
డబ్బు లేకుంటే రోగి చావాల్సిందేనా?
పేద, మధ్య తరగతి ప్రజ లు వైద్య సేవలను అందుకోలేని స్థితిలో ఉన్నారని... రోజురోజుకు వైద్య బిల్లులు ఆకాశాన్ని అంటుతున్నాయని గవర్నర్ నరసింహన్ ఆవేదన వ్యక్తం చేశారు.
- పేదలు, మధ్యతరగతికి వైద్య సేవల భారంపై గవర్నర్ ఆవేదన
సాక్షి, హైదరాబాద్: పేద, మధ్య తరగతి ప్రజ లు వైద్య సేవలను అందుకోలేని స్థితిలో ఉన్నారని... రోజురోజుకు వైద్య బిల్లులు ఆకాశాన్ని అంటుతున్నాయని గవర్నర్ నరసింహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కార్పొరేట్ ఆస్పత్రుల తీరును ఆయన తప్పుబట్టారు. సోమవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్లో ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ ఆధ్వర్యంలోwww.hepa titisccure.inవెబ్‌సైట్‌ను ప్రారంభించిన సందర్భంగా గవర్నర్ ప్రసంగించారు.
చికిత్సకు డబ్బులేని కారణంగా రోగి చనిపోవాల్సిందేనా? డబ్బులిస్తేనేగానీ వైద్య సేవల్ని పొందలేకపోవడమంటే వైద్య సేవలు సమాజంలో అందుబాటులోకి వచ్చినా దండగేనని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితి ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. మన ప్రభుత్వాలు ఆరోగ్యంపై వేలకోట్లు ఖర్చు చేస్తున్నా, ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు అందిస్తున్నా ఎక్కడో లోపం ఉందని...అందుకే పేద, మధ్య తరగతి ప్రజలు వైద్యసేవలను అందుకోలేని స్థితిలో ఉన్నారన్నారు. కార్పొరేట్ ఆస్పత్రులు కనీస లాభాలతో వైద్యసేవలను ఎందుకు అందించట్లేదని ప్రశ్నించారు.
ఈ విషయంలో అన్ని కార్పొరేట్ ఆసుపత్రులు చర్చించుకొని పేద, మధ్య తరగతికి అందుబాటులో ఉండేలా వైద్య చికిత్సలకు ఒకేరకమైన ధరను నిర్ణయించేలా ఎందుకు చొరవ తీసుకోవట్లేదన్నారు. కార్పొరేట్ సామాజికబాధ్యత అంటే స్కూళ్లకు కుర్చీలు, బల్లలివ్వడమే కాదని పేర్కొన్న గవర్నర్...ఆరోగ్యంపై పరిశోధనలకు కార్పొరేట్ ఆస్పత్రులు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. అప్పుడే భా వితరాలకు ప్రయోజనం చేకూర్చినవారమవుతామన్నారు. హెపటైటిస్-సీ చికిత్సకు అమెరికాలో రూ. కోటి ఖర్చు అయితే, మన దగ్గర రూ. 60వేల నుంచి రూ. లక్ష వరకే కావడం అభినందనీయమన్నారు.
ఎయిడ్స్ కంటే ప్రమాదకరం...
హెపటైటిస్-సీ వ్యాధి ఎయిడ్స్ కంటే ప్రమాదకరమైందని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. హెపటైటిస్ బీ, సీలతో ఏటా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 10 లక్షల మంది మరణిస్తున్నారన్నారు. ఖమ్మంలో హెపటైటిస్-సీ ఎక్కువగా ఉన్నట్లు వివరించారు. గిరిజన ప్రాంతాల్లో ఇది కనిపిస్తోందన్నారు. ఒకసారి వాడిన ఇంజక్షన్లనే మళ్లీ వాడటం, రక్త మార్పిడి తదితర విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల వ్యాధి సోకుతుందన్నారు. ఒకే టూత్‌బ్రష్‌ను ఎక్కువ మంది వాడడం వల్ల కూడా వస్తుందన్నారు.