సాక్షి, హైదరాబాద్ : కరోనా చికిత్సకు సంబంధించి ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల విష యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ఆస్ప త్రుల్లోని 50 శాతం పడకలను సర్కారు స్వాధీనం చేసు కోనుంది. ఇకపై ఆ ఆస్ప త్రుల్లోని సగం పడకల్లో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే కరోనా చికిత్సకు సంబంధించిన వైద్యసేవలు అందుతాయి. ఆ పడకలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖే నింపుతుంది. ఈ విషయంపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల యాజమా న్యాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ఆస్పత్రిలో 50% పడకలను ప్రభుత్వా నికి ఇవ్వడానికి వారు అంగీకరించారని మంత్రి అనంతరం ఓ ప్రకటనలో తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ ఓ ప్రత్యేక యాప్ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రులకు రోగులను పంపించేందుకు ప్రైవేట్, కార్పొ రేట్ ఆస్పత్రులు అంగీకరించాయని వెల్లడిం చారు. ఇందుకు సంబంధించిన విధివిధా నాలు రూపొందించేందుకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్‌రావుతో శుక్రవారం భేటీ కావాలని ఆస్పత్రుల యాజమాన్యాలను మంత్రి కోరారు. సగం పడకలను సర్కారుకు ఇవ్వడానికి అంగీకరించిన ఆస్పత్రుల యాజమాన్యాలకు ఈటల కృతజ్ఞతలు తెలిపారు.
తొలినుంచీ పకడ్బందీగా..
కరోనా కేసులు మొదలైనప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వైరస్ నియంత్రణ, కరోనా చికిత్సలో పకడ్బందీ చర్యలతో ముందుకు వెళుతోంది. వైరస్ వ్యాప్తికి తగినట్టుగా పరీక్షల సంఖ్యను పెంచింది. ఎంతమంది రోగులు వచ్చినా చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలను ఆధీనంలోకి తీసుకుని ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది. అలాగే ఆక్సిజన్ పడకలను కూడా పెద్ద ఎత్తున సిద్ధంచేసింది. అంతేకాకుండా కరోనా చికిత్స విషయంలో ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు మానవతా దృక్పథంతో ముందుకు రావాలని పలుమార్లు మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. సంక్షోభ సమయంలో కరోనా చికిత్సను వ్యాపార కోణంలో చూడొద్దని విన్నవించారు. కరోనా చికిత్సకు ఎంత చార్జి చేయాలో కూడా ధరలను నిర్దేశించారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లోని సాధారణ వార్డులో చికిత్సకు రూ.4వేలు, ఐసీయూలో రూ.7,500, వెంటిలేటర్ మీద పెడితే రూ.9వేల చొప్పున మాత్రమే రోజుకు ఫీజు వసూలు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.
పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో..
కరోనా చికిత్స విషయంలో చాలా ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులు సర్కారు ఆదేశాలు పాటించలేదు. పైగా రోగుల నుంచి రూ.లక్షల్లో అడ్వాన్సులు వసూలు చేయడం, అడ్వాన్సు చెల్లిస్తేనే రోగులను చేర్చుకోవడం, రోజుకు రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు చార్జి చేయడం, డబ్బులు కడితేనే శవాలను ఇస్తామని వేధించడం, డబ్బులు కట్టినా బిల్లులు ఇవ్వకపోవడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీనిపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను పాటించని ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామని సర్కారు హెచ్చరించింది. నిబంధనలు పాటించని ఆస్పత్రుల్లో కరోనా చికిత్సను రద్దు చేసింది. కొన్ని ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. అయినప్పటికీ పలు ఆస్పత్రులు తీరు మార్చుకోకపోవడంతో ఇక అపిడమిక్ డిసీజ్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టంచేసింది. చివరకు సగం పడకలను సర్కారుకు ఇవ్వాలని స్పష్టంచేయడంతో ప్రైవేటు, కార్పొరేట్ యాజమాన్యాలు దిగిరాక తప్పలేదు.
సర్కారు చేతికి 3,940 పడకలు...
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం రాష్ట్రంలో 118 ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స కోసం 7,879 పడకలు కేటాయించారు. అందులో సగం అంటే 3,940 పడకలను ఇకపై ప్రభుత్వమే కేటాయించనుంది. మొత్తం పడకల్లో 3,216 రెగ్యులర్ బెడ్స్ ఉండగా, వాటిలో 1,608 పడకలను ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇక ఆక్సిజన్ పడకలు 3,145 ఉండగా, 1,572 బెడ్స్‌ను సర్కారే నింపుతుంది. 1,518 ఐసీయూ పడకల్లో 759 బెడ్స్ ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి. ప్రస్తుతం ఉన్న అన్ని పడకల్లో 4,453 నిండిపోగా, 3,426 పడకలు ఖాళీగా ఉన్నాయి. విధివిధానాలు ఖరారయ్యాక సగం పడకలను సర్కారే కేటాయిస్తుందని అధికారులు తెలిపారు. మంత్రి ఈటలతో జరిగిన సమావేశంలో ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాల ప్రతినిధులతోపాటు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి, వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేష్‌రెడ్డి, ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు, ఉన్నతస్థాయి నిపుణుల కమిటీ సభ్యులు, కాళోజీ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, నిమ్స్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ గంగాధర్ పాల్గొన్నారు.
కార్పొరేట్ ఆస్పత్రుల్లో సర్కారుకే సగం
Published Fri, Aug 14 2020 12:46 AM | Last Updated on Fri, Aug 14 2020 8:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment