మరో నాలుగు నిమ్స్ ఆసుపత్రులు!
⇒ ప్రతిపాదిత మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులన్నీ నిమ్స్ తరహాలోనే
⇒ హైదరాబాద్‌లో మూడు.. కరీంనగర్‌లో ఒకటి..
⇒ ఆంధ్రా బ్యాంకు రుణానికి ప్రభుత్వ ప్రయత్నాలు
⇒ అందుబాటులోకి పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్య కోర్సులు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, కరీంనగర్‌లలో నిర్మించబోయే నాలుగు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిమ్స్ తరహాలో నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని నిమ్స్ ఆసుపత్రులుగానే కొనసాగిస్తూ.. అదే పేరుతో పిలుస్తారు. హైదరాబాద్‌లో నాలుగు చోట్ల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నెలకొల్పాలని ప్రభుత్వం గతేడాది నిర్ణయించిన సంగతి తెలిసిందే. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులు హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉండటంతో శివారు ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్లడం రోగులకు కష్టంగా మారింది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే 2017–18 బడ్జెట్‌లో హైదరాబాద్‌లో మూడు, కరీంనగర్‌లో ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని ప్రకటించింది. వీటిని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల మాదిరిగా నెలకొల్పితే ప్రయోజనం ఏముందన్న భావన ప్రభుత్వ వర్గాల్లో నెలకొంది. పైగా ఆ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లడం.. తరచూ సమస్యలు వస్తున్నందున నిమ్స్ తరహాలోనే కొత్త వాటిని నిర్మించాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
ఒక్కో ఆసుపత్రికి 750 పడకలు
హైదరాబాద్ శివార్లలోని ఎల్బీ నగర్ విక్టోరియా మెమోరియల్ హోం వద్ద ఒకటి, రాజేంద్రనగర్‌లోని మైలార్‌దేవ్‌పల్లి వద్ద, పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పక్కన, మియాపూర్ బస్ టర్మినల్ పక్కన నాలుగు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించాలని గతంలో ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మూడు మాత్రమే నిర్మిస్తారు. బీబీనగర్ నిమ్స్ అందుబాటులో ఉన్నందున నాలుగో ఆసుపత్రి ఉండదు. ఒక్కో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో 500 పడకలకు అదనంగా మరో 250 పడకలు తల్లులు, పిల్లల సంరక్షణ కోసం నిర్మిస్తారు. ఒక్కో పడకకు రూ.50–60 లక్షల చొప్పున ఖర్చు అవుతుందని అంచనా వేశారు.
ఆ ప్రకారం ఒక్కో ఆసుపత్రికి రూ.400 కోట్ల వరకు ఖర్చు కావచ్చని సమాచారం. ప్రభుత్వం ఇందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకున్నా.. బ్యాంకుల రుణం తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రా బ్యాంకుతో చర్చలు జరిపారు. బ్యాంకు కూడా రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో నెల రోజుల్లోగా కొత్త నిమ్స్ పనులు ప్రారంభం కావచ్చని వైద్య వర్గాలు తెలిపాయి. రెండేళ్లలో వీటిని అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రైవేటు ప్రాక్టీసు చేయకూడదు
నిమ్స్ ప్రభుత్వ పరిధిలో నడిచే ఆసుపత్రే అయినా పూర్తి స్వయం ప్రతిపత్తి ఉంది. డైరెక్టర్‌తోపాటు కార్యనిర్వాహక మండలి ఉంటుంది. స్వతంత్రంగా నియామకాలు జరుపుకునే స్వేచ్ఛ దానికి ఉంది. సిబ్బందికి బదిలీలు ఉండవు. నిధులను కూడా అదే సమకూర్చు కుం టుంది. నాలుగు నిమ్స్‌లకు అదే తీరున స్వయంప్రతిపత్తి కల్పిస్తారు. పీజీ, సూపర్ స్పెషాలిటీ వైద్య కోర్సులను కూడా ప్రారంభిస్తారు. ఒక్కో ఆసుపత్రికి ప్రాథమికంగా 50 పీజీ సీట్లు వచ్చే అవకాశముంది. నిమ్స్‌లో పనిచేసే వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేయకూడదన్న నిబంధన ఉంది. అదే నిబంధన కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లోనూ అమలుచేస్తారు. ప్రస్తుతం నిమ్స్‌లో ఉన్న మాదిరిగానే వైద్య పరీక్షలకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగులు, జర్నలిస్టులు, ఆరోగ్యశ్రీ రోగులకు మాత్రం పూర్తిస్థాయిలో ఉచిత వైద్య సేవలు అందుతాయి.