సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులు ఎప్పుడైనా వైద్య సదస్సులు పెడితే మెడికల్ టూరిజంలో తాము ఎంతో ఘనత సాధించినట్లు చెప్పుకొంటారు. హైదరాబాద్‌ను మెడికల్ హబ్ అని అభివర్ణిస్తుంటారు. కానీ కేంద్రం సోమవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం మన రాష్ట్రం మెడికల్ టూరిజంలో 15వ స్థానంలో ఉంద ని పేర్కొంది. మెడికల్ టూరిజాన్ని అత్యధికంగా పెంపొందించే ప్రైవేటు ఆసుపత్రులు.. విదేశీ రోగు లను తమవైపు తిప్పుకోవడంలో, వైద్య రంగంలో వచ్చిన మార్పులపై మార్కెటింగ్ చేసుకోవడంలో విఫలమవుతున్నాయని నివేదికలు చెబుతున్నాయి. 2018లో తెలంగాణకు 3.18 లక్షల మంది విదేశీ టూరిస్టులు రాగా, అందులో 19 వేల మంది వరకు వైద్యం కోసం వచ్చినట్లు కేంద్రం అంచనా వేసింది. అయితే అంతకుముందు రెండేళ్లతో పోలిస్తే కాస్తంత పెరిగినా, దేశవ్యాప్త పరిస్థితితో పోలిస్తే అత్యంత తక్కువగా ఉండటం గమనార్హం.
తమిళనాడు టాప్..
కేంద్ర పర్యాటక శాఖ దేశంలో ఏ రాష్ట్రాలకు ఎంతమంది పర్యాటకులు వస్తారో వెల్లడించింది. 2018లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కలిపి 2.88 కోట్ల మంది విదేశీయులు వచ్చారని కేంద్రం తన నివేదికలో తెలిపింది. అందులో వైద్యం చేయించుకునేందుకు 17.32 లక్షల మంది వచ్చినట్లు అంచనా వేసింది. అంటే విదేశీ పర్యాటకుల్లో 6 శాతం వరకు వైద్యం కోసం మన దేశానికి వచ్చినట్లు కేంద్రం తెలిపింది. అందులో తమిళనాడుకు అత్యధికంగా 60.74 లక్షల మంది పర్యాటకులు రాగా, వైద్యం కోసం వచ్చిన వారు 3.6 లక్షల మంది ఉంటారని అంచనా. విచిత్రమేంటంటే ఎంతో వెనుకబడి ఉండే బిహార్‌కు 2018లో 10.87 లక్షల మంది పర్యాటకులు వస్తే, వైద్యం కోసం వచ్చిన వారు 65 వేల మంది వరకు ఉంటారని అంచనా.
ఇతర రాష్ట్రాలన్నీ కూడా మెడికల్ టూరిజంపై దృష్టి సారించాయి. అయితే కొన్ని రాష్ట్రాలకు సాధారణ పర్యాటకులు వస్తుంటారు. మెడికల్ హబ్‌గా వెలుగొందుతున్న ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబైలకు పర్యాటకులు వైద్యం కోసం కూడా అధికంగా వస్తుంటారు. మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు కేంద్రం సర్వీసు ప్రొవైడర్లకు ఆర్థిక సాయం అందిస్తుంది. మెడికల్ టూరిజం ఫెయిర్స్, మెడికల్ కాన్ఫరెన్స్, వెల్‌నెస్ కాన్ఫరెన్స్, వెల్‌నెస్ ఫెయిర్స్, మెడికల్ రోడ్ షోలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇస్తుంది. కానీ వీటిని ఉపయోగించుకోవడంలో తెలంగాణ వెనుకబడిందని నివేదిక సారాంశం. మన రాష్ట్రానికి ప్రధానంగా మోకాళ్ల చికిత్స, జాయింట్ రీప్లేస్‌మెంట్, యాంజియోప్లాస్టీ, యూరాలజీ, కేన్సర్ వ్యాధుల నివారణ కోసం వస్తుంటారు. టాంజానియా, సోమాలియా, ఇథియోపియా, నైజీరియా, ఒమన్, ఇరాక్, దుబాయ్ వంటి దేశాల నుంచి రోగులు వస్తుంటారు.
ప్రచారంలో వెనుకంజ..
హైదరాబాద్ కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు అనేకం మార్కెటింగ్ చేసుకోవడంలో వైఫల్యం చెందుతున్నాయన్న విమర్శలున్నాయి. మార్కెటింగ్‌పై కంటే ఆర్‌ఎంపీలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని కొందరు వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికైనా డిజిటల్ మార్కెటింగ్‌పై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు మంచి పేరు తెచ్చుకోవడంకంటే లాభాలపైనే దృష్టిసారిస్తున్నాయన్న ఆరోపణలూ ఉన్నాయి. దేశంలో అత్యధికంగా మన రాష్ట్రంలో వైద్య ఖర్చులు, ఫీజులు అధికంగా ఉన్నాయన్న భావన విదేశీయుల్లో ఉందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment