తెలంగాణ ఉద్యమంతో బీపీ వచ్చింది
స్టార్ ఆసుపత్రి నూతన సేవల ప్రారంభంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
దేశంలో ఎక్కువ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు హైదరాబాద్‌లోనే ఉన్నాయి
సాక్షి, హైదరాబాద్: ‘ఊహ తెలిసినప్పటి నుంచి 52వ ఏట వరకు డాక్టర్‌కు నా చెయ్యి ఇయ్యిలే. నా కోసం నేను ఆసుపత్రికి వెళ్లాల్సిన అవసరం రాలే. తెలంగాణ ఉద్యమం సమయంలోనే బీపీ వచ్చింది. ఎక్కువగా ఆలోచించేవారికి, టెన్షన్ ఉండే వారికే బీపీ వస్తది. బీపీ మాత్రలు వాడాలని డాక్టర్లు అంటే వాడుతున్నా. మాత్రలు వాడకుంటే ఏమవుతుందని డాక్టర్లను అడిగితే చచ్చిపోతావ్ అని హెచ్చరించారు’ అని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని స్టార్ ఆసుపత్రిలో వివిధ విభాగాల నూతన సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ... రానున్న రోజుల్లో హైదరాబాద్‌కు గొప్ప భవిష్యత్తు ఉంటుందని, గ్లోబల్ సిటీగా రూపుదిద్దుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యధికంగా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. జాంబియా, మొజాంబిక్ తదితర దేశాల నుంచి కూడా వైద్యం కోసం ఇక్కడికి వస్తున్నారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పనిచేసి రిటైరైన చాలా మంది ఐఏఎస్‌లు ఇప్పుడు రాజధానిలోనే ఇళ్లు కట్టుకొని నివసిస్తున్నారని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధానాధికారి జే.ఎం.లింగ్డో నగర శివారులో నివసిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు టి.రాజయ్య, జోగు రామన్న, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, స్టార్ ఆసుపత్రి చైర్మన్ నాగార్జునరెడ్డి, గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీలోనూ ఇలాంటి ఆసుపత్రులు
పెట్టండి: మంత్రి కామినేని
మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులను ఆంధ్రప్రదేశ్‌లోనూ ఏర్పాటు చేయాలని ఆసుపత్రుల యాజమాన్యాలను ఏపీ వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ కోరారు. సినీనటుడు చిరంజీవి, సినీ నిర్మాత అల్లు అరవింద్‌తో కలసి ఆయన గురువారం స్టార్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్వరలో ఆసుపత్రి యాజమాన్యాలు, వైద్యులతో ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. నెల్లూరు జిల్లాలో రెడ్‌క్రాస్‌తో కలసి ప్రభుత్వం కేన్సర్ ఆసుపత్రిని నెలకొల్పుతుందని చెప్పారు. చిరంజీవి మాట్లాడుతూ.. సామాన్యుడికి, మధ్య తరగతికి కూడా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు సేవలందించాలన్నారు.