రాష్ట్రంలో అటు కరోనా.. ఇటు సీజనల్‌ వ్యాధుల దాడి | Seasonal Diseases Hit Telangana Patients Rush To Hospitals | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అటు కరోనా.. ఇటు సీజనల్‌ వ్యాధుల దాడి

Published Thu, Jul 22 2021 3:35 AM | Last Updated on Thu, Jul 22 2021 3:35 AM

Seasonal Diseases Hit Telangana Patients Rush To Hospitals - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒకవైపు కరోనా భయపెడుతుంటే, మరోవైపు సీజనల్‌ జ్వరాలతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నెలన్నర రోజుల్లో దాదాపు 10 లక్షల మంది జ్వరాల బారినపడినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు అంచనా వేశాయి. ఇందులో అనేకమంది కరోనా రోగులుండగా.. మరింత మంది సాధారణ, డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి జ్వరాలకు గురయ్యారు. కొందరికి డెంగీతో పాటు కరోనా కూడా సోకుతోందని తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఒకే వ్యక్తికి కరోనాతోపాటు డెంగీ, మలేరియా పరీక్షలు కూడా చేయాల్సి వస్తోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 352 డెంగీ కేసులు, 374 మలేరియా కేసులు నమోదు కాగా, అందులో గత 20 రోజుల్లోనే 52 డెంగీ, 41 మలేరియా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లోని పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులకు డెంగీ కేసులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇంటింటా జరుపుతున్న పరీక్షల్లో లక్షలాది జ్వరం కేసులు గుర్తిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు రోజుకు దాదాపు లక్షన్నర మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.

ఇలా పరీక్షలకు వచ్చే వారిలో చాలామంది జ్వరాలతోనే వస్తున్నారు. ఈ క్రమం లో హైదరాబాద్‌లోని ఫీవర్‌ ఆస్పత్రికి వచ్చే ఔట్‌ పేషెంట్ల సంఖ్య పెరుగుతోంది. అలాగే మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రికి పది రోజుల కిందట 1,400 ఔట్‌పేషెంట్లు (ఓపీ) రాగా, బుధవారం 1,800 ఓపీ నమోదైంది. ఇక్కడ ఈ ఏడాదిలో ఇప్పటివరకు 12 డెంగీ కేసులు నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సాధారణ జ్వరాలతో పాటు డెంగీ, మలేరియా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వం జిల్లాల్లో తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చినా, అక్కడ అన్ని పరీక్షలు చేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో చాలావరకు ప్రాథమిక ఆస్పత్రుల్లో మందులు, ఇంజెక్షన్లు ఉండటం లేదని, చీటీలు రాసి ఇచ్చి బయట తెచ్చుకోవాలని చెబుతున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి. కొన్నిచోట్ల వైద్యులు అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి.   

వేలు గుంజుతున్న ప్రైవేటు ఆసుపత్రులు 
ఇప్పటివరకు కరోనాతో దండుకొన్న కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు, ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులను సొమ్ము చేసుకుంటున్నాయి. కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు రక్త పరీక్షలు, ప్లేట్‌లెట్ల పేరుతో బాధితుల నుంచి వేలకు వేలు గుంజుతున్నాయి. బుధవారం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లిన ఒక బాధితుడికి వింతైన అనుభవం ఎదురైంది. సాధారణ జ్వరం వచ్చిందని వెళితే సీబీపీ, ఈఎస్సార్, డెంగీ టెస్టులు చేయాలని డాక్టర్‌ సూచించాడు. అందుకోసం అదే ఆసుపత్రిలో టెస్టులు చేయించుకోగా ఏకంగా రూ.9 వేల బిల్లు వేశారు. ఇక ప్లేట్‌లెట్లను ఎక్కిస్తే రూ. 50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేస్తున్న కార్పొరేట్‌ ఆసుపత్రులు హైదరాబాద్‌లో ఎన్నో ఉన్నాయి. సాధారణ ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ రూ. 50 వేల వరకు వసూలు చేస్తున్నారు.  ప్లేట్‌లెట్లు 40 వేల దిగువకు పడిపోతేనే సమస్య ఉంటుందని వైద్యులు అంటున్నారు. కానీ 50 వేలున్నా తక్కువ ఉన్నాయంటూ ప్లేట్‌లెట్లు ఎక్కిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల కొరత కారణంగానే రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.  

చలి జ్వరం వస్తే మలేరియా 
వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత సీజనల్‌ జ్వరాలు పెరుగుతాయని వైద్య ఆరోగ్యశాఖ చెబుతుంది. ఏజెన్సీలో మలేరియా, ఇతర ప్రాంతాల్లో డెంగీ జ్వరాలు అధికంగా వ్యాపిస్తాయి. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఈ జ్వరాలను రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు సూచిస్తున్నాయి. మలేరియా వ్యాధి సోకితే చలి, వణుకుతో మొదలై జ్వరం వస్తుంది. చలి ప్రారంభమైనప్పుడే తలనొప్పి, ఒళ్లు నొప్పులు కూడా వస్తాయి. తర్వాత చలి బాగా పెరిగి ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా వణుకు తగ్గదు. జ్వర తీవ్రత తగ్గినప్పుడు విపరీతంగా చెమట పడుతుంది. ఈ జ్వరం ప్రతిరోజూ లేక రోజు విడిచి రోజు లేక నాలుగు రోజులకు ఒకసారి వస్తుంది.   

డెంగీలో తీవ్రమైన జ్వరం, తలనొప్పి 
డెంగీలో ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది. కళ్లు తెరవడం కష్టంగా ఉంటుంది. కదిపితే నొప్పి వస్తుంది. చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. కండరాలు, కీళ్ల నొప్పులు ఉంటాయి. అధిక దాహం, రక్తపోటు పడిపోవడం ఉంటుంది. డెంగీ నిర్ధారణలో వైద్య పరీక్షలే కీలకం. కేవలం ప్లేట్‌లెట్‌ కౌంట్, డెంగీ స్ట్రిప్‌ టెస్ట్, సీరమ్‌ టెస్ట్‌ వంటి వాటితో దీనిని నిర్ధారించడం శాస్త్రీయం కాదని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. విధిగా అందుబాటులో ఉండే ఐజీఎం పరీక్ష చేయించాలి.   

వివిధ జిల్లాల్లో పరిస్థితి ఇలా.. 
– భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో  సాధారణ జ్వరాలు, డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. జ్వరాలతో ఆసుపత్రులకు వచ్చే వారికి తీవ్రతను బట్టి మూడు నుంచి ఐదు రోజులకు మందులు ఇస్తున్నారు. కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో వైద్యులు సమయానికి విధులకు హాజరుకావడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇక భద్రాచలం ఏరియా ఆస్పత్రికి ఛత్తీస్‌గఢ్‌తో పాటు ఒరిస్సా, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి కూడా సీజనల్‌ వ్యాధులతో ప్రజలు వస్తున్నారు. దీంతో పడకలు సరిపోవడం లేదు. ఈ ఆసుపత్రిలో డెంగీ కిట్లు అందుబాటులో లేవు. 
– మహబూబ్‌నగర్‌లో జిల్లాలో కూడా విష జ్వరాలు మొదలయ్యాయి. జనరల్‌ ఆస్పత్రిలో వైద్యులు రెగ్యులర్‌గా వస్తున్నా మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎవరూ అందుబాటులో ఉండడం లేదనే విమర్శలున్నాయి. నాగర్‌ కర్నూల్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం పది మంది వరకు బాధితులు సాధారణ జ్వరాలతో ఆసుపత్రికి వస్తున్నారు.  
– అదిలాబాద్‌ జిల్లాలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 17 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఒక మలేరియా కేసు నమోదైంది. ఆసిఫాబాద్‌ జిల్లాలో 41 టైఫాయిడ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో బాధితులకు మందులు బయట కొనుక్కోవాలని చెబుతున్నట్టు సమాచారం. మంచిర్యాల జిల్లాలో 11 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు జిల్లాల్లోని కొన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు అందుబాటులో ఉండడం లేదని బాధితులు చెబుతున్నారు.  
– ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నస్టిక్‌ హబ్‌లో డెంగీకి సంబంధించిన ఎలిసా టెస్ట్‌ అందుబాటులో ఉంది. కానీ 90 శాంపిళ్లు వచ్చినప్పుడు మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. దీంతో బాధితులకు సకాలంలో వైద్యం అందడం లేదు. గత రెండ్రోజుల్లో ఐదుగురికి మలేరియా పాజిటివ్‌గా తేలింది. 

మందులు అందుబాటులో ఉంచాలి 
కొత్తగూడెం ఆస్పత్రిలో జ్వరానికి సంబంధించి కొన్ని మందులు లేకపోవడం వల్ల బయట షాపులకు వెళ్లి కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఆసుపత్రిలో అన్ని రకాల మందులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. 
– మౌనిక, కొత్తగూడెం 

వైద్యులు సమయపాలన పాటించాలి 
ఆసుపత్రి వైద్యులు సమయపాలన పాటించాల్సిన అవసరం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులు నిత్యం అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలి. 
– లక్ష్మి, రుద్రంపూర్‌ 

ప్లేట్‌లెట్‌ కౌంట్‌ మిషిన్‌ పనిచేయడం లేదు  
భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో డెంగీకి సంబంధించి ప్లేట్‌ లెట్స్‌ కౌంట్‌ మిషన్‌ పనిచేయడం లేదు. దీనివల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. సీజనల్‌ వ్యాధుల సమయంలో బాగు చేయాల్సిన అవసరం ఉంది. 
– పుష్ప, వెంకటాపురం 
 

టీటీ ఇంజెక్షన్లు లేవు  
కాలికి గాయమై కల్వకుర్తి కమ్యూనిటీ ఆసుపత్రికి వెళితే అక్కడ టీటీ ఇంజెక్షన్‌ కూడా అందుబాటులో లేదు. ఆసుపత్రి సిబ్బంది చీటీ రాసి ఇచ్చి తెచ్చుకోమన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే వారే దుకాణానికి వెళ్లి తెచ్చిచ్చారు. చదువుకున్నవారి పరిస్థితే ఇలా ఉంటే.. ఇక నిరక్షరాస్యులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థం అవుతుంది. ఉన్నతాధికారులు ఆసుపత్రిలో మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉండేలా చూడాలి.  
–జ్యోతి ప్రసాద్, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement