గీసుకొండ/వరంగల్: మెరుగైన వైద్యం అందుతుందని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన పాపానికి లక్షల్లో బిల్లు వేశారు. అయినా రోగి ప్రాణం కాపాడారా అంటే అదీ లేదు. ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి పరాకాష్టగా నిలిచిన ఈ సంఘటన వరంగల్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. వరంగల్ రూరల్ జిల్లా గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం గ్రామానికి చెందిన రైతు కొప్పుల మొగిలి (63) ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. వైద్య పరీక్షలతో పాటు కోవిడ్ టెస్ట్ చేయించగా స్వల్పంగా కరోనా లక్షణాలున్నాయని, ఆస్పత్రిలో చేరితే మంచిదని వైద్యులు సలహా ఇచ్చారు. దీంతో బంధువులు అతడిని వరంగల్ నగరం ములుగు రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి్పంచారు.
రెండు మూడు రోజులు జనరల్ వార్డులో చికిత్స చేసిన అనంతరం ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉన్నాయని, ఐసీయూ వార్డులోకి మార్చాలని వైద్యులు సూచించడంతో అలాగే చేశారు. అయితే ఐసీయూలో ఉంచినా మొగిలి కోలుకోలేదు. పైగా, పేగు మెలిక పడిందని, ఆపరేషన్ చేసి సరిచేయాలని వైద్యులు చెప్పడంతో.. ఆ ఆపరేషన్ కూడా చేయించారు. అయితే, శుక్రవారం రాత్రి 9 గంటలకు చికిత్స పొందుతూ మొగిలి ఆస్పత్రిలోనే మృతిచెందాడు. చివరి బిల్లు రూ. 5.80 లక్షలు చెల్లించాలని ఆస్పత్రి వర్గాలు చెప్పాయని, యాజమాన్యాన్ని బతిమిలాడగా రూ. లక్ష తగ్గించారని మృతుడి కుమారుడు రంజిత్ తెలిపారు. ఆస్పత్రిలో చేరిన 20 రోజుల్లో సుమారు రూ.13 లక్షలు ఖర్చయ్యాయని, అయినా ప్రాణం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఇదే గ్రామంలో పది రోజుల వ్యవధిలో ఆరుగురు కరోనాతో మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment