సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. నగదు రహిత ఆరోగ్య కార్డులు ఇచ్చినప్పటికీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో వారికి వైద్య సేవలు అందడం లేదు. ప్రభుత్వం ఇస్తున్న ప్యాకేజీపై ఆయా ఆసుపత్రుల విముఖత కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. వైద్య సేవలపై అనేకసార్లు ప్రభుత్వానికి, కార్పొరేట్ ఆసుపత్రులకు మధ్య జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే.
ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లోనూ పురోగతి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా తాజాగా కసరత్తు పూర్తిచేశారు. కార్పొరేట్ ఆసుపత్రులు కోరుతున్నట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఏ మేరకు ఖర్చు అవుతుందనే అంశంపై ఆయన ఒక అంచనాకు వచ్చారు. ఈ వివరాలను ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు నివేదించారు.
రూ. 500 కోట్లు అదనం: ప్రభుత్వానికి, కార్పొరేట్ యాజమాన్యాలకు మధ్య ప్రతిష్టంభనకు ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఓపీ సేవలు ఉచితంగా ఇవ్వాలని.. మెడికల్ ప్యాకేజీ ఇప్పుడున్నట్లే కొనసాగించాలని ప్రభుత్వం కోరుతోంది. వీటిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం (టీశా) తిరస్కరించింది. ఉచితమైతే ఉద్యోగులు అవసరం ఉన్నా లేకున్నా ఓపీ, వైద్య పరీక్షలు చేయించుకుంటారన్నది టీశా ప్రతినిధుల అంటున్నారు. ప్రస్తుతమున్న మెడికల్ ప్యాకేజీ ఆమోదయోగ్యంగా లేదని స్పష్టం చేస్తున్నారు. నిమ్స్ మాదిరిగా మెడికల్ ప్యాకేజీ, ఓపీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి అంగీకరిస్తే మెడికల్ ప్యాకేజీ, ఓపీలకే రూ. 500 కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడుతుందని సురేశ్‌చందా అంచనా వేశారు.
శస్త్రచికిత్సల ప్యాకేజీ 25 శాతం పెంచినా పెద్దగా భారం ఉండదని అంటున్నారు. ఉచిత ఓపీ, మెడికల్ ప్యాకేజీలపైనే అధిక భారం ఉంటుందని సమాచారం. దీనిపై త్వరలో సీఎస్‌తో సమావేశం కావాలని.. ఆర్థికశాఖకు భారంపై నివేదించి సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.
మెడికల్ ప్యాకేజీ, ఓపీ సేవలకు 500 కోట్లు
Published Sat, Jul 4 2015 2:33 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement