హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఔషధ కంపెనీలు యూఎస్‌లో ఓ దావాను ఎదుర్కొంటున్నాయి. వీటిలో సన్ ఫార్మా, లుపిన్, అరబిందో సహా 26 కంపెనీలు ఉన్నాయి. కుట్రపూరితంగా ధరలను కృత్రిమంగా పెంచడం, పోటీని తగ్గించడం, యూఎస్‌లో జరుగుతున్న జనరిక్ డ్రగ్స్ వ్యాపారాన్ని అడ్డుకున్నాయని ఆరోపిస్తూ మేరీల్యాండ్ అటార్నీ జనరల్ బ్రియాన్ ఇ ఫ్రోష్ కనెక్టికట్ డిస్ట్రిక్ట్ కోర్టును ఆశ్రయించారు. జనరిక్ డ్రగ్ మార్కెట్ తిరిగి గాడిలో పడేందుకై ఈ కంపెనీలతోపాటు 10 మంది వ్యక్తులను ఇందుకు బాధ్యులుగా చేస్తూ వీరి నుంచి నష్టపరిహారం, జరిమానాతోపాటు తగు చర్యలు తీసుకోవాలని దావాలో కోరారు.
80 రకాల జనరిక్ డ్రగ్స్ విషయమై విచారణ సాగనుంది. మేరీల్యాండ్‌తోపాటు యూఎస్‌లోని అన్ని రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఈ దావా దాఖలులో సహ పార్టీలుగా ఉన్నారు. ఈ కంపెనీల ధర నియంత్రణ పథకాలు రోగులకు, బీమా కంపెనీలకు భారంగా మారాయి అని ఫ్రోష్ వెల్లడించారు. ఇప్పటికే కొనసాగుతున్న విచారణకుతోడు తాజాగా వేసిన దావా మూడవదికాగా, కంపెనీలు ఇలా ఏకమై ధరలు పెంచిన కేసు యూఎస్ చరిత్రలో అతిపెద్దది అంటూ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment