* రోజురోజుకూ జటిలమవుతున్న ఉద్యోగులు, పెన్షనర్ల నగదు రహిత వైద్యం
* ఇరు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ ఇబ్బందులు
* అవస్థలు పడుతున్న 60 లక్షల మంది లబ్ధిదారులు
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగులకు నగదు రహిత వైద్యాన్ని అందించేందుకు ప్రైవేటు లేదా కార్పొరేట్ ఆస్పత్రులు నిరాకరిస్తే వారితో ఇకపై చర్చలు జరిపేది లేదని, నోటీసులు జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఉద్యోగుల నగదు రహిత వైద్యం మరింత జటిలంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఏపీలో ప్యాకేజీలు సరిపోవడం లేదని, తెలంగాణలో ఓపీ సేవలు ఉచితంగా చేయలేమని కార్పొరేట్ ఆస్పత్రులు తెగేసి చెప్పాయి. రెండు ప్రభుత్వాలు విధిలేని పరిస్థితుల్లో తాజాగా రీయింబర్స్‌మెంట్‌నే కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. దీనివల్ల ముఖ్యంగా పెన్షనర్లు లక్షలాది రూపాయలు ముందు చెల్లించాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో రెండు రాష్ట్రాల్లో ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబీకులు కలిసి దాదాపు 60 లక్షల మంది వైద్యం విషయంలో నలిగిపోతున్నారు.
ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ నుంచి తొలగిస్తాం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు హెచ్చరికలు జారీచేసింది.నిర్ణయించిన ప్యాకేజీలకు ఉద్యోగులకు నగదు రహిత వైద్యానికి ఒప్పుకోకపోతే వాటిని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ నుంచి కూడా తొలగిస్తామని హెచ్చరించింది. ఎన్‌ఏబీహెచ్(నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఆఫ్ హాస్పిటల్స్) హోదా ఉన్న ఆస్పత్రులకు ప్రస్తుతం ఉన్న ప్యాకేజీలకంటే 25 శాతం ఎక్కువగా ఇస్తున్నామని, ఆ హోదా లేని ఆస్పత్రులకు పేర్కొన్న ప్యాకేజీల రేట్లే ఇస్తామని, అంతకంటే ఒక్క పైసా ఎక్కువ ఇచ్చేది లేదని ఒప్పుకోకుంటే నెట్‌వర్క్‌నుంచి తొలగిస్తామని తెలిపింది.
ఆరోగ్యశ్రీ వదులుకోవడానికీ సిద్ధమే
ఆరోగ్యశ్రీ కంటే ఉద్యోగుల నగదురహిత వైద్య ప్యాకేజీలు ఘోరంగా ఉన్నాయి.ప్యాకేజీ కంటే మాకే ఎక్కువ ఖర్చవుతుంటే ఆస్పత్రులు ఎలా మనగలుగుతాయి? ఎంవోయూ కుదిరే వరకు ఉద్యోగులకు వైద్యం అందించలేం. ఒకవేళ ఆరోగ్యశ్రీని వదులుకోవాలని ఆదేశిస్తే సిద్ధమే.
- డాక్టర్ రమణమూర్తి, ఆంధ్రప్రదేశ్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం అధ్యక్షుడు
చిన్న సమస్య పెద్దది చేస్తున్నారు
ఇది చాలా చిన్న సమస్య. చిన్న చర్చ ద్వారా పరిష్కారం అయ్యేదాన్ని ఎందుకో పెద్దది చేస్తున్నారు. రెండ్రోజుల్లో తెలంగాణ సీఎంను కలవబోతున్నాం. ఏపీ ప్రభుత్వంలా ఉద్యోగుల వైద్యానికి ఒప్పుకోకపోతే ఆరోగ్యశ్రీ నుంచి తప్పిస్తాం అంటే... దానికీ సిద్ధంగా ఉన్నాం.
- డా. ఏవీ గురవారెడ్డి, తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం అధ్యక్షుడు
చర్చలుండవు.. ఇక నోటీసులే!
Published Thu, Dec 18 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 PM
Advertisement
Advertisement