డెంగీపై జర పైలం | Thousands of people suffer from dengue fever in the state | Sakshi
Sakshi News home page

డెంగీపై జర పైలం

Published Sun, Aug 25 2019 2:57 AM | Last Updated on Sun, Aug 25 2019 8:30 AM

Thousands of people suffer from dengue fever in the state - Sakshi

దేశంలో అత్యధికంగా డెంగీ కేసులు నమోదైన ప్రాంతంలో ఒకటిగా వనపర్తి జిల్లా పొలికిపాడు పీహెచ్‌సీ పరిధిలోని ఆముదాలకుంట తండా నిలిచింది. గత నెల ఒకే ఒక్క రోజు ఇక్కడ 19 మందికి డెంగీ సోకింది. దీంతో ఆ గ్రామంలో ఆరోగ్య నిఘా పెంచారు. నీటి నిల్వ ఉండటం వల్లే ఈ పరిస్థితి నెలకొందని తేలింది.

హైదరాబాద్‌లో గత బుధవారం ఒక్క రోజే దాదాపు 500 మందికి డెంగీ సోకినట్లు అంచనా. ప్లేట్‌లెట్లు 20 నుంచి 30 వేలకు పడిపోతున్నాయి. కార్పొరేట్‌ ఆసుపత్రులతో పాటు ఉస్మానియా, గాంధీ, నిలోఫర్‌ ఆసుపత్రులకు డెంగీ కేసులు వందల్లో వస్తున్నాయి.  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రాన్ని డెంగీ వణికిస్తోంది. వేలాది మంది డెంగీ జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్లేట్‌లెట్లు పడిపోతుండటం ప్రాణాలమీదకు వస్తోంది. వైద్య, ఆరోగ్యశాఖ మాత్రం.. ఈ జనవరి నుంచి గత బుధవారం వరకు 1,687 డెంగీ కేసులే నమోదైనట్లు పేర్కొంది. మొత్తం 11 వేల మందిని పరీక్షించగా ఆ కేసులు నమోదైనట్లు తెలిపింది. అయితే ప్రైవేటు ఆసుపత్రులకు వస్తున్న రోగుల సంఖ్య ఎంతనేది వైద్య, ఆరోగ్యశాఖ లెక్కగట్టకపోవడం, నిఘా పెంచకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆముదాలకుంట తండాలో ఒకేసారి అన్ని కేసులు నమోదు కావడంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలర్ట్‌ చేసింది. అయినా ఇక్కడి అధికార యంత్రాంగం అప్రమత్తం కాలేదని ప్రస్తుత పరిస్థితి చూస్తే తెలుస్తోంది.  

డెంగీ ప్రభావం ఇలా..
ఎడిస్‌ అనే దోమ వల్ల డెంగీ వస్తుంది. ఇది పగలే కుడుతుంది. ఉన్నట్టుండి తీవ్ర జ్వరం, భరించలేని తలనొప్పి వస్తుంది. కళ్లు తెరవడం కష్టంగా ఉంటుంది. కదిపితే నొప్పి వస్తుంది. జ్వరం విపరీతంగా ఉన్నప్పు డు కూడా ప్లేట్‌లెట్‌ సంఖ్య తగ్గదు. జ్వరం తగ్గిన తర్వాత ప్లేట్‌లెట్లు గణనీయంగా పడిపోతాయి. చాలా మంది ఇది గమనించక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొందరికి తీవ్ర రక్తస్రావం అవుతుంది. ముక్కు, మలం ద్వారం లేదా బ్రష్‌ వేసేప్పుడు పళ్ల మధ్య నుంచి రక్తస్రావం అవుతుంది. ఇలా అధిక రక్తస్రావం అయితే ప్రమాదకరం. మహిళలకు పీరియడ్స్‌ సమయంలో సాధారణ రక్తస్రావం కంటే అదనంగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో వెంటనే ప్లేట్‌లెట్లు ఎక్కించాలి. 15 వేల కన్నా తగ్గినా గుర్తించకపోతే డెంగీ మరణాలు సంభవిస్తాయి. 

ప్లేట్‌లెట్ల గుర్తింపులో మతలబు.. 
ప్లేట్‌లెట్‌ గుర్తించేందుకు మెషీన్‌ కంటే మైక్రోస్కోప్‌ పరీక్ష మంచిదని పలువురు సూచిస్తున్నారు. ఒక రోగికి ప్లేట్‌లెట్‌ పరీక్ష చేస్తే మెషీన్‌ కౌంట్‌లో 32 వేలు చూపిస్తే, మైక్రోస్కోప్‌ ద్వారా మాన్యువల్‌గా లెక్కిస్తే 65 వేల వరకు ఉండటం గమనార్హం. దీనికి ప్రధాన కారణం రక్త కణాలు ఒక్కోసారి మూడునాలుగు కలిపి ముద్దగా ఉంటాయి. దాన్ని మెషీన్‌ ఒకే రక్త కణంగా లెక్కిస్తుంది. అదే మైక్రోస్కోప్‌ పద్ధతిలో పరిశీలిస్తే నాలుగు రక్త కణాలుగా చూపిస్తాయి. 

డెంగీని ముందుగా గుర్తిస్తే 80 శాతం వరకు ఎటువంటి ప్రమాదం లేకుండా వైద్యుల చికిత్స పొందవచ్చు. కానీ కొందరికి తీవ్రమైన రక్తస్రావం అవుతుంది. అలాంటి సమయాల్లో ప్లేట్‌లెట్ల సంఖ్య 50 వేలున్నా తప్పనిసరిగా ప్లేట్‌లెట్లు ఎక్కించాలి. రక్తస్రావం కానప్పుడు 20 వేల వరకు ప్లేట్‌లెట్లు పడిపోయినా ప్రమాదం కాదు. అప్పుడు ప్రత్యేకంగా ప్లేట్‌లెట్లు ఎక్కించి రోగిని సాధారణ స్థితికి తీసుకొని రావచ్చు. 
– డాక్టర్‌ కె.కృష్ణప్రభాకర్, సిటీ న్యూరో ఆసుపత్రి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement