దేశంలోని ఎయిమ్స్ సహా పలు జాతీయ వైద్య కళాశాలల్లో వైద్యుల పదవీ విరమణ వయసు 67 నుంచి 70 ఏళ్లు.. ఉస్మానియా, గాంధీ సహా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్యుల పదవీ విరమణ వయసు 60 నుంచి 65 ఏళ్లు.. కానీ.. ఎయిమ్స్‌కు అనుబంధంగా కొనసాగుతున్న నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్యుల పదవీ విరమణ వయసు మాత్రం 60 ఏళ్లే.. దీంతో ఈ ఆస్పత్రిలో మంచి హస్తవాసి, పేరున్న వైద్య నిపుణుల సేవలు రోగులకు అందడంలేదు. వీరి పదవీ విరమణ వయసు పెంపుపై నిర్ణయం తీసుకోకపోవడంతో కీలకమైన కిడ్నీ, గుండె, కాలేయ మార్పిడి చికిత్సలు ప్రశ్నార్థకమవుతున్నాయి. ఈ వైద్యసంస్థలో వచ్చే జూలై చివరి నాటికి 12 మంది, 2022 నాటికి మరో 30 మంది సీనియర్ వైద్యులు రిటైర్డ్ కానున్నారు.
సాక్షి, హైదరాబాద్: నిమ్స్‌లో వైద్యుల పోస్టులు ఒక్కొక్కటే ఖాళీ అవుతున్నాయి. నెలకు సగటున ఇద్దరు వైద్యులు పదవీ విరమణ చేస్తున్నారు. అంతర్గత కుమ్ములాటలకు తోడు కార్పొరేట్ ఆస్పత్రులతో పోలిస్తే ఇక్కడ వేతనాలు తక్కువగా ఉండటంతో మరికొందరు వైద్యులు బయటి వేతనాలకు ఆశపడి ఆస్పత్రిని వీడుతున్నారు. ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి ఆస్పత్రి యాజమాన్యం నోటిఫికేషన్లు ఇస్తున్నా.. ఇక్కడ పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావట్లేదు. వచ్చిన వారు కూడా రెండు మూడేళ్లకే వెళ్లిపోతున్నారు. ఉన్నతాధికారులు కూడా వీరిని ఆపే యత్నం చేయడంలేదు. ఫలితంగా 311 పోస్టులకు 133 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్, అడిషనల్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భారీగా ఖాళీ ఉండటంతో సూపర్ స్పెషాలిటీ వైద్యవిద్యపైనే కాదు.. రోగుల చికిత్సపైనా ప్రభావం చూపుతోంది. సీనియర్ వైద్యులు లేకపోవడంతో ఆ భార మంతా రెసిడెంట్లపై పడుతుంది. చికిత్సల్లో వారికి సరైన అనుభవం లేక, కీలక సమయంలో చేతులెత్తేస్తున్నారు. పదవీ విరమణ చేసిన కొందరు సీనియర్ వైద్యులు ఆ తర్వాత కూడా ఇక్కడ పనిచేసేందుకు సుముఖంగా ఉన్నా.. యాజమాన్యం విముఖత చూపుతోంది.
జూనియర్లే పెద్దదిక్కు
అంతర్గత విబేధాలకు తోడు కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి వచ్చిన ఆఫర్లతో ఇప్పటికే చాలామంది వైద్యులు నిమ్స్‌ను వీడిపోయారు. 60 ఏళ్లకే పదవీ విరమణ చేయాల్సి రావడంతో కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ శేషగిరిరావు, మాజీ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్, డయాబెటిక్ నిపుణుడు వెంకటేశ్వరరావు, డాక్టర్ నరేందర్, డాక్టర్ సుభాష్‌కౌల్, డాక్టర్ జీఎస్‌ఎన్‌రాజు సహా పలువురు ఆస్పత్రికి దూరమయ్యారు. న్యూరో ఫిజీషియన్ విభాగాధి పతి డాక్టర్ వీణాకుమారి ఇటీవల గుండెపోటుతో మృతిచెందారు. జూలై చివరికి యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ రాంరెడ్డి సహా సీటీ సర్జన్ ఆర్వీకుమార్, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ బీరప్ప, డాక్టర్ జోత్స్న, డాక్టర్ ఉషారాణి, డాక్టర్‌నాగేశ్వరరావు తదితరులు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయా విభాగాలకు ఇక జూనియర్ వైద్యులే పెద్దదిక్కు కానున్నారు. ఇప్పటికే సీనియర్లు లేక రుమటాలజీ, హెమటాలజీ, ఎండోక్రైనాలజీ, ప్లాస్టిక్ సర్జరీ సహా పలు విభాగాల్లో చికిత్సలు గగనమయ్యాయి. ఆయా విభాగాలపై ఆధారపడిన రోగులతోపాటు సూపర్ స్పెషాలిటీ కోర్సులు చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది.
