Multi Specialty Hospitals
-
మహిళల కోసం... మహిళల చేత!
ఆ హాస్పిటల్లో మహిళలే డాక్టర్లు. వార్డ్ బాయ్ అనే పదం వినిపించదు. అన్ని సర్వీస్‌లూ మహిళలే అందిస్తారు. నైట్ షిఫ్ట్ అని వెనుకడుగు వేయడం ఉండదు. ఇరవై నాలుగ్గంటలూ మహిళలే పని చేస్తారు. ఎమ్ఎమ్సీహెచ్... అంటే ముస్లిమ్ మెటర్నిటీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్. ఇది హైదరాబాద్, చాదర్‌ఘాట్, ఉస్మాన్ పురాలో ఉంది. ఈ హాస్పిటల్ గురించి చెప్పుకోవలసింది చాలానే ఉంది. మహిళల కోసం యాభై మూడేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్లో సీఈవో నుంచి సెక్యూరిటీ స్టాఫ్ వరకూ అందరూ మహిళలే. నో ప్రాఫిట్ నో లాస్ విధానంలో పని చేస్తున్న ఈ హాస్పిటల్ గురించి సీఈవో డాక్టర్ నీలోఫర్ ఇలా వివరించారు. ► మూడు వందలకు పైగా... ‘‘మహిళా సాధికారతకు చిహ్నం మా హాస్పిటల్. ఇది 200 పడకల హాస్పిటల్. కులం, మతం, ప్రాంతం అనే భేదాలు లేకుండా మహిళలందరికీ వైద్యసేవలందిస్తాం. విశేషం ఏమిటంటే... మహిళల కోసం ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్లో మూడు వందల మందికి పైగా మహిళలం సేవలందిస్తున్నాం. ప్రధాన ద్వారం సెక్యూరిటీ నుంచి రిసెప్షన్, ఫార్మసీ, ఫార్మసీ స్టోర్స్ నిర్వహణ, ల్యాబ్ టెక్నీషియన్ లు అందరూ మహిళలే. అంబులెన్స్ డ్రైవర్లు, వెనుక ద్వారం దగ్గర సెక్యూరిటీ దగ్గర మాత్రం మగవాళ్లు డ్యూటీ చేస్తారు. ‘ఇస్లామిక్ సోషల్ సర్వీస్ సొసైటీ’ నగరంలో స్థాపించిన మూడు స్కూళ్లు, మూడు హాస్పిటళ్లలో ఇది ఒకటి. మహిళల హాస్పిటల్‌గా పేరు వచ్చినప్పటికీ నిజానికి ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇందులో చిన్నపిల్లల విభాగం, డర్మటాలజీ, జనరల్ ఫిజీషియన్, జనరల్ సర్జరీ విభాగాలు కూడా పని చేస్తున్నాయి. రోజుకు ఓపీ రెండు వందల వరకు ఉంటుంది. అందులో నూట పాతిక వరకు మహిళలే ఉంటారు. నెలకు సరాసరిన రెండు వందల డెలివరీలుంటాయి. ► ట్వంటీ ఫోర్ బై సెవెన్ ! సెక్యూరిటీ, ఫార్మసీ, రిసెప్షన్ ఇరవై నాలుగ్గంటలూ పని చేస్తుంటాయి. వారంలో ఏడు రోజులూ, రోజులో ఇరవై నాలుగ్గంటలూ డ్యూటీలో ఉంటారు మహిళలు. మీకో సంగతి తెలుసా? మా హాస్పిటల్లో డే కేర్ సెంటర్ ఉంది. మహిళకు తగిన సౌకర్యాలు కల్పిస్తే ఏ షిఫ్ట్‌లోనైనా డ్యూటీ చేయగలరని నిరూపిస్తోంది మా హాస్పిటల్. ఇది టీచింగ్ హాస్పిటల్. వరంగల్, కెఎన్ ఆర్ యూనివర్సిటీలతో అనుసంధానమై ఉంది. బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ నుంచి ఏటా ముపై ్పమందికి మహిళలకు అవకాశం ఉంటుంది. హాస్టల్ కూడా ఇదే ప్రాంగణం లో ఉంది. మా హాస్పిటల్లో కెఫెటేరియాతోపాటు లైబ్రరీ కూడా ఉంది చూడండి. వైద్యరంగంలో అమూల్యమైన పుస్తకాల కలెక్షన్ ఉంది. బయటకు ఇవ్వం, ఎవరైనా వచ్చి చదువుకోవచ్చు. ► వైద్యపరీక్షలిక్కడే! మా దగ్గర పూర్తి స్థాయి ల్యాబ్ ఉంది. 98శాతం టెస్ట్‌లు ఇక్కడే చేస్తాం. కొన్ని ప్రత్యేకమైన కేసులకు మాత్రం శాంపుల్స్ ముంబయికి పంపిస్తాం. ఈసీజీ, అల్ట్రా సౌండ్ స్కానింగ్, సోనాలజిస్ట్లతోపాటు రేడియాలజిస్ట్ కూడా మహిళే. రేడియాలజీ లో మహిళలు తక్కువగా ఉంటారు. ట్రీట్మెంట్ సమయంలో రేడియాలజిస్ట్ కూడా కొంత రేడియేషన్ ప్రభావానికి గురవుతుంటారు. కాబట్టి మహిళలు తాము గర్భిణులుగా ఉన్నప్పుడు డ్యూటీ చేయడం కష్టం. అందుకే ఈ రంగాన్ని ఎంచుకోవడానికి కొంచెం సంశయిస్తారు. అలాంటిది మా దగ్గర రేడియాలజిస్ట్‌గా కూడా మహిళే డ్యూటీ చేస్తున్నారు. ► నార్మల్ డెలివరీల రికార్డ్! ఎకరా విస్తీర్ణంలో నిర్మించిన మా హాస్పిటల్ లో మొత్తం డాక్టర్లు పాతిక మంది, మెటర్నిటీ విభాగంలో ఇద్దరు హెచ్వోడీలతోపాటు పన్నెండు మంది డాక్టర్లు, దాదాపు వందమంది నర్సింగ్ స్టాఫ్, ఎనభైకి పైగా హౌస్ కీపింగ్ ఎంప్లాయీస్ విధులు నిర్వర్తిస్తున్నారు. పేట్ల బురుజులో ఉన్న గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ తర్వాత అత్యధికంగా ప్రసవాలు జరిగేది మా హాస్పిటల్లోనే. గత ఏడాదికి గాను అత్యధికంగా నార్మల్ డెలివరీలు చేసిన హాస్పిటల్‌గా మా హాస్పిటల్‌కి ప్రశంసలు కూడా వచ్చాయి. మగడాక్టర్లు నియోనేటల్ విభాగంలో మాత్రం ఉన్నారు. ప్రధాన ద్వారం నుంచి కారిడార్‌తోపాటు ముఖ్యమైన ప్రదేశాలన్నీ సీసీటీవీ నిఘాలో ఉంటాయి. ఐసీయూ బెడ్ పట్టే స్థాయి లిఫ్ట్ కూడా ఉంది. ఇన్ని సౌకర్యాలున్నప్పటికీ ఇది చారిటీ హాస్పిటల్ కావడంతో మా దగ్గర ఫీజులు చాలా చాలా తక్కువ. ఓ యాభై ఐదేళ్ల కిందట ఒక మహిళ మగ డాక్టర్ దగ్గర ప్రసవం చేయించుకోవడానికి ఇష్టపడక, ఆ సమయానికి లేడీ డాక్టర్ అందుబాటులో లేక చివరికి ఆ గర్భిణి మరణించిందట. ఆ సంఘటన తర్వాత మహిళల కోసం మహిళలే పని చేసే ఒక హాస్పిటల్ ఉండాలని భావించిన అబ్దుల్ రజాక్ లతీఫ్ ఈ హాస్పిటల్‌ను ప్రతిపాదించారు. యాభై మూడేళ్లుగా మహిళల కోసం మహిళలే ఇరవై నాలుగ్గంటలూ సేవలందిస్తున్నారు’’ అంటూ వివరించారు డాక్టర్ నీలోఫర్. 40 ఇంక్యుబేటర్లు, వార్మర్, ఫొటో థెరపీ సర్వీస్, పుట్టిన బిడ్డ వినికిడి పరీక్ష కోసం ఆడిటరీ టెస్ట్ సౌకర్యం కూడా ఉంది. మా హాస్పిటల్ నిర్మాణం ఎంత ముందు చూపుతో జరిగిందంటే... డెలివరీ రూమ్ నుంచే నియోనేటల్కు, పోస్ట్ ఆపరేటివ్ వార్డుకు కనెక్షన్ ఉంది. అవసరమైతే బిడ్డను ఆ విభాగానికి పంపించి తల్లిని ఈ వార్డుకి షిఫ్ట్ చేస్తాం. ఇద్దరూ క్షేమంగా ఉంటే మామూలు వార్డుకి లేదా రూమ్‌కి షిఫ్ట్ చేస్తాం. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
‘ఒమేగా’లో ఏఐ కేన్సర్ రేడియేషన్ మెషీన్
సాక్షి, హైదరాబాద్: ఒమేగా ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో కొత్తగా మరో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ఆదివారం ప్రారంభమైంది. 500 పడకలతో ఈ ఆసుపత్రిని తీర్చిదిద్దారు. ఇక్కడ కేన్సర్ చికిత్సతోపాటు ఇతర అన్ని రకాల స్పెషాలిటీ వైద్య సేవలను అత్యాధునిక వైద్య సేవలతో అందుబాటులోకి తెచ్చినట్లు ఆసుపత్రి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ మోహన వంశీ మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ(ఏఐ)తో పనిచేసే కేన్సర్ రేడియేషన్ మెషీన్ (ఎథోస్)ను అందుబాటులోకి తెచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో గచ్చి బౌలిలో ఆసుపత్రిని అందుబాటులోకి తెచ్చామన్నారు. ఏఐతో పనిచేసే ‘ఎథోస్’ రోగుల చికిత్సను ప్రారంభ దశ నుంచి చివరి వరకు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఇది కేన్సర్ రేడియేషన్ చికిత్సలో ఒక విప్లవమని చెప్పారు. కొన్ని నిమిషాల వ్యవధిలోనే వ్యాధిని పూర్తిగా విశ్లేషించి చికిత్స అందించగలగడం దీని ప్రత్యేకత అన్నారు. దేశంలో డిజిటల్ పెట్ ఎంఆర్, డిజిటల్ పెట్ సీటీ పరికరాలతో కూడిన అత్యుత్తమ న్యూక్లియర్ మెడిసిన్ డిపార్ట్మెంట్ను ప్రారంభించిన మొదటి ఆసుపత్రిగా ఒమేగా నిలిచిందని డాక్టర్ వంశీ వెల్లడించారు. ఐసీయూ, హై ఎండ్ క్యాథ్‌ల్యాబ్ సదుపాయాలతో 24 గంటలూ అత్యవసర సేవలను అందించడానికి అందుబాటులో ఉంటుందన్నారు. ఈ సమావేశంలో సీఈవో శ్రీకాంత్ నంబూరి, స్పెషాలిటీ వైద్యులు డాక్టర్ రవి రాజు, డాక్టర్ గణేష్ మాథన్, డాక్టర్ విక్రమ్ శర్మ, డాక్టర్ ఆదిత్య కపూర్ పాల్గొన్నారు. -
'హెల్త్ హబ్స్'పై ప్రముఖ వైద్య సంస్థల ఆసక్తి
సాక్షి, అమరావతి: హెల్త్‌హబ్స్ ద్వారా రాష్ట్రంలో 13 కార్పొరేట్ ఆస్పత్రుల నిర్మాణంలో పాలుపంచుకునేందుకు దేశవ్యాప్తంగా పలు ప్రముఖ వైద్య సంస్థలు ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. అన్ని జిల్లాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 13 చోట్ల మల్టీ/సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణానికి ఆసక్తి కలిగిన సంస్థల నుంచి ఆహ్వానించిన టెండర్లకు భారీ స్పందన వచ్చింది. తాజాగా టెండర్లలో పాల్గొనడానికి ముందు నిర్వహించే ప్రీ బిడ్డింగ్ సమావేశంలో దేశవ్యాప్తంగా 28కి పైగా సంస్థలు పాల్గొన్నట్లు ఏపీఐఐసీ అధికారులు వెల్లడించారు. వర్చువల్ విధానంలో జరిగిన ప్రీ బిడ్ మీటింగ్‌లో ఏఐజీ, అపోలో, కేర్, కిమ్స్, సన్‌షైన్, రెయిన్బో, నారాయణ హృదయాలయ, మణిపాల్ లాంటి ప్రముఖ కార్పొరేట్ వైద్యసంస్థలు పాల్గొన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేస్తూనే.. అత్యున్నత వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఒకపక్క నాడు – నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తూనే ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున కార్పొరేట్ ఆస్పత్రులను అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, అనంతపురం, కడప, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి పట్టణాల్లో మల్టీ/ సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణానికి బిడ్లను ఆహ్వానిస్తూ ఏపీఐఐసీ టెండర్లను పిలిచింది. హెల్త్ హబ్స్ పేరుతో అభివృద్ధి చేస్తున్న 13 కార్పొరేట్ ఆస్పత్రుల ప్రాధాన్యం గురించి ప్రీ బిడ్డింగ్‌లో వివరించారు. కనీసం రూ.100 కోట్ల పెట్టుబడి, 100 పడకలతో ఆస్పత్రుల నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంటుంది. వీటిలో 50 శాతం బెడ్లను వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం కింద కేటాయిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను కార్పొరేట్ వైద్య సంస్థలు స్వాగతించాయని, బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపినట్లు ఏపీఐఐసీ అధికారులు వెల్లడించారు. -
సర్కారీ సూపర్ స్పెషాలిటీ
చరిత్రలో నిలిచిపోయేలా వైద్య కళాశాలలు, ఆస్పత్రుల నిర్మాణం జరగాలి. మూడేళ్లలో అన్ని ఆస్పత్రుల నిర్మాణాలు పూర్తి కావాలి. యంత్రాలు, ఏసీలు, లిఫ్ట్‌లు, ఎలక్ట్రికల్,నాన్ ఎలక్ట్రికల్ ఉపకరణాలు, ఫైర్ కంట్రోల్ ఎక్విప్మెంట్ వంటి అన్నింటి నిర్వహణ బాధ్యత ఏడేళ్ల పాటు అప్పగించాలి. తద్వారా ఏ సమస్య తలెత్తినా వెంటనే పరిష్కారం అవుతుంది. – సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండాలని, నిర్మాణాల విషయంలో ఎక్కడా రాజీ పడరాదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు అక్కడ కార్పొరేట్ లుక్ స్పష్టంగా కనిపించాలని స్పష్టం చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ఆస్పత్రులలో నాడు–నేడు పనులతో పాటు కొత్తగా వైద్య కళాశాలలు, ఐటీడీఏల్లో ఏర్పాటు చేయనున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ముఖ్యమంత్రి ఆదేశాలు, సూచనలు.. అధికారులు వివరించిన విషయాలు ఇలా ఉన్నాయి. ఆస్పత్రిలో ఏసీ తప్పనిసరి ► డాక్టర్లు ఇబ్బంది పడకుండా ఉన్నప్పుడే చక్కగా సేవలందించగలుగుతారని, అందువల్ల తప్పనిసరిగా సెంట్రలైజ్డ్ ఏసీ ఉండాలని సీఎం చెప్పారు. అవసరం అయితే సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామని, దాని వల్ల యూనిట్ విద్యుత్ కేవలం రూ.2.50కే వస్తుందని చెప్పారు. ► దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో ఆస్పత్రుల రూపురేఖలు మారబోతున్నాయని, అందువల్ల ప్రతి ఆస్పత్రి అత్యుత్తమంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పనులు వేగంగా జరిగేలా ఏర్పాట్లు ► తొలుత నాడు–నేడు కార్యక్రమంలో ఆస్పత్రులలో చేపడుతున్న మార్పులతో పాటు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలల ప్రస్తుత పరిస్థితిని అధికారులు సీఎంకు వివరించారు. పాడేరులో వైద్య కళాశాలతో పాటు, ఐటీడీఏల పరిధిలో ఏర్పాటు చేస్తున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల పనులను అక్టోబర్ 2న ప్రారంభిస్తారని (సీఎం ప్రారంభిస్తారు) చెప్పారు. ► సీతంపేట, పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం, దోర్నాలలోని ఐటీడీఏల పరిధిలో ఏర్పాటు చేయనున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు సంబంధించి అంచనాలు సిద్ధమయ్యాయని చెప్పారు. రంపచోడవరంలో ఏర్పాటు చేయనున్న ఆస్పత్రి గురించి పవర్ పాయింట్ ద్వారా వివరించారు. ► పాడేరు, పిడుగురాళ్ల, మచిలీపట్నం, పులివెందులలో వైద్య కళాళాలలకు సంబంధించి భూసేకరణతో పాటు, అవసరమైన అన్ని పనులు పూర్తయ్యాయని, టెండర్ల ఖరారుకు జ్యుడీషియల్ రివ్యూకు పంపిస్తున్నామని తెలిపారు. ► బాపట్ల, విజయనగరం, ఏలూరు, అనకాపల్లి, మార్కాపురం, మదనపల్లె, నంద్యాల మెడికల్ కాలేజీల టెండర్ల జ్యుడీషియల్ ప్రివ్యూ అక్టోబర్‌లో జరుగుతుందని చెప్పారు. నరసాపురం, రాజమండ్రి, పెనుకొండ, అమలాపురం, ఆదోని మెడికల్ కాలేజీల టెండర్లను నవంబర్ జ్యుడీషియల్ ప్రివ్యూకు పంపిస్తామన్నారు. ► ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, హెల్త్ మెడికల్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ వి.విజయరామరాజు, తదితరులు పాల్గొన్నారు. -
వైద్య సేవల్లోకి కత్రియ గ్రూప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆతిథ్య రంగంలో ఉన్న కత్రియ గ్రూప్ వైద్య సేవల్లోకి ప్రవేశించింది. హైదరాబాద్‌లోని బాచుపల్లి వద్ద ఎస్ఎల్జీ పేరుతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 550 పడకలు అందుబాటులోకి వచ్చాయని సంస్థ సీఎండీ దండు శివ రామ రాజు బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. 2022 నాటికి ఆసుపత్రిని 999 పడకల స్థాయికి చేరుస్తామని వెల్లడించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.350 కోట్లని వివరించారు. నర్సింగ్ స్కూల్, హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ సైతం ఏర్పాటు చేస్తామన్నారు. అత్యాధునిక పాథాలజీ ల్యాబ్, డయాగ్నోస్టిక్ సెంటర్ ఉందని చెప్పారు. ప్రస్తుతం 42 రకాల స్పెషాలిటీ వైద్య సేవలు లభిస్తాయని ఎస్ఎల్జీ సీఈవో ఏ.రామ్ పాపా రావు తెలిపారు. 140 మంది వైద్యులు, 280 మంది ప్యారా మెడికల్ సిబ్బందిని నియమించామన్నారు. హోటల్ సైతం ఇక్కడే..: ఆసుపత్రికి ఆనుకుని 3 స్టార్ హోటల్ సైతం నిర్మిస్తున్నారు. 120 గదులతో సిద్ధమవుతున్న ఈ హోటల్ మార్చికల్లా రెడీ అవుతుందని సంస్థ ఈడీ డీవీఎస్ సోమ రాజు తెలిపారు. ఇందులో 1,000 మంది కూర్చునే వీలున్న సమావేశ మందిరం ఉం టుం దని చెప్పారు. ఆసుపత్రికి ఆనుకుని హోటల్ ఉం డడం రోగులకు (ముఖ్యంగా విదేశీయులకు) కలిసి వస్తుందన్నారు. ఎయిర్ అంబులెన్స్‌కు హెలిప్యాడ్ సైతం నిర్మించామన్నారు. -
మరో నాలుగు నిమ్స్ ఆసుపత్రులు!
