సాక్షి, హైదరాబాద్ : కరోనా పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్షల ధరను రూ. 2,200గా నిర్ణయించింది. వెంటిలేటర్ లేకుండా చికిత్స అందిస్తే రోజుకు, రూ.7000గా, అలాగే వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తే రూ. 9000 చెల్లించేలా ధరలను ఖరారు చేసింది. సాధారణ ఐసోలేషన్‌లో రోజుకు ధరను రూ.4500గా నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం వైద్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆ శాఖమంత్రి ఈటల రాజేందర్ మీడియా సమావేశం ద్వారా ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించారు. ఐసీఎంఆర్ నిబంధనలకు లోబడే రాష్ట్రంలో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ ల్యాబ్స్‌లోనూ కరోనా పరీక్షలకు అనుమతి ఇస్తున్నాని ప్రకటించారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి మాత్రమే టెస్టులు చేయాలని అధికారులకు అన్ని ఆస్పత్రులకు ఆదేశాలు ఇచ్చామని మంత్రి ఈటల స్పష్టం చేశారు. (30 నియోజకవర్గాల పరిధిలో 50 వేల పరీక్షలు)
దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే లాక్‌డౌన్‌ను విధించామని, ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా వైరస్ వ్యాప్తి చెందుతోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ సడలింపులు ఇచ్చిన అనంతరం హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు. ఇప్పటికి కోవిడ్‌ని ఆరోగ్య శ్రీ పరిధిలోకి తెచ్చే ఆలోచన లేదని చెప్పారు. కాగా హైదరాబాద్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టుదిట్టంగా నియంత్రించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే పలు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. రాబోయే వారం, పది రోజుల్లో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 50 వేల మందికి ముందుజాగ్రత్త చర్యగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఇందుకోసం కరోనా నిబంధనలను అనుసరించి ప్రైవేటు లేబొరేటరీలు, ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్స చేయించుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలు, ధరలను నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే కరోనా వ్యాప్తి నివారణ చర్యలపై ఈటల రాజేందర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి పలు నిర్ణయాలను తీసుకున్నారు. (తెలంగాణలో కొత్తగా 237 కరోనా కేసులు)
Comments
Please login to add a commentAdd a comment