కార్పొరేట్‌ ‘వివక్ష’! | Third Class Treatment For Aarogyasri Patients In Corporate Hospitals | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ ‘వివక్ష’!

Published Sat, May 12 2018 10:33 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Third Class Treatment For Aarogyasri Patients In Corporate Hospitals - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: ఆరోగ్యశ్రీ ఓ మంచి పథకం. పేదలకు వరం. కానీ కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు దీన్ని ఓ అంటు వ్యాధిలా చూస్తున్నాయి. ఆరోగ్యశ్రీ కార్డు చేతిలో పట్టుకుని ఆస్పత్రికి వచ్చిన రోగులను ఎలా భయపెట్టాలి? వారిని ఏవిధంగా బయటికి పంపాలన్నదానిపై ముందే అక్కడి సిబ్బందికి శిక్షణ ఇస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం 2008లో ప్రారంభమైంది. ప్రారంభంలో 46 ఆస్పత్రుల్లో ఈ సేవలు అందేవి. 2018 నాటికి 341 ఆస్పత్రులకు విస్తరించాయి. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 85 లక్షల కుటుంబాల్లోని 2.75 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఏటా రూ.700 కోట్లు ఖర్చు చేస్తుంది. ఏటా 2.5 లక్షల చికిత్సలు జరుగుతున్నాయి. మొదట్లో ఆరోగ్యశ్రీ సేవలు అందించేందుకు పోటీపడిన కార్పొరేట్‌ ఆస్పత్రులు.. ఆ తర్వాత ఈ సేవలను భారంగా భావించాయి. ఆరోగ్యశ్రీ రోగి అంటేనే చులకనగా చూడటం మొదలు పెట్టాయి. నగదు చెల్లింపు రోగులను ఒక భవనంలో, ఆరోగ్యశ్రీ రోగులను మరో భవనంలో ఉంచుతున్నాయి. అంతే కాదు వీరికి చికిత్స చేస్తే ఎక్కడ తమ ఇమేజ్‌ దెబ్బతింటుందోని భావించి సీనియర్లు చికిత్సలకు నిరాకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తమవద్ద పనిచేస్తున్న జూనియర్లతో సర్జరీలు చేయిస్తున్నారు. కనీసం గాలి వెలుతురు కూడా లేని చోట వీరిని అడ్మిట్‌ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ రోగులను అంటు రోగులుగా చూస్తూ...వారికేదో ఉచితంగా వైద్యం చేస్తున్నట్లు బిల్డప్‌ ఇస్తున్నాయి.   

చీదరింపులు..చీత్కారాలు
నగదు చెల్లించే రోగులతో సమాన వైద్యసేవలు ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అందిస్తామని హామీ ఇస్తూ ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌ సహా నగరంలో మరో 135 కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రులు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌తో అవగాహన ఒప్పం దం కుదుర్చుకున్నాయి. ఆ మేరకు ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా పొందాయి. తీరా నెట్‌వర్క్‌లో పేరు రిజిస్టర్‌ అయిన తర్వాత అనేక ఆస్పత్రులు ఈ నిబంధనలను తుంగలో తొక్కాయి. నగదు చెల్లించే రోగుల సరసన కాకుండా పార్కింగ్‌ ప్లేసుల్లో, ఓ మూలన ఇరుకైన రేకుల షెడ్డులో ఆరోగ్యశ్రీ వార్డులు ఏర్పాటు చేశాయి. ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందాయి. అయినా ఈ అంశాన్ని పట్టించుకోలేదు. అంతేకాదు వీరి పట్ల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు కూడా చాలా అవమానకరంగా ఉంది. నగదు చెల్లించే రోగులను ఆప్యాయ పలకరిస్తూ వెంటతోడుకెళ్తూ, ఆరోగ్యశ్రీ రోగులను మాత్రం కనీసం పట్టించుకోవడం లేదు. ఆరోగ్యశ్రీ రిజి స్ట్రేషన్‌ కౌంటర్‌కు ఓపీ, ఐపీ విభాగాలకు చాలా దూరం ఉంటోంది. అసలే అనారోగ్యం ఆపై అటు ఇటు తిరగలేక రోగులు అవస్థలు పడుతున్నారు. ఓపీ సేవల్లోనే కాదు చికిత్సల్లోనూ, మందుల పంపిణీలోనూ ఇదే వివక్ష కొనసాగుతోంది. 

సమస్యలు ఇవే...
ఎమర్జెన్సీలో ఆస్పత్రిలో చేరిన రోగికి ఆ సమయంలో ఆరోగ్యశ్రీ కార్డు లేకపోతే 72 గంటల సమయం ఇవ్వాల్సి ఉంది. కానీ అలా ఇవ్వడం లేదు. అత్యవసర సమయంలోనూ డబ్బు చెల్లిస్తేనే వైద్యం చేస్తున్నాయి. ముఖ్యంగా సెలవు రోజుల్లో జాయినైన రోగి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. సీఎంఆర్‌ఎఫ్‌ లబ్ధిదారులదీ అదే పరిస్థితి.
రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రుల చికిత్సల విషయంలో అనేక మెలికలు పెడుతున్నారు. ప్రమాదంలో రెండు మూడు చోట్ల బోన్‌ఫ్రాక్చర్‌ ఉంటే ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయడం లేదు. ఎన్ని కట్లు కడితే అన్ని వేర్వేరు ప్యాకేజీల కింద డబ్బులు వసూలు చేస్తున్నారు. అదేమంటే ఆరోగ్యశ్రీలో ఎన్నిఫ్రాక్చర్లు ఉన్నా ఒకే ప్యాకేజీ కింద బిల్లు చెల్లిస్తుందని, ఇది తమకు ఏమాత్రం గిట్టుబాటు కాదని ఆస్పత్రి యాజమాన్యాలు  స్పష్టం చేస్తున్నాయి.  
బైపాస్‌ సర్జరీల్లో భాగంగా హృద్రోగులకు స్టంట్లు అమర్చుతారు. మార్కెట్లో 32 రకాల స్వదేశీ, విదేశీ కంపెనీల స్టంట్లు ఉన్నాయి. ఒక స్టంటు తయారీకి రూ.3 వేల నుంచి రూ.13 వేలు ఖర్చు అవుతుంది. ప్రభుత్వం ఇటీవల వీటి ధరలను భారీగా తగ్గించింది. ఆరోగ్యశ్రీ పథకంలో నాసిరకం స్టంట్లు వేస్తున్నారని, కొంత ఖర్చు భరిస్తే మంచి స్టంట్‌ వేస్తామని చెబుతున్నారు. తొలత స్టంట్‌ వేస్తున్నారు. మూడు నెలల తర్వాత అదే రోగికి బైపాస్‌ సర్జరీ చేస్తున్నారు. ఒక రోగిపై రెండుసార్లు సంపాదిస్తున్నారు.

అటు ఇటు తిరగలేకఇబ్బందిపడ్డా...
కిడ్నీలో రాయి ఉండటంతో వైద్యుడికి చూపిద్దామని మలక్‌పేటలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లాను. ఓపీకి దూరంగా ఉన్న మరో భవనం పార్కింగ్‌ ప్లేసులో ఆరోగ్యశ్రీ కౌంటర్‌ ఏర్పాటు చేశారు. అసలే నొప్పి, ఆపై అటు ఇటూ తిరుగలేక ఇబ్బంది పడాల్సి వచ్చింది.  – నవీన్, జనగాం

ఈసడించుకుంటున్నారు  
ఆరోగ్యం బాగాలేక పోవడంతో వైద్యుడికి చూపించుకుందామని ఎల్బీనగర్‌లోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి వెళ్లాను. ఆరోగ్యశ్రీ కార్డు తీసుకుని వెళ్తే..ఇక్కడ ఆ సేవలు లేవని చెప్పారు. నన్ను చూసి ఈసడించుకున్నారు. ఆరోగ్యశ్రీ రోగులను చాలా చులకనగా చూస్తున్నారు.  – భవానీ, ఎల్బీనగర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement