సాక్షి, అమరావతి: ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వైద్య శాఖ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గత మూడేళ్లలో ఏకంగా 40,676 పోస్టుల భర్తీ చేపట్టింది. దీంతో పాటు వైద్య శాఖలో ఏర్పడిన ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసుకునేలా అనుమతులిచ్చింది.
ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ), ఏపీ వైద్య విధాన పరిషత్(ఏపీవీవీపీ)లలో అసిస్టెంట్ ప్రొఫెసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్(సీఏఎస్‌ఎస్) పోస్టుల భర్తీకి వైద్య శాఖ ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో డీఎంఈలో 300కు పైగా, ఏపీవీవీపీలో 100కు పైగా పోస్టులు అభ్యర్థులు లేక మిగిలిపోయాయి. వీటిని వాక్–ఇన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
డీఎంఈలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ..
ఈనెల 19, 20, 21 తేదీల్లో వాక్–ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్వ్యూల షెడ్యూల్‌ను ఆదివారం విడుదల చేశారు. స్పెషాలిటీల వారీగా డీఎంఈలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు చేయనున్నారు.
19వ తేదీన కార్డియాలజీ, కార్డియోథొరాసిక్, వాస్కులర్ సర్జన్, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఎండోక్రినాలజి, మెడికల్ గ్యాస్ట్రో–ఎంటరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రో–ఎంటరాలజీ, మెడికల్ అంకాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, పీడియాట్రిక్ సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, నియోనాటాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీకి సంబంధించిన పోస్టులకు ఇంటర్వ్యూ చేస్తారు.
20వ తేదీన న్యూక్లియర్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, అనస్తీషియా, ఓబీజీ, రేడియాలజీ/రేడియోడయగ్నోసిస్, ట్రాన్స్‌ఫ్యూషన్ మెడిసిన్ పోస్టులకు.. 21వ తేదీన ఎమర్జెన్సీ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఫోరెన్సిక్ మెడిసిన్, డెర్మటాలజి, పల్మొనాలజీ, ఎస్పీఎం, పాథాలజీ, ఈఎన్‌టీ పోస్టులకు వాక్–ఇన్ ఇంటర్వ్యూలు చేయనున్నారు.
ఏపీవీవీపీలో సీఏఎస్‌ఎస్ పోస్టుల భర్తీకి..
ఏపీవీవీపీకి సంబంధించిన ఈనెల 19న అనస్తీషియా, జనరల్ సర్జరీ, ఈఎన్‌టీ, ఫోరెన్సిక్ మెడిసిన్, రేడియాలజీ, 20వ తేదీన జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, సైకియాట్రి, 21న ఓబీజీ, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, పాథాలజీ సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. డీఎంఈ, ఏపీవీవీపీ పోస్టుల కోసం ఆయా తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు దరఖాస్తులను స్వీకరిస్తారు.
మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు వాటిని పరిశీలిస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల్లోగా ఫలితాలు ప్రకటించి నియామక ఉత్తర్వులు అందజేస్తారు. డీఎంఈ పోస్టుల భర్తీకి సంబంధించిన మరిన్ని వివరాలకు dme.ap.nic.in, 7995055087, 9849902968 నంబర్లతో పాటు walkinrecruitmentdme@ gmail.comను సంప్రదించవచ్చని అధికారులు సూచించారు. ఏపీవీవీపీ పోస్టులకు సంబంధించిన వివరాలకు dme.ap.nic.in, 63011 38782, 9398344578 నంబర్లను,apvvpwalkinrecruitment@gmail. com మెయిల్‌ను సంప్రదించాలని కోరారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ప్రభుత్వం ఓ యజ్ఞంలా నియామకాల ప్రక్రియ చేపడుతోంది. వాక్–ఇన్ ఇంటర్వ్యూల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. శాశ్వత/కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టుల భర్తీ ఉంటుంది. ఈ అవకాశాన్ని అర్హులైన వైద్యులు వినియోగించుకోవాలి.
– డాక్టర్ వినోద్‌కుమార్, ఏపీవీవీపీ కమిషనర్, ఇన్‌చార్జ్ డీఎంఈ
Comments
Please login to add a commentAdd a comment