సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో రోగుల సంఖ్యకు అనుగుణంగా ప్రభుత్వం వైద్య ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రైవేటు మెడికల్ కాలేజీ అనుబంధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు చెందిన మరో 10 వేల పడకలను 7–10 రోజుల్లో సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆయా మెడికల్ కాలేజీల యాజమాన్యాల ప్రతినిధులతో వైద్య, ఆరోగ్య శాఖ చర్చలు జరిపింది. తాము అన్ని విధాలుగా కరోనా చికిత్సకు రంగం సిద్ధం చేస్తామని వారు హామీ ఇచ్చినట్లు కరోనా స్టేట్ హై లెవల్ కమిటీ ప్రతినిధి ఒకరు తెలిపారు. రాష్ట్రంలో పలుచోట్ల ప్రైవేటు బోధనాస్పత్రులు ఉండటంతో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన పాజిటివ్ రోగులను వాటిల్లో ఉంచి ప్రభుత్వం చికిత్స అందించనుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలోని గాంధీ, ఛాతీ, నేచర్ క్యూర్ ఆస్పత్రులతోపాటు కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు జరుగుతున్నాయి. అయితే కార్పొరేట్ ఆస్పత్రులు భారీగా ఫీజులు వసూలు చేస్తుండటం, కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రైవేటు బోధనాస్పత్రులను ప్రభుత్వం రంగంలోకి దింపింది.
బోధనాస్పత్రుల్లో ఫీజులపై తర్జనభర్జన...
రాష్ట్రంలో 22 ప్రైవేటు మెడికల్ కాలేజీలున్నాయి. వాటి అనుబంధ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం చేయాలని ప్రభుత్వం భావించినా యాజమాన్యాలు మాత్రం ఎన్నాళ్లు అలా చేయగలమని ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో ఇటీవల ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు ఖరారు చేసిన ఫీజుల అంశం చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు మెడికల్ కాలేజీల అనుబంధ ఆస్పత్రులు సాధారణ ఫీజులు వసూలు చేసుకొనేలా ఫిక్స్‌డ్ రేట్లను ఖరారు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై ఒకట్రెండు రోజుల్లో మార్గదర్శకాలను ఖరారు చేయనుంది. ప్రస్తుతం కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు కరోనా ఐసోలేషన్ (జనరల్ వార్డు)కు రూ. 4 వేలు, ఐసీయూలో వెంటిలేటర్ లేకుండా ఐసోలేషన్‌కు రూ. 7,500, ఐసీయూలో వెంటిలేటర్ సహా ఐసోలేషన్‌కు రూ. 9 వేల చొప్పున ఫీజు వసూలు చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతించింది. అయితే ప్రైవేటు బోధనాస్పత్రులకు ఈ మేరకు కాకుండా కాస్త తక్కువగా ఫీజులు ఖరారు చేస్తామని వైద్య, ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.
జిల్లా, ఏరియా ఆసుపత్రుల్లో చకచకా ఏర్పాట్లు
జిల్లా కేంద్ర ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లోనూ కొన్ని పడకలను కరోనా చికిత్సకు కేటాయించాలని సర్కారు నిర్ణయించింది. ఆ మేరకు రాష్ట్రంలో 70 ఆస్పత్రులకు వెంటిలేటర్లను సరఫరా చేసింది. ఒక్కో ఆస్పత్రికి 3–4 వెంటిలేటర్ల చొప్పున సరఫరా చేశామని అధికారులు తెలిపారు. లక్ష కేసులొచ్చినా వైద్యం అందించేలా రంగం సిద్ధం చేసినట్లు వైద్య వర్గాలు తెలిపాయి. శనివారం నాటికి రాష్ట్రంలో 13,436 పాజిటివ్ కేసులుండగా అందులో ప్రస్తుతం 8,265 యాక్టివ్ కేసులున్నాయి. గాంధీ సహా పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేవలం 500 మంది వరకు మాత్రమే చికిత్స పొందుతుండగా మరో 1,500 మంది వరకు ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని వైద్యాధికారులు చెబుతున్నారు. మిగిలిన 6 వేల మందికిపైగా ఇళ్లలోనే ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఇళ్లలో ఉన్న వారికి చికిత్స అందించే విషయంలో నిర్లక్ష్యం జరుగుతోందన్న విమర్శలను సర్కారు పరిగణనలోకి తీసుకుంది. దీనిపై సరైన పర్యవేక్షణ లేదన్న భావన కూడా ఉంది. కాబట్టి దీన్ని పకడ్బందీగా నిర్వహించాలని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment