సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. సెకండ్ వేవ్‌లో వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కూడా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. కోవిడ్ బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రోగుల ప్రాణాలు నిలబెట్టే ఈ ప్రాణవాయువును కొందరు అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారు. రాష్ట్రానికి సరఫరా అయ్యే ఆక్సిజన్‌ను పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు వాడకూడదని.. కేవలం కరోనా ఆసుపత్రులకు మాత్రమే వినియోగించాలని ఔషధ నియంత్రణ శాఖ ఆదేశాలు జారీ చేసినా ఏ కంపెనీ కూడా ఖాతర్ చేయడంలేదు.
దీంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరిగా అందక రోగులు హాహాకారాలు చేస్తున్నారు. అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. ఆక్సిజన్, ఐసీయూ పడకలపై ఉన్న రోగులకు పూర్తిస్థాయిలో కాకుండా కొంచెం కొంచెం మాత్రమే ఆక్సిజన్ అందిస్తూ నెట్టుకొస్తున్నారు. వీఐపీ రోగులైతే పైరవీలు చేయించుకొని పూర్తిస్థాయిలో ప్రాణవాయువు పొందుతుండగా.. సాధారణ రోగులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని ఆస్పత్రులు అయితే వారికి కొద్దిసేపు ఇచ్చి.. కొద్దిసేపు ఆపేస్తున్నాయి. రోగి పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా ఉంటే తప్ప ఆక్సిజన్ వాడటంలేదు.
మూడింతలు పెరిగిన డిమాండ్..
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కరోనా ఆసుపత్రుల అవసరాలకు దాదాపు 165 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని అంచనా. అయితే, గత 2,3 రోజులుగా డిమాండ్ మూడింతలు పెరిగినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. 165 మెట్రిక్ టన్నుల్లో 40 శాతం ప్రభుత్వ ఆస్పత్రులకు, మిగిలింది ప్రైవేటు ఆస్పత్రులకు కావాలి. ప్రస్తుతం ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎక్కడా ఆక్సిజన్ కొరత లేదు. ఎందుకంటే.. ప్రభుత్వ ఆస్పత్రులకు ట్యాంకర్ల ద్వారా వచ్చిన లిక్విడ్ ఆక్సిజన్‌ను నిల్వ చేసి.. అక్కడ నుంచి పైపుల ద్వారా రోగుల పడకల వద్దకు సరఫరా చేస్తారు. పైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పడకలు పూర్తిగా నిండటంలేదు. కానీ ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం వీటికి 99 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరం కాగా, 60 మెట్రిక్ టన్నులు మాత్రమే ఉందని అంటున్నారు. అంతేకాకుండా అవి సాధారణ పడకలను కూడా ఆక్సిజన్ పడకలుగా మార్చడంతో డిమాండ్ మరింత పెరిగింది.
ఇష్టారాజ్యంగా ధరలు..
ప్రైవేటు ఆస్పత్రుల్లో ఒకట్రెండింటికి మినహా లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేసే వ్యవస్థ లేదు. అక్కడ సిలిండర్ల ద్వారానే ఆక్సిజన్ సరఫరా అవుతుంది. కొన్ని ప్రైవేట్ కంపెనీలు వీటిని సరఫరా చేస్తాయి. ఇది మొత్తం డ్రగ్ కంట్రోల్ విభాగం ద్వారా జరుగుతుంది. ఆస్పత్రులకే కాకుండా పారిశ్రామిక, వాణిజ్య అవసరాలకు కూడా ఆక్సిజన్ సిలెండర్లు అవసరం. ప్రైవేట్ ఆసుపత్రులకు మాత్రం డ్రగ్ కంట్రోల్ అధికారులు సూచించిన మేరకు వాటిని కేటాయించాలి. ఎంతమంది రోగులు ఐసీయూ, ఆక్సిజన్ పడకలపై ఉన్నారో ఆ మేరకు సిలెండర్లు ఇవ్వాలి. కానీ డిమాండ్‌కు తగిన విధంగా అవి రావడంలేదని అంటున్నారు.
పైగా ప్రస్తుత డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని డీలర్లు రెండు మూడు రెట్లు ఎక్కువ ధరకు వాటిని విక్రయిస్తున్నారు. 22 క్యూబిక్ లీటర్ల పెద్ద సిలెండర్ ధర గతంలో రూ. 3,080 నుంచి రూ.3,740 ఉండేది. అంటే లీటర్‌కు రూ.140 నుంచి రూ.170 వరకు పడేది. ఇప్పుడు దానిని రూ.7,700 నుంచి రూ.8,580 వరకు విక్రయిస్తున్నారు. అంటే.. లీటర్‌కు రూ.350 నుంచి రూ.390 వరకు పడుతోందన్నమాట. ఇక పారిశ్రామిక, వాణిజ్య అవసరాల కోసం ఇదే సిలెండర్‌ను రూ.10 వేలైనా వెచ్చించి కొంటున్నారు. డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్ముతున్నారనే విమర్శలున్నాయి.
ఇంతగా ధరలు పెంచడంతో ఆక్సిజన్ కొనలేక కొందరు, కొరత వల్ల కొన్ని ఆసుపత్రుల్లోని రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో చిన్నచిన్న ప్రైవేట్ ఆసుపత్రులకు ఆ కొంచెం ఆక్సిజన్ సైతం దక్కనీయకుండా కొన్ని పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు గుత్తాధిపత్యం వహిస్తున్నాయని ఒక ప్రైవేట్ ఆసుపత్రి యజమాని ఆవేదన వ్యక్తంచేశారు. మరోవైపు పడకలు కూడా లేవని పలువురు రోగులను ప్రైవేటు ఆస్పత్రులు వెనక్కి పంపుతున్నా.. డ్రగ్‌కంట్రోల్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
బ్లాక్‌లో రెమిడెసివీర్.. తుసిలిజుమాబ్
ఆక్సిజన్ సంగతి పక్కన పెడితే.. కరోనా రోగులకు వినియోగించే ఔషధాల విషయంలోనూ ప్రైవేటు ఆస్పత్రులు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయని అంటున్నారు. కరోనా బాధితులకు కీలకమైన సమయంలో రెమిడిసివీర్ ఇస్తారు. కేంద్రం సిఫార్సు చేయకపోయినా తుసిలిజుమాబ్‌ను కూడా కొన్ని ఆసుపత్రులు ఇస్తున్నాయి. ఇవి యాంటీ వైరల్ డ్రగ్స్ అయినా కూడా కొన్ని ఆసుపత్రులు విచ్చలవిడిగా వినియోగిస్తున్నాయి. వాస్తవానికి వాటిని డ్రగ్ కంట్రోల్ అధికారులే రోగుల సంఖ్యను ఆధారం చేసుకొని ఇస్తుంటారు. అయితే, ఆస్పత్రులు మాత్రం వాటి కొరత ఉందంటూ రోగులనే తెచ్చుకోమని ఒత్తిడి చేస్తున్నాయి.
ఈ క్రమంలో కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. రూ.5,600 ధర ఉన్న రెమిడిసివీర్ ఇంజెక్షన్‌ను ఏకంగా రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు అమ్ముతున్నాయి. ఇక తుసిలిజుమాబ్ ధర రూ.12 వేలు కాగా, రోగుల నుంచి ఏకంగా రూ.50 వేలు వసూలు చేస్తున్నారు. బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రి ఒక రోగికి ఏకంగా రూ.75 వేలకు తుసిలిజుమాబ్ ఇచ్చినట్లు తెలిసింది. ఆస్పత్రులు ఇలా రోగులను దోపిడీ చేస్తున్నా వైద్య ఆరోగ్యశాఖ పట్టించకోవడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఇక ప్రైవేట్ లేబరేటరీల్లో రూ.550కు చేయాల్సిన ఆర్‌టీపీసీఆర్ పరీక్షకు రూ.1200 నుంచి రూ.1400 వరకు వసూలు చేస్తున్నారు. అలాగే ఆర్‌టీసీపీఆర్ కిట్ ధర రూ.65కి తగ్గినా.. ఆ మేరకు ధర తగ్గించడంలేదు.
చదవండి: కరోనా ఎఫెక్ట్: భారత రైల్వే కీలక నిర్ణయం
Oxygen Cylinder Shortage in Hyderabad: అందని ఆక్సిజన్
Published Sun, Apr 18 2021 2:08 AM | Last Updated on Sun, Apr 18 2021 12:28 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment