మరమ్మతులు పూర్తయిన గుంటూరు జిల్లా బాపట్లలోని వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్
సాక్షి, అమరావతి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురై జబ్బున పడ్డ సర్కారీ వైద్యానికి సీఎం వైఎస్ జగన్ చికిత్స చేపట్టారు. కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దడంతో పాటు, ప్రజలకు వైద్యాన్ని చేరువ చేయడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా పట్టణ ప్రాంత ప్రజలకు సర్కార్ వైద్యాన్ని చేరువ చేయడం కోసం ‘వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్’ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఈ భవనాల నిర్మాణం వడివడిగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 259 అర్బన్ హెల్త్ సెంటర్లు ఉండేవి. పెరిగిన పట్టణ జనాభా, వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ అర్బన్ హెల్త్ సెంటర్లను ‘వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్’లుగా మార్చడంతో పాటు, కొత్తగా 301 క్లినిక్‌ల ఏర్పాటుకు గత ఏడాది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓ వైపు సొంత భవనాలు సమకూరుస్తూనే.. ఆగస్టు 15 నుంచి తాత్కాలిక భవనాల్లో వైద్య సేవలను ప్రారంభించింది.
30 వేల మందికి ఒకటి చొప్పున
రాష్ట్ర వ్యాప్తంగా నగర, పట్టణ ప్రాంతాల్లో 40 లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. ఈ లెక్కన గత టీడీపీ ప్రభుత్వం 50 వేల జనాభాకు ఒకటి చొప్పున పట్టణ ప్రాథమిక కేంద్రాలు కేవలం 73 మున్సిపాలిటీల్లో 259 మాత్రమే ఉండేవి. ఈ నేపథ్యంలో పట్టణాల్లో మధ్యతరగతి, పేద ప్రజలు వైద్యం కోసం పడుతున్న అగచాట్లను సీఎం వైఎస్ జగన్ సర్కార్ గుర్తించింది. ఈ ఇబ్బందిని అధిగమించడానికి పట్టణాల్లో 30 వేల జనాభాకు ఒకటి చొప్పున వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్‌లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది.
గుంటూరు రెడ్డిపాలెంలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్
సొంత భవనాల నిర్మాణం
వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్‌లకు సొంత భవనాలను సమకూర్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఇప్పటికే ఉన్న సొంత భవనాలకు మరమ్మతులు, కొత్త భవనాల నిర్మాణాన్ని చేపడుతున్నారు. సొంత భవనాలు 205 ఉండగా, వీటిలో 150 భవనాలకు ఇప్పటికే మరమ్మతు పనులు పూర్తయ్యాయి. మిగిలిన భవనాల మరమ్మతులు వివిధ దశల్లో ఉన్నాయి. 355 క్లినిక్‌లకు సొంత భవనాలు నిర్మించాల్సి ఉండగా, 345 భవనాల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. వీటిలో 343 భవనాల నిర్మాణానికి స్థలాలు సేకరించి, శంకుస్థాపనలు చేశారు. ఈ భవనాల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోంది.
ఒక్కో భవనానికి రూ.80 లక్షలు
ప్రభుత్వం కొత్త భవనాల నిర్మాణానికి ఒక్కోదానికి రూ.80 లక్షలు, సొంత భవనాల మరమ్మతులకు ఒక్కోదానికి రూ.10 లక్షలు వెచ్చిస్తోంది. కొత్తగా నిర్మించే భవనాల్లో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు ఉండేలా చర్యలు తీసుకుంటోంది. రోగులు వేచి ఉండే గది, అవుట్ పేషెంట్, ప్రసూతి, డ్రెస్సింగ్, లేబోరేటరి, ఫార్మసీ గదులు, ఆపరేషన్ థియేటర్, కౌన్సెలింగ్ హాల్, మహిళలు, పురుషులకు వేర్వేరుగా జనరల్ వార్డులు ఉండేలా నిర్మిస్తున్నారు.
సేవలు ఇలా..
► ప్రతి వార్డుకు రెండు కిలోమీటర్ల దూరం లోపు లేదా 15 నిమిషాల నడక దూరంలో ఆస్పత్రి ఉంటుంది.
► గతంలో పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క నర్సు మాత్రమే అందుబాటులో ఉండే వారు.
► గతంలో 73 మున్సిపాలిటీల్లో మాత్రమే పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండేవి. ప్రస్తుతం అన్ని మున్సిపాలిటీల్లో అందుబాటులోకి వచ్చాయి.
► ఇప్పటికే ఉన్న 61 మంది డాక్టర్లకు అదనంగా ప్రభుత్వం 499 మందిని నియమించింది.
► గతంలో ఓపీ సేవలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం పది పడకలతో ఇన్ పేషెంట్ విభాగం అందుబాటులోకి వచ్చింది. భవనాల నిర్మాణం పూర్తయిన వెంటనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. డెలివరీలు సైతం ఇక్కడే నిర్వహించనున్నారు.
► వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్‌లలో 65 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి వైద్య పరికరాల కొనుగోలు ప్రక్రియ టెండర్ల దశలో ఉంది.
► ఇప్పటికే 206 రకాల మెడిసిన్స్‌ను ప్రభుత్వం క్లినిక్‌లలో అందుబాటులో ఉంచింది.
► గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం 32 రకాల ఆరోగ్య కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కార్యక్రమాలన్నింటినీ వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్‌ల ద్వారా పట్టణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతోంది.
నవంబర్‌కు పూర్తి
నవంబర్ ఆఖరుకు వైఎస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఆ మేరకు కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళుతున్నాం. పనుల్లో నాణ్యత లోపించకుండా చూస్తున్నాం.
– డాక్టర్ వి.చంద్రయ్య, చీఫ్ ఇంజనీర్, మున్సిపల్, ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం
Comments
Please login to add a commentAdd a comment