రెసిడెంట్లపైనే భారమంతా..
పోస్టు గ్రాడ్యుయేషన్ మెడికల్ ట్రైనింగ్ సెంటర్లలో నిమ్స్ దేశంలోనే ప్రతిష్టాత్మకమైంది. 1986లో దీని పడకల సామర్థ్యం 500 కాగా, ప్రస్తుతం 1,500కి చేరింది. ప్రస్తుతం ఇక్కడ వివిధ విభాగాల్లో 423 మంది రెసిడెంట్ డాక్టర్లు చదువుతున్నారు. రోగుల తాకిడి పెరగడం, వారి నిష్పత్తికి తగిన వైద్యులు లేకపోవడంతో రెసిడెంట్లపై భారం పడుతోంది. రోజుకు 12 నుంచి 14 గంటల పాటు పనిచేయా ల్సి వస్తుంది. ‘నిమ్స్‌లో రోగులకు ఇంకా సేవచేసే ఓపిక ఉంది! మరికొంత కాలం పనిచేసే అవకాశమివ్వండి’ అని పలువురు నిపుణులు నిమ్స్ పాలకమండలికి మొరపెట్టుకుంటున్నా ఫలితం లేకపోతోంది. దీనిపై నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్ మాట్లాడుతూ.. ‘ఒకటి రెండు రోజుల్లో పాలక మండలి సమావేశం ఉంది. వైద్యుల పదవీ విరమణ వయసు పెంపుపై ఇందులో చర్చించి నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు.
పేరు గొప్ప.. అన్నింటా తీసికట్టు
- నిమ్స్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారంతో పనిచేస్తున్న స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ముఖ్యమంత్రే దీనికి ఛాన్సలర్‌గా ఉంటారు.
- ఎయిమ్స్ నిబంధనల ప్రకారం ఇక్కడ నియామకాలు, పదోన్నతులు ఉంటా యి. ఉస్మానియా, గాంధీలో త్రిటైర్ విధానం అమల్లో ఉండగా, నిమ్స్‌లో ఫోర్‌టైర్ విధానం అమల్లో ఉంది.
- ఉస్మానియాలో అసిస్టెంట్ కేడర్‌లో చేరిన ఓ వైద్యుడు ఆ తర్వాత అసోసియేట్ ప్రొఫె సర్, చివరకు ప్రొఫెసర్ కేడర్‌కు చేరుకుంటారు. ఇందుకు తొమ్మిదేళ్లు పడుతుంది.
- నిమ్స్‌లో అసిస్టెంట్ కేడర్‌లోని వైద్యు డు అసోసియేట్, అడిషనల్ ప్రొఫె సర్ కేడర్లను దాటుకుని ప్రొఫెసర్ కేడర్‌కు చేరుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ప్రొఫెసర్ కేడర్ రావడానికి 12 నుంచి 14 ఏళ్లు పడుతోంది.
- ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు చేసుకునే అవకాశముంది. ఆరోగ్యశ్రీ ఇంటెన్సివ్స్ కూడా వీరికి అందుతాయి. కానీ నిమ్స్ వైద్యుల బయటి ప్రాక్టీస్ నిషేధం. ఆరోగ్య శ్రీ ఇంటెన్సివ్స్ కూడా వీరికి అందవు. కార్పొరేట్ ఆస్పత్రుల వైద్యులతో పోలిస్తే వీరి వేతనాలు చాలా తక్కువ.
Comments
Please login to add a commentAdd a comment