గురువారం సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రిలో చేతికి బేడీలతో హీర్యానాయక్
జైలులో ఛాతీనొప్పితో అస్వస్థతకు గురైన హీర్యానాయక్.. చేతులకు బేడీలు వేసి, గొలుసుతో కట్టి సంగారెడ్డి ఆస్పత్రికి తరలించిన పోలీసులు
మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలింపు.. ఆరోగ్యం బాగోలేని రైతుకు సంకెళ్లు వేయడం ఏమిటనే విమర్శలు
ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్..
జైలర్ సంజీవరెడ్డి సస్పెన్షన్.. సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్‌పై విచారణకు ఆదేశం
సంగారెడ్డి/ సంగారెడ్డిటౌన్/దుద్యాల్/సాక్షి, హైదరాబాద్: ‘లగచర్ల’కేసులో అరెస్టయి జైలులో ఉన్న రైతు ఛాతీలో నొప్పితో అస్వస్థతకు గురైతే.. చేతులకు సంకెళ్లు వేసి, గొలుసుతో కట్టి ఆస్పత్రికి తరలించిన ఘటన కలకలం రేపింది. ఆరోగ్యం బాగోలేని రైతుకు బేడీలు వేయడం ఏమిటన్న ఆగ్రహం వ్యక్తమైంది. సంగారెడ్డి జైలులో అస్వస్థతకు గురైన రైతు హీర్యానాయక్‌ను జైలు అధికారులు, పోలీసులు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు రైతుకు బేడీల ఘటనపై సీఎం రేవంత్ సీరియస్‌గా స్పందించి, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
బుధవారమే అస్వస్థతకు గురైన రైతు
వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలంలో ఫార్మా విలేజీ వద్దని, తమ భూములు ఇవ్వబోమని గిరిజన రైతులు ఆందోళనకు దిగడం.. ‘లగచర్ల’గ్రామంలో కలెక్టర్ ఇతర అధికారులపై దాడి చేయడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో అరెస్టయిన 45 మంది రైతులు సుమారు నెల రోజులుగా సంగారెడ్డి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
వారిలో దుద్యాల్ మండలం పులిచర్లకుంట తండాకు చెందిన గిరిజన రైతు హీర్యా నాయక్ బుధవారం సాయంత్రం ఛాతీలో నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. ప్రాథమిక పరీక్షలు చేసిన జైలు వైద్యులు, అధికారులు.. చికిత్స కోసం గురువారం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే రైతును పోలీసు జీపులో.. చేతులకు బేడీలు వేసి, గొలుసుతో కట్టి తీసుకువచ్చారు. అలాగే బేడీలు, గొలుసుతో ఆస్పత్రి లోపలికి నడిపించుకుని తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం చెలరేగింది.
మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రికి...
సంగారెడ్డి ఆస్పత్రి వైద్యులు హీర్యానాయక్‌కు పలు వైద్య పరీక్షలు చేశారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. హీర్యానాయక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని రిఫర్ చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అనిల్‌కుమార్ తెలిపారు. అక్కడి అనుభవజు్ఞలైన వైద్యుల పర్యవేక్షణలో మెరుగైన వైద్యం అందుతుందన్నారు.
ఈ మేరకు జైలు అధికారులు, పోలీసులు హీర్యానాయక్‌ను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిమ్స్ ఎమర్జెన్సీ యూనిట్‌లో కార్డియాలజీ వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నట్టు నిమ్స్ అధికారులు తెలిపారు. హీర్యానాయక్ వెంట ఆయన భార్య దేవిబాయి, ఇతర కుటుంబ సభ్యులు ఉన్నారని వెల్లడించారు.
ఛాతీలో నొప్పి వస్తోందని రోదిస్తూ..
జైలులో ఉన్న హీర్యానాయక్ బుధవారం రాత్రి తండ్రి రూప్లానాయక్, తల్లి జెమినీబాయి, భార్య దేవిబాయిలతో ఫోన్‌లో మాట్లాడారు. ఆ సమయంలో తనకు ఆరోగ్యం బాగోలేదని, ఛాతీలో నొప్పి వస్తోందని చెప్పాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. తనను ఎలాగైనా తీసుకెళ్లాలని, అక్కడే ఉంటే చనిపోయేలా ఉన్నానని రోదించాడని తెలిపారు. దీనితో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు గురువారం ఉదయం సంగారెడ్డికి బయలుదేరారు.
అప్పటికే ఆయనను ఆస్పత్రికి తరలించారని తెలిసి, అక్కడికి వెళ్లారు. అయితే హీర్యానాయక్‌ను చూసేందుకు పోలీసులు చాలాసేపు అనుమతించలేదని కుటుంబ సభ్యులు మండిపడ్డారు. ఆయనను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. గుండె పోటుకు గురైన వ్యక్తికి ఇలా బేడీలు వేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు.
నా కొడుక్కి ఏం జరిగినా సీఎం బాధ్యత వహించాలి..
నా కొడుకును అనవసరంగా కేసులు పెట్టి జైలులో పెట్టారు. నా కొడుక్కి ఏమైనా జరిగితే సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలి. హీర్యాను వెంటనే విడుదల చేయాలి. ఆరోగ్యం బాగోలేనివారికి బేడీలు వేయడం ఏమిటి?
– రూప్లానాయక్, హీర్యానాయక్ తండ్రి
రైతుకు బేడీలపై సీఎం సీరియస్
– ఇలాంటి చర్యలను సహించబోమని అధికారులకు హెచ్చరిక
– ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశం
‘లగచర్ల’ఘటనలో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న రైతు హీర్యానాయక్‌ను చికిత్స కోసం సంగారెడ్డి ఆస్పత్రికి బేడీలు వేసి తీసుకెళ్లిన ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. దీనిపై అధికారులతో మాట్లాడి వివరాలను ఆరాతీశారు. రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి చర్యలను సహించబోదని పేర్కొన్నారు.
జైలుకు వెళ్లి సమీక్షించిన ఐజీ
జైలులో రైతుకు గుండెపోటు, బేడీలు వేసి ఆస్పత్రికి తరలించిన అంశం వివాదాస్పదం కావడంతో మలీ్టజోన్ ఐజీ సత్యానారాయణ గురువారం సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వెళ్లి సమీక్షించారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలన్న సీఎం ఆదేశాల మేరకు పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
జైలర్ సస్పెన్షన్.. సూపరింటెండెంట్‌పై విచారణ
లగచర్ల రైతుకు బేడీలు వేసిన ఘటనలో సంగారెడ్డి సెంట్రల్ జైలు జైలర్ సంజీవరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా గురువారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. అలాగే, జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్‌పై విచారణకు ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment