ఇదేం ‘వెల్‌నెస్‌’! | Employees going on a large scale to Wellness Center | Sakshi
Sakshi News home page

ఇదేం ‘వెల్‌నెస్‌’!

Published Sun, Jan 22 2017 3:33 AM | Last Updated on Tue, Sep 5 2017 1:46 AM

Employees going on a large scale to Wellness Center

  • వెల్‌నెస్‌ సెంటర్‌కు పెద్ద ఎత్తున ఉద్యోగులు  
  • ఒకటే కేంద్రం కావడంతో వైద్యులపై ఒత్తిడి
  • జిల్లాల్లో కేంద్రాలు ఏర్పాటు కాకపోవడంతో ఉద్యోగుల ఇబ్బందులు
  • సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్టుల ఔట్‌ పేషెంట్‌ (ఓపీ) వైద్యసేవల కోసం ఖైరతాబాద్‌లో ప్రభుత్వం ప్రారంభించిన వెల్‌నెస్‌ కేంద్రం కిటకిటలాడుతోంది. ప్రస్తుతం రాష్ట్రం మొత్తానికి ఇది ఒక్కటే ఉండటంతో వివిధ జిల్లాల నుంచి ఉద్యోగులు, జర్నలిస్టులు ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తున్నారు. ఉద్యోగులు, జర్నలిస్టుల కోసం నగదు రహిత ఆరోగ్య సేవలకోసం కార్డులు జారీచేశాక... వారికి ఉచితంగా ఓపీ సేవలు కూడా అందించేందుకు వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

    ఇందులో భాగంగా అన్ని పాత జిల్లా కేంద్రాల్లో ఒక్కోటి చొప్పున... హైదరాబాద్‌లో 6 చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొదటగా ఖైరతాబాద్‌లో నెల కొల్పారు. ఇంకా మిగిలినచోట్ల వీటిని ఏర్పాటు చేయకపోవ డంతో ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. పైగా వైద్యం కోసం కార్పొరేట్‌ ఆసుపత్రులకు నేరుగా వెళ్లడానికి అవకాశం లేకపోవడం... వాటిల్లోకి వెళ్లాలంటే వెల్‌నెస్‌ సెంటర్‌ వైద్యులే సిఫారసు చేయాల్సి ఉండటంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

    పెరుగుతున్న ఓపీ.. వైద్యులకు బీపీ
    ప్రస్తుతం ఖైరతాబాద్‌ వెల్‌నెస్‌ కేంద్రంలో ఆరుగురు వైద్యులు, ఐదుగురు నర్సులు, 15 మంది పారామెడికల్, ల్యాబ్‌ టెక్నీషియన్లు  పనిచేస్తున్నారు. వీరందరినీ ఔట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన తీసుకున్నారు. అలాగే ఆయుష్, యోగ, ప్రకృతి చికిత్సా కేంద్రం కూడా ఉంది. ప్రస్తుతం రక్తపరీక్షలు, ఎక్స్‌రే, ఈసీజీ సహా వివిధ రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. రోజుకు సరాసరి 350 మంది వరకు ఓపీ సేవలకోసం వస్తున్నారు.

    350 మందిలో సుమారు 20 మంది వరకు తదనంతర చికిత్స కోసం కార్పొరేట్‌ ఆస్పత్రులకు సిఫారసు చేయించుకుంటున్నారు. ఓపీ పెరుగుతుండటంతో వైద్యులపై కూడా ఒత్తిడి పెరుగుతోందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. రోగులకు తగినంత సమయం ఇవ్వడంలేదన్న ఆరోపణలూ ఉన్నాయి. నగరంలో మరో ఐదు, అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక్కోటి చొప్పున ఏర్పాటు చేస్తే మరింత ప్రయోజనం కలుగుతుందని అంటున్నారు.

    కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్తే స్పందన కరువు
    రాత్రిళ్లు అత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్తే నగదు రహిత ఆరోగ్య కార్డులు ఇంకా తమ వద్ద అమలవడం లేదంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్లొచ్చన్న ప్రభుత్వ నిబంధన పూర్తిస్థాయిలో అమలు కావడంలేదని పలువురు చెబుతున్నారు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు స్పష్టత ఇవ్వాలని ఉద్యోగులు, జర్నలిస్టులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement