విద్యుత్ వాత తప్పదు!
చార్జీల పెంపుపై ఏపీ సర్కారు సంకేతాలు
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులపై కొత్త చార్జీల భారం తప్పేలా లేదు. డిస్కమ్‌ల ఆర్థిక లోటును పూడ్చేందుకు సిద్ధంగా లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రిమండలి సమావేశం విద్యుత్ చార్జీల పెంపుపై తర్జనభర్జన పడింది. చార్జీలు పెంచకుండా లోటును పూడ్చడం సాధ్యం కాదని సమావేశం అభిప్రాయపడింది. వార్షిక ఆదాయ, వ్యయ నివేదిక (ఏఆర్ఆర్)కు ఆమోదం తెలపాల్సి ఉండగా, దీనిపై ప్రస్తుతానికి ఎటూ తేల్చకుండా పెండింగ్‌లో పెట్టినట్టు తెలిసింది. ఈ నెల 9వ తేదీలోగా ఏఆర్ఆర్ సమర్పించాలని ఏపీఈఆర్సీ గడువు విధించింది.
అందుకు అనుగుణంగా పంపిణీ సంస్థలు ఏఆర్ఆర్లను సిద్ధం చేశాయి. విద్యుత్ కొనుగోలు వ్యయం పెరగడం, సరఫరా నష్టాలు, వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా వల్ల ఆర్థిక భారం పెరిగినట్టు పంపిణీ సంస్థలు పేర్కొన్నాయి. దాదాపు రూ.6 వేల కోట్ల ఆర్థిక లోటు ఉన్నట్టు తేల్చాయి. దీనిపై ఇంధన శాఖ సమగ్రమైన నివేదిక రూపొందించి మంత్రిమండలికి సమర్పించింది. పంపిణీ సంస్థలకు రూ.6 వేల కోట్లు సబ్సిడీగా ఇవ్వాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. లోటు పూడ్చని పక్షంలో చార్జీల పెంపునకు అవకాశం ఇవ్వాలని డిస్కమ్‌లు కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇంధన శాఖ ప్రతిపాదన మేరకు రూ.6 వేల కోట్లు సబ్సిడీగా ఇవ్వడంపై మంత్రిమండలి చర్చించినట్లు తెలిసింది. ఏఆర్ఆర్ సమర్పణకు ఈఆర్సీని మరింత గడువు కోరాలని పలువురు మంత్రులు సూచించినట్టు తెలిసింది.
అయితే దీనిపై పూర్తి స్థాయి చర్చ జరగలేదని మంత్రులు పేర్కొన్నారు. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, డిస్కమ్‌లు ప్రతిపాదించిన విధంగా రూ.6 వేల కోట్లు ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తే చార్జీల పెంపు ఉండదని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చార్జీలు పెంచక తప్పనిసరి పరిస్థితులు ఉన్నాయని ఒక మంత్రి చెప్పారు. దీంతో లోటును పూడ్చడానికి ప్రభుత్వం ఏమాత్రం సుముఖంగా లేదని స్పష్టమవుతోంది. డిస్కమ్‌ల తాజా ప్రతిపాదనల మేరకు 50 నుంచి 100 యూనిట్లు వాడే వినియోగదారుడిపైనా భారం పడే అవకాశాలున్నాయని ఆ మంత్రి తెలిపారు. కేబినెట్ భేటీలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి సమావేశ మందిరం నుంచి బయటకు వెళ్లారని, అందువల్ల నిర్ణయం తీసుకోలేకపోయామని మంత్రులు చెబుతున్నారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చార్జీల పెంపు ప్రతిపాదన వద్దని అచ్చెన్నాయుడుతో పాటు కొందరు మంత్రులు సూచించారు. దాంతో విద్యుత్ చార్జీల పెంపుదలను తాత్కాలికంగా వాయిదా వేయాలని, సంక్రాంతి పండుగకు ముందు చార్జీల పెంపుదలపై నిర్ణయం తీసుకోవటం కంటే ఆ తరువాత చర్చించటం మంచిదని నిర్ణయించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఒకవైపు గిఫ్ట్ ప్యాక్ ఇవ్వాలని నిర్ణయించి, మరోవైపు విద్యుత్ చార్జీలు పెంచితే తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందన్న అభిప్రాయం వ్యక్తం కావడంతో నిర్ణయం వాయిదా వేసుకున్నారని తెలిసింది. ఈ అంశం చర్చ కొచ్చే సమయంలో సీఎం బైటకు వెళ్లారని సమావేశం అనంతరం మంత్రి అచ్చన్నాయుడు కూడా మీడియాకు చెప్పారు.
గడువులోగా ఏఆర్ఆర్ డౌటే!
సుదీర్ఘంగా సాగిన మంత్రిమండలి సమావేశం ఏఆర్‌ఆర్‌ను ఆమోదించకపోవడంతో గడువులోగా దాన్ని సమర్పించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి మంత్రివర్గ సమావేశం ఎజెండాలో తొలి అంశంగా విద్యుత్ చార్జీల పెంపు, ఏఆర్ఆర్ ఆమోదిదం ఉన్నప్పటికీ.. సీఎం సూచన మేరకు చివరి అంశాలుగా మార్చినట్టు తెలిసింది.