సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా నివారణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటోందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని నోడల్ అధికారులు, డాక్టర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. పరిస్థితులను సమీక్షిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఒకే కుటుంబానికి సంబంధించి అనేక మందికి కరోనా వ్యాప్తి చెందుతుండడంతోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నట్లు తెలిపారు. ఇలాంటి కేసుల్లో అందరికీ కూడా ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారమే చికిత్స అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఐసీఎంఆర్ తాజాగా అనేక మార్పులతో పలు కీలక సూచనలు చేస్తూ గైడ్‌లైన్స్ విడుదల చేసింది. వాటి ప్రకారమే డిశ్చార్జ్ పాలసీ, హోమ్ ఐసోలేషన్, డెత్ గైడ్ లైన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుందని మంత్రి ప్రకటించారు. ప్రైమరీ, సెకండరీ, టెర్శరీ కాంటాక్ట్స్‌ను లక్షణాలు లేకుంటే ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలని ఐసీఎంఆర్ మార్గదర్శకాలు విడుదల చేసింది. వీరికి ఇంట్లో ఒక ప్రత్యేక గది ఏర్పాటు చేసి అందులో ఉంచాలని, వారి సహాయం కోసం ఒక వ్యక్తిని అందుబాటులో ఉండేలా చూసుకోవాలని.. సహాయం అందిస్తున్న వ్యక్తికి హెచ్‌సీక్యూ టాబ్లెట్స్ అందించాలని సూచించింది. చదవండి: లాక్‌డౌన్ ముగింపు: ప్రజారవాణాకు సిద్ధం!
ఎలాంటి చికిత్స లేకుండా డిశ్చార్జి
గైడ్‌లైన్స్ ప్రకారం.. 17 రోజుల పాటు వారిని పర్యవేక్షణలో ఉంచాలని పేర్కొంది. కరోనా సోకిన వ్యక్తులకు పది రోజుల పాటు చికిత్స అందించిన తర్వాత ఎలాంటి చికిత్స అవసరం లేకుండా డిశ్చార్జి చేయవచ్చని తెలిపింది. ఈ విధంగా డిశ్చార్జ్ అయిన వారిని మరో ఏడు రోజుల పాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉంచాలి. ఒకవేళ మళ్లీ లక్షణాలు కనిపించినా, ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని మాత్రం హాస్పిటల్‌లో ఉంచి చికిత్స అందించాలని ఐసీఎంఆర్ నిర్దేశించింది. ఇలా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న వారిని ఉదయం సాయంత్రం మెడికల్ టీమ్‌లు పరీక్షలు చేస్తారని, అవసరం అయిన నిత్యావసర వస్తువులు అన్నీ కూడా జీహెచ్‌ఎంసీ ద్వారా అందిస్తామని మంత్రి ఈటల తెలియజేశారు. సమన్వయం కోసం ప్రత్యేక నోడల్ ఆఫీసర్‌ను కూడా నియమించామన్నారు.
కరోనా మరణాల విషయంలో ఐసీఎంఆర్ కొత్త గైడ్ లైన్స్
కాన్సర్, గుండెజబ్బులు, లేదా ఇతర జబ్బులతో చనిపోయిన వారికి కరోనా పాజిటివ్ ఉన్న కూడా దీర్ఘ కాలిక వ్యాదులతో చనిపోయినట్టుగానే పరిగణించాలని కొత్త నిబంధనల్లో పేర్కొంది. ఈ మరణాల కారణాలను విశ్లేషించడానికి ప్రొఫెసర్లతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం చేస్తుంది. వారిచ్చిన డెత్ ఆడిట్ రిపోర్ట్ ప్రకారమే మరణాలను ప్రకటించాలని ఐసీఎంఆర్ తెలిపింది. చదవండి: అలర్ట్: ఆ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
Comments
Please login to add a commentAdd a comment