సాక్షి, హైదరాబాద్: కరోనా నివారణకు చికిత్స అందించే ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు రోగుల నుంచి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. చార్జీలు ఎంత వసూలు చేయాలో ప్రభుత్వం జీవో జారీ చేసినా వాటిని కార్పొరేట్ ఆస్పత్రులు ఖాతరు చేయకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. అలాంటి ఆస్పత్రులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు యశోద సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి (సోమాజిగూడ) కేర్ ఆస్పత్రి (బంజారాహిల్స్), సన్‌షైన్ ఆస్పత్రి (సికింద్రాబాద్), మెడికవర్ ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది.
విపత్తుల నిర్వహణ చట్టాన్ని అమలు చేసి అధిక చార్జీలను వసూలు చేస్తున్న ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ న్యాయవాది శ్రీకిషన్ శర్మ ప్రజా హిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. రాష్ట్రంలో కరోనా చికిత్సకు సంబంధించిన ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ప్రైవేటు ఆస్పత్రులు అపహాస్యం చేస్తున్నాయని ఆక్షేపించింది. ప్రభుత్వ ఉత్తర్వులను ఖాతరు చేయని ఆసుపత్రులపై కొరడా ఝుళిపించాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇదే పని చేస్తుందని తాము ఆశిస్తున్నామని పేర్కొంది. ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజులకు మించి వసూలు చేస్తున్న ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఒకవేళ చర్యలు తీసుకోని పక్షంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో వివరించాలని సూచించింది.
చికిత్స, బిల్లింగ్‌లో పారదర్శకత లేదు..
అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రతాప్ నారాయణ్ సంఘీ వాదనలు వినిపిస్తూ.. కరోనా చికిత్సకు ఆస్పత్రులు ఎంత ఫీజు వసూలు చేయాలో ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసినా అమలు కావడంలేదని నివేదించారు. ప్రైౖవేటు ఆస్పత్రులు ఆ ఉత్తర్వులు బేఖాతరు చేస్తున్నాయని, భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రుల కరోనా చికిత్స, బిల్లింగ్ విషయంలో పారదర్శకతే లేదన్నారు. కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకుని దోపిడీకి పాల్పడే కార్పొరేట్ ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధన ప్రకారం వైద్య వృత్తిలో నైతిక విలువలు నిలబెట్టేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. మీడియా కథనాలను చూస్తుంటే ప్రైవేటు ఆస్పత్రులు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్న విషయం అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. రూ.1.5 లక్షల ఫీజు చెల్లించలేదంటూ ఛాదర్‌ఘట్‌లోని తుంబే ఆసుపత్రి ఓ ప్రభుత్వ వైద్యాధికారిణి సుల్తానాను నిర్భంధించినట్లు పత్రికల్లో వచ్చిందని తెలిపింది. ఇలా చేయడమంటే ప్రభుత్వ ఉత్తర్వులను అపహాస్యం చేయడమేనని ధర్మాసనం స్పష్టంచేసింది. ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలియజేయాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 14కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment