కరోనాకు ఏకరూప చికిత్స | treatment for coronavirus in villages in telangana | Sakshi
Sakshi News home page

గ్రామాల్లోనూ వైద్యం

Published Tue, Aug 4 2020 1:46 AM | Last Updated on Tue, Aug 4 2020 12:35 PM

treatment for coronavirus in villages in telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా సామాజిక వ్యాప్తి జరగడం, గ్రామా ల్లోనూ వైరస్‌ ఘంటికలు మోగడంతో సర్కారు అప్రమత్తమైంది. దీంతో గ్రామస్థాయిలోనూ కరోనా వైద్య చికిత్స అందించేందుకు సర్కారు సన్నద్ధమైంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) మొదలు జిల్లా ఆసుపత్రి స్థాయి వరకు నాణ్యమైన వైద్యం అందించేలా సర్కారు కసరత్తు ప్రారంభించింది. అయితే చికిత్స ఏ విధంగా ఉండాలన్న దానిపై రాష్ట్రంలో చాలామంది వైద్యులకు అవగాహన లేదన్న ఫిర్యాదులు వచ్చాయి. ఇటీవల వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పలు జిల్లాలకు వెళ్లొచ్చారు. ఈ సందర్భంగా ఒక్కోచోట ఒక్కో రకంగా కరోనా పాజిటివ్‌ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు ఆయన దృష్టికి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఏకరూప వైద్యం అందడం లేదని తేలింది. ఇది సరైన పద్ధతి కాదని మంత్రి ఈటల భావించి వైద్య నిపుణులతో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. ఆ మేరకు సోమ వారం రాష్ట్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ), ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుప త్రులు, ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు చెందిన జనరల్‌ ఫిజీషియన్లు, కరోనా చికిత్సలో నిమగ్నం అవుతున్న ఇతర డాక్టర్లందరికీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వర్క్‌షాప్‌ పెట్టి శిక్షణ ఇప్పించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డీఎంఈ రమేష్‌ రెడ్డి, అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్‌ విజయ్‌ ఎల్దండి, హైదరాబాద్‌కి చెందినడాక్టర్‌ ఎంవీ రావు, డాక్టర్‌ సునీత, నిమ్స్‌ వైద్యులు డాక్టర్‌ గంగాధర్‌లు వైద్యులకు పలు సూచనలు ఇచ్చారు. కరోనాకి రాష్ట్రమంతా ఒకే వైద్య విధానం ఉండాలని వారు పేర్కొన్నారు.

ప్రొటోకాల్‌ పాటించాలి: ఈటల రాజేందర్, మంత్రి
ఇతర దేశాల చికిత్స పద్ధతులు పంచుకునేందుకు ఈ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నామని మంత్రి ఈటల అన్నారు. చికిత్స విషయంలో ఒక స్పష్టత వచ్చిందని, అందరూ ఈ ప్రోటోకాల్‌ పాటించాలన్నారు. ఎంత డబ్బు అయినా ఇవ్వడానికి సీఎం సిద్ధంగా ఉన్నారన్నారు. ఏ ఒక్క రోగినీ వెనక్కు పంపించవద్దన్నారు. చికిత్స అందించి రోగి కుదుటపడ్డాకే (స్టేబిలైజ్‌ చేసిన తరువాతే) పెద్ద ఆసుపత్రులకు పంపించాలన్నారు. బతికించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కెప్టెన్‌గా 24 గంటలూ అందుబాటులో ఉంటానన్నారు. సోమేష్‌కుమార్‌ మాట్లాడుతూ సీఎం ఆదేశాలతో ఎక్కువ సమయం కరోనాపైనే సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. గత ఆరు నెలల అనుభవం చూస్తే ఎంత తొందరగా చికిత్స ప్రారంభిస్తే అంత త్వరగా రోగులు కోలుకుంటున్నారని అర్దమైందన్నారు. ఆలస్యం చేస్తే చనిపోతున్నారన్నారు.

ధైర్యమే శ్రీరామరక్ష: డాక్టర్‌ విజయ్‌ ఎల్డండి

ధైర్యమే కరోనా రోగులకు శ్రీరామరక్ష. భయం వల్ల చాలా మంది చనిపోతున్నారు. ముందుగా వారికి ధైర్యం కల్పించాలి. 
– సాధ్యమైనంత తొందరగా చికిత్స ప్రారంభిస్తే మరణాల శాతం గణనీయంగా తగ్గించవచ్చు. 
 – ఈ వైరస్‌ వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయని తాజాగా తెలిసింది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల యువకులు కూడా చనిపోతున్నారు.
– కరోనాలో అందరూ ముందుగా చేయాల్సింది ఆక్సిజన్‌ స్థాయులను ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకోవడమే. 
– ఈ వైరస్‌ వ్యక్తికి సోకిన తర్వాత అత్యంత వేగంగా వృద్ధి చెంది మళ్లీ వెంటనే తగ్గిపోతుంది. కానీ అది చేసిన ఇన్ఫ్లమేషన్‌ అనేది తగ్గక పోవడం వల్ల మరణాలు జరుగుతున్నాయి. 
– కరోనా నిర్ధారణ కాగానే యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్‌ అంటే డెక్షామితాజోన్‌ వంటివి ఇవ్వడం వల్ల వెంటిలేటర్‌ మీదకి వెళ్లే వారి సంఖ్య తగ్గించవచ్చు. 
– యాంటీ వైరస్‌ మందుల వల్ల పెద్దగా ఉపయోగం లేదు. 
– సిటీ స్కాన్‌ ద్వారా కరోనాను నిర్ధారించలేం. దాని వల్ల ప్రయోజనం ఉండదు. 
తక్షణమే చికిత్స: డాక్టర్‌ ఎంవీ రావు
– పాజిటివ్‌ వచ్చిన రోజే చికిత్స మొదలుపెట్టాలి. ఆక్సిజన్‌ అవసరం అయిన తొలిరోజు నుంచే రెమిడిసివిర్‌ ఇవ్వాలి. 
– ఆక్సిజన్‌ లెవెల్స్‌ తక్కువ అయినప్పుడే ప్లాస్మా ఇవ్వాలి. వెంటిలేటర్‌ మీద ఉన్నప్పుడు ప్లాస్మా ఇచ్చినా ఉపయోగం ఉండదు. 
లక్షణాలు కనిపించగానే చికిత్స: డాక్టర్‌ సునీత
– కరోనా నిర్దారణ ఫలితం కోసం వేచి చూడకుండా లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స మొదలు పెట్టాలి. 
– మైల్డ్, మోడరేట్, సీవియర్‌గా పేషెంట్లను విభజించుకొని చికిత్స అందించాలి. 
– మోడరేట్‌లో శ్వాస నిమిషానికి 24 సార్లు కంటే ఎక్కువ తీసుకొని, శాచురేషన్‌ లెవెల్స్‌ 90–93 మధ్య ఉన్నా, 90 కంటే తక్కువున్నా సీవియర్‌ పేషెంట్లుగా చికిత్స అందించాలి. 
పీహెచ్‌సీ స్థాయిలోనూ ఫీవర్‌ క్లినిక్‌లు: డాక్టర్‌ గంగాధర్‌
– ప్రతి పీహెచ్‌సీ వరకు ఫీవర్‌ క్లినిక్‌లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. 
– కరోనా నిర్ధారణ తర్వాత మూడు పరీక్షలు సరిపోతాయి. పల్స్‌ ఆక్సిమీటర్‌ ద్వారా ఆక్సిజన్‌ శాతాన్ని తెలుసుకోవచ్చు, ఎక్స్‌రే ద్వారా ఊపిరితిత్తులు ఎంతవరకు పాడయ్యాయో తెలుసుకోవడం, సీబీపీ పరీక్ష ద్వారా రక్తంలో ఉన్న మార్పులను గమనించవచ్చు.
– అందుబాటులో ఉంటే డీ డైమర్, పెరిటిన్, సీఆర్‌పీ తదితర పరీక్షలు కూడా చేయవచ్చు.
– హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వినియోగంపై పలు సందేహాలు ఉన్నాయి. కానీ లక్షణాలను బట్టి చికిత్స చేయాలి. 
–రెస్పిరేటరీ రేట్‌ 24 కంటే ఎక్కువగా ఉండటం, శాచురేషన్‌ 92 కంటే తక్కువగా ఉంటే వెంటనే ఆక్సిజన్‌ అందించడంతో పాటు స్టెరాయిడ్స్‌ మొదలుపెట్టాలి, డెక్షామితాజొన్‌ పాయింట్‌ 0.1ఎంజీ/ కేజీ ఉపయోగించాలి. ఈ దశలోనే రెమిడిసివిర్‌ ఇంజక్షన్‌ కానీ, ప్లాస్మా థెరపీ కానీ చేయడం వల్ల మేలు ఉంటుంది.
– స్టెరాయిడ్స్‌ వినియోగం వల్ల ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గుతుంది. అప్పటికీ రోగి శరీరం స్పందించకపోతే స్టెరాయిడ్స్‌ డోసును పెంచాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత పేషెంట్లకు వెంటిలేషన్‌ అమర్చాలి. 



కరోనా బాధితులను మూడు రకాలుగా విభజించారు.

1) సాధారణ లక్షణాలున్నవారు

2) మధ్యస్థ స్థాయిలో ఉన్న రోగులు,

3) తీవ్రమైన కరోనా లక్షణాలున్నవారు.
వారికి ఎలా చికిత్స అందించాలో నిపుణులు సూచించారు. నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్‌ ప్రతి 15 రోజులకు ఒకసారి నిర్వహించాలని నిర్ణయించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement