సాక్షి, హైదరాబాద్ : కరోనా వేగానికి కళ్లెం వేసేందుకు సర్కారు కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు మరిన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అనుమతించాలని నిర్ణయించింది. అందుకోసం ప్రైవేటు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 150 ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు కరోనా చికిత్సకు అనుమతివ్వగా, అందులో ప్రస్తుతం 91 ఆసుపత్రుల్లో చికిత్సలు జరుగుతున్నాయి. మిగిలిన వాటిల్లో ఇంకా చికిత్సలు మొదలుకాలేదు. మరోవైపు 56 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా చికిత్సలు జరుగుతుండగా, ఇప్పటివరకు అంతకు మూడింతలు ప్రైవేటుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇంకా హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో మరో 100 ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతిచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం కరోనా చికిత్స చేయగలిగే వసతి కలిగిన ఆసుపత్రుల నుంచి దరఖాస్తులు తీసుకొని తమకు పంపాలని సర్కారు జిల్లా డీఎంహెచ్‌వోలను ఆదేశించింది. దీంతో ఆక్సిజన్, ఐసీయూ వసతి కలిగిన అనేక ప్రైవేటు ఆసుపత్రులు ముందుకొస్తున్నట్లు సమాచారం.
10 లక్షల ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు..
కరోనా నిర్ధారణ పరీక్షలను గణనీయంగా పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 5 లక్షలకు పైగా ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లను ప్రభుత్వం తెప్పించింది. ఇక నుంచి రోజుకు 40 వేల నిర్ధారణ పరీక్షలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో మరో 10 లక్షల కిట్లను కొనుగోలు చేయాలని శుక్రవారం నిర్ణయించారు. ఈ మేరకు కొనుగోలుకు వైద్య, ఆరోగ్య శాఖ ఇండెంట్ పెట్టింది. ఇదిలావుండగా ప్రస్తుతం 1,100 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు చేస్తున్నారు. అలాగే నియోజకవర్గానికో మొబైల్ లేబొరేటరీ వోల్వో బస్సులను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దీనికి తోడు మరికొన్ని కేంద్రాలను గుర్తించాలని వైద్య, ఆరోగ్య శాఖ జిల్లాలను ఆదేశించింది. ఉదాహరణకు కేరళ, కర్ణాటకల్లో విరివిగా ర్యాపిడ్ టెస్టులు చేసేందుకు ముఖ్య కూడళ్లలో శాంపిల్ కలెక్షన్, టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ కూడా టెస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సర్కారు భావిస్తోంది. జిల్లాల నుంచి ప్రతిపాదనలు వచ్చాక నిర్ణయం తీసుకోనున్నారు. కొన్ని ప్రైవేటు సంస్థలు, ఆలయాలు కూడా పరీక్షలు చేసేందుకు ఐసీఎంఆర్ అనుమతి కోరాయి. అలాంటి వాటికి కేంద్రం నుం చి అనుమతి వస్తే, తెలంగాణలోనూ అలాగే టెస్టు లు చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు.
పారామెడికల్ సిబ్బంది నియామకాలు..
అనేక టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, పరీక్షలు విరివిగా చేయాల్సి ఉండటంతో జిల్లాల్లో పారామెడికల్ సిబ్బందిని నియమించాలని సర్కారు కలెక్టర్లను ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో జిల్లాల్లో నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర త్రా సిబ్బందిని తాత్కాలిక పద్ధతిలో నియమించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలావుంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నియమించే నర్సులను ఔట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా రెగ్యులర్ విధానంలో భర్తీ చేయాలని రాష్ట్ర నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌పై ప్రభుత్వం చొరవ తీసుకుని 3,311 నర్సు పోస్టులను భర్తీ చేయాలని అసోసియేషన్ సెక్రటరీ జనరల్ లక్ష్మణ్ రుడావత్ సీఎంకు రాసిన లేఖలో కోరారు.
Comments
Please login to add a commentAdd a comment