⇒ ప్రతిపాదిత మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులన్నీ నిమ్స్ తరహాలోనే ⇒ హైదరాబాద్‌లో మూడు.. కరీంనగర్లో ఒకటి.. ⇒ ఆంధ్రా బ్యాంకు రుణానికి ప్రభుత్వ ప్రయత్నాలు ⇒ అందుబాటులోకి పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్య కోర్సులు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, కరీంనగర్‌లలో నిర్మించబోయే నాలుగు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిమ్స్ తరహాలో నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని నిమ్స్ ఆసుపత్రులుగానే కొనసాగిస్తూ.. అదే పేరుతో పిలుస్తారు. హైదరాబాద్‌లో నాలుగు చోట్ల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నెలకొల్పాలని ప్రభుత్వం గతేడాది నిర్ణయించిన సంగతి తెలిసిందే. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉండటంతో శివారు ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్లడం రోగులకు కష్టంగా మారింది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే 2017–18 బడ్జెట్లో హైదరాబాద్‌లో మూడు, కరీంనగర్లో ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని ప్రకటించింది. వీటిని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల మాదిరిగా నెలకొల్పితే ప్రయోజనం ఏముందన్న భావన ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది. పైగా ఆ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లడం.. తరచూ సమస్యలు వస్తున్నందున నిమ్స్ తరహాలోనే కొత్త వాటిని నిర్మించాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఒక్కో ఆసుపత్రికి 750 పడకలు హైదరాబాద్ శివార్లలోని ఎల్బీ నగర్ విక్టోరియా మెమోరియల్ హోం వద్ద ఒకటి, రాజేంద్రనగర్‌లోని మైలార్‌దేవ్‌పల్లి వద్ద, పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పక్కన, మియాపూర్ బస్ టర్మినల్ పక్కన నాలుగు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మూడు మాత్రమే నిర్మిస్తారు. బీబీనగర్ నిమ్స్ అందుబాటులో ఉన్నందున నాలుగో ఆసుపత్రి ఉండదు. ఒక్కో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో 500 పడకలకు అదనంగా మరో 250 పడకలు తల్లులు, పిల్లల సంరక్షణ కోసం నిర్మిస్తారు. ఒక్కో పడకకు రూ.50–60 లక్షల చొప్పున ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఆ ప్రకారం ఒక్కో ఆసుపత్రికి రూ.400 కోట్ల వరకు ఖర్చు కావచ్చని సమాచారం. ప్రభుత్వం ఇందుకు బడ్జెట్లో నిధులు కేటాయించకున్నా.. బ్యాంకుల రుణం తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రా బ్యాంకుతో చర్చలు జరిపారు. బ్యాంకు కూడా రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో నెల రోజుల్లోగా కొత్త నిమ్స్ పనులు ప్రారంభం కావచ్చని వైద్య వర్గాలు తెలిపాయి. రెండేళ్లలో వీటిని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రైవేటు ప్రాక్టీసు చేయకూడదు నిమ్స్ ప్రభుత్వ పరిధిలో నడిచే ఆసుపత్రే అయినా పూర్తి స్వయం ప్రతిపత్తి ఉంది. డైరెక్టర్‌తోపాటు కార్యనిర్వాహక మండలి ఉంటుంది. స్వతంత్రంగా నియామకాలు జరుపుకునే స్వేచ్ఛ దానికి ఉంది. సిబ్బందికి బదిలీలు ఉండవు. నిధులను కూడా అదే సమకూర్చు కుం టుంది. నాలుగు నిమ్స్‌లకు అదే తీరున స్వయంప్రతిపత్తి కల్పిస్తారు. పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్య కోర్సులను కూడా ప్రారంభిస్తారు. ఒక్కో ఆసుపత్రికి ప్రాథమికంగా 50 పీజీ సీట్లు వచ్చే అవకాశముంది. నిమ్స్‌లో పనిచేసే వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయకూడదన్న నిబంధన ఉంది. అదే నిబంధన కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనూ అమలుచేస్తారు. ప్రస్తుతం నిమ్స్‌లో ఉన్న మాదిరిగానే వైద్య పరీక్షలకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగులు, జర్నలిస్టులు, ఆరోగ్యశ్రీ రోగులకు మాత్రం పూర్తిస్థాయిలో ఉచిత వైద్య సేవలు అందుతాయి. -
అందుబాటులోకి మరో రెండు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు
న్యూఢిల్లీ: నగరంలో మరో రెండు మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటుచేయనున్నట్లు ఢిల్లీ ఆరోగ్య శాఖ శుక్రవారం తెలిపింది. ఈ ఏడాది నవంబర్ చివరికల్లా ఉత్తర ఢిల్లీలోని బురారీ, దక్షిణఢిల్లీలోని అంబేద్కర్‌నగర్‌లో నిర్మించిన మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులోకి రానున్నాయని ఆ శాఖ అధికారులు తెలిపారు.రెండు ఆస్పత్రులూ 200 పడకల సామర్థ్యం కలిగి ఉన్నవేనని వారు చెప్పారు. వీటిలో న్యూరాలజీ, గైనకాలజీ, చిన్నారులకు సంబంధించి ప్రత్యేక విభాగాలు అందుబాటులో ఉంటాయని వివరించారు. కొన్ని కారణాల ఈ ఆస్పత్రుల నిర్మాణంలో జాప్యం జరిగినా, ప్రస్తుతం పనులను వేగిరవంతం చేశామన్నారు. మరో మూడు నెలల్లో నిర్మాణ పనులుపూర్తయిపోతాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్), సబ్దర్‌జంగ్ ఆస్పత్రులకు పెరిగిన రోగుల తాకిడిని తగ్గించేందుకు పశ్చిమ ఢిల్లీలోని ద్వారకాలో రూ. 570 కోట్ల అంచనా వ్యయంతో 700 పడకల ఆస్పత్రి నిర్మాణం చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ ఆస్పత్రి కూడా మరో ఏడాదిలో రోగులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. దీనికి భారతరత్న ఇందిరాగాంధీ ఆస్పత్రిగా వ్యవహరించనున్నట్లు చెప్పారు. దీనికి అనుబంధంగా మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటుచేయనున్నామన్నారు. ఇదిలా ఉండగా, ఢిల్లీ ప్రభుత్వ ం కింద పనిచేస్తున్న ఆస్పత్రుల్లో ఉన్న సదుపాయాలను మెరుగుపరచడంలో భాగంగా లాల్‌బహదూర్ శాస్త్రి ఆస్పత్రి, లోక్‌నాయక్ ఆస్పత్రులకు చెరో 45 డయాలసిస్ యంత్రాలు మంజూరయ్యాయని ఆయన వివరించారు. -
తెలంగాణ ఉద్యమంతో బీపీ వచ్చింది
స్టార్ ఆసుపత్రి నూతన సేవల ప్రారంభంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దేశంలో ఎక్కువ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి సాక్షి, హైదరాబాద్: ‘ఊహ తెలిసినప్పటి నుంచి 52వ ఏట వరకు డాక్టర్‌కు నా చెయ్యి ఇయ్యిలే. నా కోసం నేను ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం రాలే. తెలంగాణ ఉద్యమం సమయంలోనే బీపీ వచ్చింది. ఎక్కువగా ఆలోచించేవారికి, టెన్షన్ ఉండే వారికే బీపీ వస్తది. బీపీ మాత్రలు వాడాలని డాక్టర్లు అంటే వాడుతున్నా. మాత్రలు వాడకుంటే ఏమవుతుందని డాక్టర్లను అడిగితే చచ్చిపోతావ్ అని హెచ్చరించారు’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రిలో వివిధ విభాగాల నూతన సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... రానున్న రోజుల్లో హైదరాబాద్‌కు గొప్ప భవిష్యత్తు ఉంటుందని, గ్లోబల్ సిటీగా రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యధికంగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. జాంబియా, మొజాంబిక్ తదితర దేశాల నుంచి కూడా వైద్యం కోసం ఇక్కడికి వస్తున్నారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పనిచేసి రిటైరైన చాలా మంది ఐఏఎస్‌లు ఇప్పుడు రాజధానిలోనే ఇళ్లు కట్టుకొని నివసిస్తున్నారని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి జే.ఎం.లింగ్డో నగర శివారులో నివసిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు టి.రాజయ్య, జోగు రామన్న, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, స్టార్ ఆసుపత్రి చైర్మన్ నాగార్జునరెడ్డి, గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు. ఏపీలోనూ ఇలాంటి ఆసుపత్రులు పెట్టండి: మంత్రి కామినేని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏర్పాటు చేయాలని ఆసుపత్రుల యాజమాన్యాలను ఏపీ వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ కోరారు. సినీనటుడు చిరంజీవి, సినీ నిర్మాత అల్లు అరవింద్‌తో కలసి ఆయన గురువారం స్టార్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్వరలో ఆసుపత్రి యాజమాన్యాలు, వైద్యులతో ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. నెల్లూరు జిల్లాలో రెడ్‌క్రాస్‌తో కలసి ప్రభుత్వం కేన్సర్ ఆసుపత్రిని నెలకొల్పుతుందని చెప్పారు. చిరంజీవి మాట్లాడుతూ.. సామాన్యుడికి, మధ్య తరగతికి కూడా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు సేవలందించాలన్నారు.