కాస్ట్‌లీ కరోనా టెస్టులు!   | Private Hospitals Collecting More Amount For Coronavirus Tests | Sakshi
Sakshi News home page

కాస్ట్‌లీ కరోనా టెస్టులు!  

Published Fri, Aug 7 2020 4:38 AM | Last Updated on Fri, Aug 7 2020 4:40 AM

Private Hospitals Collecting More Amount For Coronavirus Tests - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా ఖరీదుగా మారాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరలు కాకుండా ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి. ఆర్‌టీ–పీసీఆర్‌ పద్ధతిలో నిర్వహిస్తున్న ఒక్కో కరోనా నిర్ధారణ పరీక్షకు రూ.2,200 మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా, దానికి రెట్టింపునకు మించి మరి వసూలు చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కరోనా అనుమానిత లక్షణాలున్న వారు గగ్గోలు పెడుతున్నారు.

కరోనా నిర్ధారణ పరీక్షకు రూ.2,200తో పాటు కొన్ని చోట్ల వచ్చిన వ్యక్తికి ఒక పీపీఈ కిట్‌ వేస్తున్నారు. శాంపిల్‌ తీసే వ్యక్తి కూడా మరోటి వేసుకుంటున్నాడు. ఈ రెండిం టికి రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం పీపీఈ కిట్‌ ధర రూ.300కు మించి లేదు. కానీ ఒక్కో పీపీఈ కిట్‌కు రూ.వెయ్యి వసూలు చేస్తున్నారు. కొన్ని చోట్లయితే సాధారణ మాస్క్‌ కాకుండా, తప్పనిసరిగా ఎన్‌–95 మాస్క్‌ ధరించాల్సిందేనని ఇచ్చి, దానికి కూడా రూ. 300 వసూలు చేస్తున్నా రు. ఇలా అవకాశమున్నంత మేరకు వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు.  

కిట్‌ తీసుకుంటేనే టెస్ట్‌
ఇక కిట్‌కు టెస్ట్‌కు ముడి పెట్టడం మరో ఘోరమై న దోపిడీగా బాధితులు చెబుతున్నారు. బంజారాహి ల్స్‌లో ఉన్న ఒక కార్పొరేట్‌ ఆసుపత్రికి ఎవరైనా కరోనా లక్షణాలున్నాయన్న అనుమానం తో టెస్ట్‌ కోసం వెళ్తే పరీక్ష మాత్రమే చేసి పంప డం లేదు. కరోనా కిట్‌కు రూ.13,500 చెల్లిస్తేనే టెస్ట్‌ చేస్తున్నారు. తమకు నెగెటివ్‌ వస్తే కిట్‌తో ఉపయోగమేంటని ప్రశ్నిస్తే, అది తమ ఆసుపత్రి ప్రొటోకాల్‌ అని చెబుతున్నారు. ఒకవేళ మున్ముందు బాధితుల ఇంట్లో ఎవరికైనాపాజిటివ్‌ వచ్చి సీరియస్‌ అయితే బెడ్‌ కూడా సులువుగా దొరుకుతుందని మభ్యపెడుతున్నారు. ఇలా కిట్ల కూ టెస్టులకే కాకుండా బెడ్‌కూ ముడిపెడుతూ బాధితుల భయాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. మరో ఆసుపత్రిలోనైతే ఏకంగా రూ.20 వేల హోం ఐసోలేషన్‌ కిట్‌ కొంటేనే టెస్ట్‌ చేస్తున్నారు. ఇక కొన్ని ఆసుపత్రులకు కరోనా టెస్ట్‌లు చేసే అనుమతి లేదు. దీంతో తమ వద్దకు వచ్చే బాధితులకు సీటీ స్కాన్‌ చేసి కరోనా నిర్ధారణ చేస్తున్నారు. సీటీ స్కాన్‌ కోసమే బాధితులు ఐదు వేల రూపాయలకు పైగా చెల్లించాల్సి వస్తుంది.  

చర్యలకు సిద్ధం.. 
రాష్ట్రంలో 23 ఆసుపత్రులు, ల్యాబ్‌ల్లో ఆర్‌టీ–పీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే టెస్టుల్లో జరుగుతున్న దోపిడీ.. కిట్‌ తీసుకుంటేనే టెస్ట్‌.. అనవసర సీటీ స్కాన్‌లపై వైద్య, ఆరోగ్య శాఖ సీరియస్‌గా ఉంది. దీనిపై గురువారం అధికారులు చర్చించారు. ఇలా ఇష్టారాజ్యంగా టెస్టులకు వసూళ్లు చేస్తున్న ఆసుపత్రులు, ల్యాబ్‌లపైనా చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నారు. మొదట్లో టెస్టులు సక్రమంగా చేయకపోవడం, శాంపిళ్ల సేకరణలోనూ లోపాలు వంటి వాటిపై 12 లేబొరేటరీలకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వేటిపైనా చర్యలు తీసుకోలేదు. దీన్నే అలుసుగా తీసుకొని కొన్ని ఆసుపత్రులు, లేబొరేటరీలు టెస్టులకు అధికంగా వసూలు చేస్తుండటంపై ప్రభుత్వం సీరియస్‌గా ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. వాటిపై నివేదిక కోరామని.. అనంతరం చర్యలు తీసుకుంటామని ఒక ఉన్నతాధికారి తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement