంపెనీలు యూఎస్‌లో ఓ దావాను ఎదుర్కొంటున్నాయి. వీటిలో సన్ ఫార్మా, లుపిన్, అరబిందో సహా 26 కంపెనీలు ఉన్నాయి. కుట్రపూరితంగా ధరలను కృత్రిమంగా పెంచడం, పోటీని తగ్గించడం, యూఎస్‌లో జరుగుతున్న జనరిక్ డ్రగ్స్ వ్యాపారాన్ని అడ్డుకున్నాయని ఆరోపిస్తూ మేరీల్యాండ్ అటార్నీ జనరల్ బ్రియాన్ ఇ ఫ్రోష్ కనెక్టికట్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించారు. జనరిక్ డ్రగ్ మార్కెట్ తిరిగి గాడిలో పడేందుకై ఈ కంపెనీలతోపాటు 10 మంది వ్యక్తులను ఇందుకు బాధ్యులుగా చేస్తూ వీరి నుంచి నష్టపరిహారం, జరిమానాతోపాటు తగు చర్యలు తీసుకోవాలని దావాలో కోరారు. 80 రకాల జనరిక్ డ్రగ్స్ విషయమై విచారణ సాగనుంది. మేరీల్యాండ్‌తోపాటు యూఎస్‌లోని అన్ని రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఈ దావా దాఖలులో సహ పార్టీలుగా ఉన్నారు. ఈ కంపెనీల ధర నియంత్రణ పథకాలు రోగులకు, బీమా కంపెనీలకు భారంగా మారాయి అని ఫ్రోష్ వెల్లడించారు. ఇప్పటికే కొనసాగుతున్న విచారణకుతోడు తాజాగా వేసిన దావా మూడవదికాగా, కంపెనీలు ఇలా ఏకమై ధరలు పెంచిన కేసు యూఎస్ చరిత్రలో అతిపెద్దది అంటూ వ్యాఖ్యానించారు. -
కేన్సర్ మందుల తయారీలో ‘గ్రేటర్’
సాక్షి, హైదరాబాద్: ‘ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వివిధ రకాల కేన్సర్ల మందుల తయారీకి రాజధాని గ్రేటర్ నగరం చిరునామాగా నిలుస్తోంది. నగరంలో 500కి పైగా అతిపెద్ద మెడికల్ కంపెనీలు ఉన్నాయి. ప్రపంచంలోని నిత్యం ప్రతి ముగ్గురు వ్యక్తులు వాడేమందుల్లో ఒకరు వాడేవి హైదరాబాద్‌లో తయారైన మందులే. నగరంలో తయారవుతున్న పలు అరుదైన డ్రగ్స్ అమెరికా, యూరప్, ఆఫ్రికా లాంటి ఎన్నో దేశాలకు ఎగుమతవుతున్నాయి’ అని ఇన్నోవేట్ -16 కన్వీనర్, పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్, డాక్టర్ వి. రామమోహన్ గుప్తా తెలిపారు. రవీంద్రభారతిలో పుల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ, ఇస్పోర్ ఇండియా తెలంగాణ చాప్టర్ సంయుక్తంగా జాతీయ ఔషధ విధానంపై అంతర్జాతీయ సదస్సు(ఇన్నోవేట్-16) నిర్వహించాయి. సదస్సులో పాల్గొన్న రామమోహన్ సాక్షికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... యాంటీ కేన్సర్ డ్రగ్స్ ఎక్కువగా హైదరాబాద్‌లోని పరిశ్రమల్లోనే తయారు చేస్తారని తెలిపారు. ఇక్కడ ప్రధానంగా బల్క్ డ్రగ్స్, ఫార్మేషన్ డ్రగ్స్ తయారు చేస్తారన్నారు. రెడ్డీస్, హెటిరో వంటి పెద్ద పెద్ద కంపెనీలు ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క మెడిసిన్‌ను తయారు చేయటంలో పేరెన్నిక గన్నవన్నారు. కొన్ని కంపెనీలు యాంటీ సైకో మెడిసిన్‌ను కూడా ఇక్కడ తయారు చేస్తుండటం విశేషంగా చెప్పవచ్చని తెలిపారు. ముగిసిన అంతర్జాతీయ సదస్సు యూజ్‌ఫుల్ నేషనల్ మెడికల్ పాలసీ(జాతీయ ఔషధ విధానం) పై రెండు రోజుల పాటు హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన సదస్సు గురువారం ముగిసిందని డాక్టర్ రామమోహన్ తెలిపారు. ఇందులో మలేసియా, థాయ్‌లాండ్ నుంచి మూడు వర్సిటీ ప్రతినిధులు పాల్గొని పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చే శారని తెలిపారు. మలేసియా టైలర్స్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ పీటీ థామస్ సేప్‌రేషనల్ అపాడ్ బుక్ గుడ్ క్వాలిటీ డ్రగ్స్ అనే అంశంపై చేసిన ఉపన్యాసం ఫార్మసీ విద్యార్థులకు ఎంతో ఉపయోగకారిగా ఉండబోతుందని చెప్పారు. మలేసియా యూనివర్సిటీ ప్రొఫెసర్ జోరియా అజీజ్ ప్రత్యేకంగా మెటా అనాలిసిస్‌పై చేసిన ప్రసంగం ఫార్మసీ విద్యార్థులకు ఒక చరిత్రగా మిగిలిపోతుందన్నారు. ఐటీ పార్కు సిటీకి ఒక వైపు ఉన్నట్లుగానే ఫార్మా హబ్ కూడా శంషాబాద్ సమీపంలో ఏర్పాటు కానున్నదని రామమోహన్ గుప్తా తెలిపారు. అక్కడికి వెళ్లేందుకు మందుల కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలకు చెందిన 12 మంది ఫార్మసీ విద్యార్థులు ఈ సదస్సులో పాల్గొన్నారని ఆయన చెప్పారు. సదస్సు ముగింపు సందర్భంగా గురువారం మధ్యాహ్నం ఫార్మసీ విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జాతీయ ఔషధ విధానంపై నిర్వహించిన పోస్టర్ల ప్రదర్శన పోటీలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు.