సాక్షి, హైదరాబాద్: డెంగీ విజృంభిస్తోంది. రోజురోజుకూ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఆగస్టు నెలలో రోజుకు సగటున వందమందికి పైగా దీని బారినపడ్డారు. సెప్టెంబర్‌లో మొదటి నాలుగు రోజుల్లోనే 599 మందికి జ్వరం సోకడం వ్యాధి విజృంభణను స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఈనెల నాలుగో తేదీ వరకు 6,151 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వానికి వైద్య ఆరోగ్యశాఖ సమర్పించిన తాజా నివేదిక వెల్లడించింది. జనవరి నుంచి జూలై వరకు 1950 కేసులు మాత్రమే నమోదు కాగా, ఒక్క ఆగస్టులోనే ఏకంగా 3,602 కేసులు నమోదు కావడం గమనార్హం. మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రుల్లో నమోదవుతున్న కేసులు చాలావరకు ప్రభుత్వం దృష్టికి రావడం లేదని అధికారులు అంటున్నారు.
అత్యధికంగా హైదరాబాద్‌లోనే..
రాష్ట్రంలో ఈ ఏడాది నమోదైన కేసుల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 2,998 రికార్డు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 588, మేడ్చల్‌లో 411, ఖమ్మంలో 361, సంగారెడ్డి జిల్లాలో 208 నమోదయ్యాయని నివేదిక వెల్లడించింది. జూలై నుంచి మొదలైన వర్షాలు కొన్ని రోజులు మినహా ఎడతెరపి లేకుండా కురుస్తుండటంతో ఎక్కడికక్కడ నీటి నిల్వలు పేరుకుపోవడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోనైతే పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటున్నారు.
జ్వర సర్వే.. దోమల నియంత్రణ
డెంగీ జ్వరాలతో రోగులు ఆసుపత్రులకు పోటెత్తుతున్నారు. చాలామందికి ప్లేట్‌లెట్లు తగ్గిపోవడంతో నాలుగైదు రోజులు ఆసుపత్రుల్లోనే ఉండాల్సి వస్తోంది. అనేక ఆసుపత్రులు ఈ పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్నాయి. కాగా డెంగీ తీవ్రత నేపథ్యంలో జ్వర సర్వే చేపట్టాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. పంచాయతీ, మున్సిపల్ శాఖ అధికారులతో కలిసి దోమల నివారణ చర్యలు చేపట్టింది.
డెంగీ అధికంగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలకు 20,912 డెంగీ నిర్ధారణ ర్యాపిడ్ కిట్లను సరఫరా చేసింది. మరో 6,501 కిట్లను సిద్ధంగా ఉంచింది. అలాగే అన్ని జిల్లాలకు మలేరియా నిర్ధారణకు అవసరమైన 5.25 లక్షల ఆర్డీటీ కిట్లను పంపించింది. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 40 వేల కిట్లను పంపించింది.
అయితే శాఖల మధ్య సరిగ్గా సమన్వయం లేకపోవడంతో దోమల నివారణ చర్యలు పూర్తిస్థాయిలో జరగడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దోమలు కుట్టకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, రాత్రి మాత్రమే కాకుండా పగటిపూట కూడా నివారణ చర్యలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తీవ్రమైన జ్వరం, భరించలేని తలనొప్పి, చర్మంపై దద్దుర్లు వంటివి డెంగీ ప్రధాన లక్షణాలని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment