ప్రైవేటు ఆసుపత్రులకు మంత్రి ఈటల హెచ్చరిక | minister etela rajender warns to private hospitals ove corona fee | Sakshi
Sakshi News home page

ప్రైవేటు ఆసుపత్రులకు మంత్రి ఈటల హెచ్చరిక

Published Wed, Aug 5 2020 4:54 AM | Last Updated on Wed, Aug 5 2020 10:26 AM

minister etela rajender warns to private hospitals ove corona fee - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: ప్రైవేట్‌ ఆసుపత్రులు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోకపోతే వేటు తప్పదని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తీవ్రంగా హెచ్చరించారు. ప్రైవేటు ఆసుపత్రుల ఫీజుల వసూళ్లపై వేల ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే బాధితులతోనూ మాట్లాడానని చెప్పారు. మంగళవారం ఈటల విలేకరులతో మాట్లాడుతూ.. ‘కరోనా చికిత్సను వ్యాపార కోణంలో చూడొద్దని చెప్పా. కానీ వారు అనేక రకాలుగా వేధిస్తున్నారని ఫిర్యాదులొస్తున్నాయి. లక్షలకు లక్షలు ఫీజులు గుంజుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మృతదేహాన్ని అప్పగించడానికి కూడా రూ.4 లక్షలు కట్టాలని అడగటం మానవ సమాజానికే కళంకం. హీనమైన చర్య. పదే పదే చెప్పినా వైఖరి మార్చుకోవడం లేదు. దీనిపై కమిటీలు వేసి విచారణ జరుపుతున్నాం. ఇప్పటికైనా వైఖరి మార్చుకోకుంటే కరోనా చికిత్స అనుమతులను రద్దు చేస్తాం. ఇప్పటికే కొన్ని ఆసుపత్రులపై చర్యలు (సోమవారం డెక్కన్‌ ఆసుపత్రిపై చర్యలు తీసుకున్న ప్రభుత్వం.. మంగళవారం బంజారాహిల్స్‌లోని విరించి ఆస్పత్రిపై కూడా ఫీజుల వసూళ్లకు సంబంధించి చర్యలు తీసుకుంటూ కరోనా చికిత్స అనుమతులు రద్దు చేసింది) తీసుకున్నాం. రెండు, మూడ్రోజుల్లో మరికొన్నింటిపై చర్యలుంటాయి. ప్రస్తుతం డబ్బుల సంపాదనకు బ్లాక్‌ మెయిల్‌ చేసే సందర్భం కాదు..’అని మంత్రి వ్యాఖ్యానించారు.

ఆ తర్వాతే కరోనా టెస్టులు..
వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులొచ్చే అవకాశాలుంటాయని, జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలొస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించాలని ఈటల సూచించారు. ‘ఇప్పటికే ఏఎన్‌ఎంలు ఇంటింటికీ సర్వే చేసి లక్షణాలున్న వారిని ఆసుపత్రులకు పంపుతున్నారు. కరోనా లక్షణాలున్న వారికి చికిత్స చేయొద్దని, పీహెచ్‌సీలకు వారిని పంపాలని ఆర్‌ఎంపీ వైద్యులకు కూడా ఆదేశాలిచ్చాం. గ్రామాల్లో లక్షణాలున్న వారిని గుర్తిస్తే పీహెచ్‌సీలోనే టెస్టులు చేయాలి. అనారోగ్యంతో ఎవరైనా ఆసుపత్రికి వస్తే ముందుగా చేర్చుకొని చికిత్స చేయాలి. తర్వాతే కరోనా పరీక్ష చేయించాలి. పీహెచ్‌సీ స్థాయిలో కూడా ఈ చికిత్సకు మందులు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వల్ప ధరలవే. నిపుణుల కమిటీ ప్రకారం రూ.వెయ్యికి మించవు. ఇక వెంటిలేటర్ల గురించి ఆలోచించవద్దు. అంతవరకు పోయాడంటేనే మనిషి ప్రాణాపాయంలోకి వెళ్లారని అర్థం. 10 రోజుల పాటు ఒక రోగికి ఆక్సిజన్‌ పెడితే రూ. 2,500 మాత్రమే ఖర్చవుతుంది. ఏ ఆసుపత్రి అయినా బాధితులకు ఇచ్చే చికిత్స ఇదే.. ముదిరితేనే ఖరీదైన చికిత్స అవసరం. మందులు, వైద్యులు, ఆక్సిజన్, వెంటిలేటర్లకు కొరత లేదు. జిల్లాల్లోనూ ఐ+సోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశాం. మంత్రులు, కలెక్టర్లు వీటిని పర్యవేక్షిస్తున్నారు..’అని వెల్లడించారు.

ఫ్మాస్మా బ్యాంకు ఏర్పాటుకు సన్నాహాలు..
లక్షణాలున్నవారు యాంటిజెన్‌ పరీక్షలు, లేనివారు ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవాలని మంత్రి ఈటల కోరారు. ‘ప్లాస్మా బ్యాంకు పెట్టమని సీఎం ఆదేశించారు. దాని ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాం. ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టులు రోజుకు ఐదారు వేలకు మించడం లేదు. గాంధీలో 2 వేల పడకలున్నాయి. అక్కడికి సీరియస్‌గా ఉన్నవారు వస్తున్నారు. గాంధీలో 500 ఐసీయూలు, 600 ఆక్సిజన్‌ పడకలున్నాయి. మరో 350 ఐసీయూ పడకలను సిద్ధం చేస్తున్నాం. కేంద్రాన్ని 1,400 వెంటిలేటర్లు కోరాం. కోవిడ్‌ కోసం స్పెషల్‌గా తయారుచేసిన వెంటిలేటర్లు వస్తున్నాయి. వరంగల్‌లో కూడా అదనపు పడకలు ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు అన్ని జిల్లాల్లోనూ కరోనా సేవలు అందిస్తున్నాం. గాంధీ, ఉస్మానియా, చెస్ట్, నిలోఫర్, ఫీవర్‌ ఆసుపత్రులకు బల్క్‌ లిక్విడ్‌ ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించాం. ఆరోగ్య శాఖలో సిబ్బంది వైరస్‌ బారిన పడితే సెలవులు అక్కర్లేదు. వారు విధుల్లో ఉన్నట్లుగానే పరిగణిస్తాం. మొదట్లో జీహెచ్‌ఎంసీలో ఎక్కువ కేసులుంటే, ఇప్పుడు జిల్లాల్లో పెరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో గుండెపోటు, ఇతర కారణాలతో చనిపోయినా శవాలను రానివ్వడం లేదు. భౌతికకాయాల ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందదు. మృతదేహాన్ని ప్యాక్‌ చేసి ఇచ్చేది మనుషులే కదా, వారికి రాని వైరస్‌ ఇతరులకు వస్తుందా..?’అని మంత్రి వ్యాఖ్యానించారు. సమావేశంలో ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు, ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ కరుణాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement