
చట్టం చట్టుబండలు !
గుంటూరు మెడికల్ : వివిధ వ్యాధులతో ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఏ ఆపరేషన్‌కు ఎంత ఖర్చు అవుతుందో తెలిసేలా అందరికి కనిపించే ప్రదేశాల్లో వివరాలను ఉంచాలని ఏపీ అల్లోపతిక్....
వైద్యం కోసం ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించి జేబులు గుల్ల చేసుకున్న వారి గురించి, ఆరోగ్యం కోసం కార్పొరేట్ ఆస్పత్రులను ఆశ్రయించి ఆస్తిపాస్తులు అమ్మేసుకున్నవారి గురించి తరచూ వింటూనే ఉంటాం. ముందస్తుగా ఏ వైద్యానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియకపోవటం వల్లే ఇలాంటి సంఘటనలు పునరావృతమవుతున్నాయి.
గుంటూరు మెడికల్ :
వివిధ వ్యాధులతో ఆసుపత్రులకు వచ్చే రోగులకు ఏ ఆపరేషన్‌కు ఎంత ఖర్చు అవుతుందో తెలిసేలా అందరికి కనిపించే ప్రదేశాల్లో వివరాలను ఉంచాలని ఏపీ అల్లోపతిక్ మెడికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ రిజిస్ట్రేషన్ యాక్ట్-2007 స్పష్టం చేసింది. జిల్లాలో ఈ చట్టం 2008 నుంచి అమలులోకి వచ్చినా నేటికీ చాలా ఆస్పత్రులు రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు. చట్టాన్ని సమర్థంగా అమలు చేసి రోగులకు మేలు కలిగేలా చేయాల్సిన వైద్యాధికారులు పట్టీపట్టనట్టు వ్యవహరిస్తుండడం వల్ల చట్టం లక్ష్యం నీరుగారిపోతోంది.
చట్టం ఏం చెబుతోంది...
= ఏపీ అల్లోపతిక్ మెడికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ -2007 ప్రకారం అన్ని ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబ్‌లు తప్పని సరిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి.
= తమ తమ ఆస్పత్రుల్లో వైద్యం చేసే వైద్యుల పేర్లు, వారి అర్హతలు, ఆపరేషన్లు చేసినందుకు, వారి సేవలను వినియోగించుకున్నందుకు చెల్లించాల్సిన ఫీజుల వివరాలను తప్పని సరిగా రోగులకు కనిపించే విధంగా బోర్డు పెట్టాలి.
= ఈ విధంగా చేయటం వల్ల రోగులకు ఎంతో ఉపయోగం ఉంటుంది. వివరాలను ముందుగా తెలుసుకుని తమకు అను కూలంగా ఫీజులున్నట్లయితే రోగులు వైద్యం పొందటం లేదా ఇతర ఆస్పత్రులకు వెళ్లటం జరుగుతుంది.
= జిల్లాలో 2008 నుంచి ఇప్పటి వరకు 1082 ఆస్పత్రులు, ల్యాబ్‌లు మాత్రమే రిజిస్టర్ చేయించుకున్నాయి.
= రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు కూడా ఫీజుల వివరాలను తెలిపే బోర్డులను పెట్టకుండా చట్టాన్ని ఉల్లంఘిస్తూ రోగులను అందినకాడికి దండుకుంటున్నార నే ఫిర్యాదులు తీవ్రంగా వినిపిస్తున్నాయి.
= జిల్లా కలెక్టర్‌గా బి.రామాంజనేయులు పనిచేసిన కాలంలో జిల్లాలో డెంగీ పేరుతో రోగులను దోచుకుంటున్నారని స్వయంగా ఆయనకు ఫిర్యాదులు అందటంతో చట్టాన్ని అమలు చే యాలని జిల్లా ైవె ద్యాధికారులకు ఆదేశాలు ఇవ్వటంతో సుమారు 960వరకు ఆస్పత్రులు,ల్యాబ్‌లు రిజిస్టర్ చేయించుకుని కొన్నాళ్ల పాటు ఫీజుల వివరాలను వెల్లడించారు.
= తనిఖీల సమయంలో కొత్తపేట బోసుబొమ్మ సెంటర్‌లో పేరు గాంచిన ల్యాబ్‌లలో సైతం అర్హతలేని వారిచేత ల్యాబ్ పరీక్షలు చేస్తూ దొరికిపోయారు.
= అదే ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో పదోతరగతి కూడా పాస్‌కాని వారిచేత ఎక్సరేలు తీయిస్తూ ఆస్పత్రి నిర్వాహకులు జిల్లా వైద్యాధికారులకు దొరికిపోయారు.
= తదుపరి ఆ చట్టం గురించి పట్టించుకున్న నాథులే కరువయ్యారు.
అవసరం ఉంటేనే రిజిస్ట్రేషన్..
ప్రైవేటు ఆస్పత్రుల్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవల అనుమతి కావాల్సిన వారు, స్టేట్ మెడికల్ రియింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకునేవారు, మెడికల్ క్లెయిమ్స్ కోసం దరఖాస్తు చేసుకునే ఆస్పత్రుల నిర్వహాకులు మినహా ఇతరులెవ్వరూ రిజిస్ట్రేషన్ చేయించుకోవటం లేదు. ఆస్పత్రులకు రిజిస్ట్రేషన్ ఉంటేనే ఇలాంటి సౌకర్యాలను ప్రభుత్వం ఇస్తున్న దృష్టా తప్పని సరి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. వాస్తవానికి ఎవరైనా రోగులు ఆస్పత్రిలో పొందిన వైద్య సేవలపై అసంతృప్తి కలిగి వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించిన ప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆస్పత్రుల నిర్వాహకులకు ఊరట కలుగుతుంది.