ఓ ఆస్పత్రిలో తనిఖీలు చేస్తున్న జేసీ శివశంకర్
లబ్బీపేట (విజయవాడ తూర్పు): కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీపై అధికారులు స్పందించారు. మానవత్వాన్ని మరచి కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సైతం రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై కొరడా ఝళిపించారు.
రెండు ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీ
కోవిడ్ వైద్యానికి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో సోమవారం జాయింట్ కలెక్టర్(అభివృద్ధి) లోతేటి శివశంకర్ ఆధ్వర్యంలో సబ్–కలెక్టర్ హెచ్‌ఎం.ధ్యానచంద్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తొలుత సన్‌రైజ్ ఆస్పత్రికి వెళ్లగా, అప్పుడే అక్కడ మరణించిన కోవిడ్ రోగి బంధువులు నిరసన తెలియజేస్తున్నారు. వారి నుంచి జేసీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆస్పత్రి రికార్డులు పరిశీలించారు.
వైద్యం పొందుతున్న రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దీంతో సన్‌రైజ్ ఆస్పత్రి రిజిస్ట్రేషన్‌ను తాత్కాలికంగా రద్దు చేయడంతో పాటు, అడ్మిషన్లు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఇన్‌పేషెంట్లుగా ఉన్న వారికి మాత్రం చికిత్స కొనసాగించాలని ఆదేశించారు. అనంతరం చుట్టుగుంటలోని అనీల్ న్యూరో అండ్ ట్రామా ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. కోవిడ్ వైద్యం చేసేందుకు అనుమతి కోరుతూ ఈ నెల 17న దరఖాస్తు చేసుకుని, అనుమతి రాకుండానే.. అదే రోజు 12 మంది కోవిడ్ రోగులను అడ్మిట్ చేసుకున్నారని నిర్ధారించారు. ఆరోగ్యశ్రీ నిబంధనల ప్రకారం రూ.2 లక్షల జరిమానా విధించారు.
జీవో నం.77 ప్రకారం వైద్యం చేయాల్సిందే..
జిల్లాలోని కోవిడ్ వైద్యానికి అనుమతులు పొందిన ఆస్పత్రుల్లో ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం.77 ప్రకారం ఫీజులు తీసుకుని వైద్యం చేయాల్సిందేనని జాయింట్ కలెక్టర్ ఎల్.శివశంకర్ తేల్చి చెప్పారు. అలా కాకుండా అధిక ఫీజులు వసూలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తెలిసినా, ఫిర్యాదు అందినా.. సుమోటోగా చర్యలు తీసుకుంటామన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తే 104కు గానీ, 1902కు గానీ ఫోన్ చేయాలని శివశంకర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment