కొత్తగూడెం : చీకటి గులాయిలో బతుకు పోరాటం చేసి ఏళ్ల తరబడి వెలుగులు అందించిన సింగరేణి కార్మికులు ఉద్యోగ విరమణ తర్వాత దుర్భరంగా బతుకీడుస్తున్నారు. సింగరేణి నియమనిబంధనలతో.. చాలీచాలని పెన్షన్‌తో అవస్థపడుతున్నారు. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడు వారి బాగోగులను పట్టించుకునే వారు లేక పట్టెడన్నం కోసం కూలీలుగా మారుతున్నారు.
1998కి పూర్వం సింగరేణి సంస్థలో పనిచేసిన కార్మికుడు పదవీ విరమణచేస్తే వారి వారసులకు ఉద్యోగ అవకాశం కల్పించేవారు. ఆ తర్వాత యూంత్రీకరణ వైపు అడుగులు వేసేందుకు సింగరేణి సంస్థ కార్మికుల సంఖ్యను తగ్గించాలనే యోచనతో వీఆర్‌ఎస్, గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకాలను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వారసత్వ ఉద్యోగాలను కూడా నిలిపివేసింది. అప్పటివరకు చీకటి గులాయిల్లో కిలోమీటర్ల దూరం నడిచి బొగ్గు వెలికితీసిన కార్మికులు వయసు పైబడటం, అనారోగ్య కారణాలతో వీఆర్‌ఎస్, గోల్డెన్ షేక్ హ్యాండ్ పథకాల వైపు మొగ్గుచూపారు. 1998లో 1.15 లక్షల మంది ఉన్న కార్మికులు ఏడాదికేడాదికి తగ్గుముఖం పట్టారు. పదవీవిరమణ చేసిన అనంతరం పెన్షన్ అందిస్తామన్న సింగరేణి అధికారులు.. ఆ విషయూన్ని ఎప్పుడో మరిచారు.
పెన్షన్ రూ.వెయ్యి లోపే..
ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ సమయానికి మూడేళ్ల బేసిక్ డీఏలో 50 శాతం పెన్షన్‌గా నిర్ణయిస్తుండగా సింగరేణి కార్మికులకు మాత్రం అది వర్తించడం లేదు. 30 ఏళ్ల సర్వీస్ పూర్తిచేసిన వారికి మూడేళ్ల డీఏలో 25 శాతం, 30 ఏళ్ల సర్వీసు లోపు ఉన్నవారికి 10 నుంచి 25 శాతం డీఏలో పెన్షన్‌గా కేటాయించడంతో ఎక్కువమంది కార్మికులకు రూ.500 నుంచి రూ.1500 వరకు మాత్రమే పెన్షన్ వస్తోంది. ప్రతి ఐదేళ్లకోసారి పెన్షన్ రివైజ్ చేయాల్సి ఉన్నా 17 ఏళ్లుగా పెన్షన్‌లో ఎటువంటి మార్పులు లేవు. ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా సుమారు 40 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు పెన్షన్ తీసుకుంటుండగా వారిలో సగానికిపైగా కార్మికులు రూ.వెయ్యిలోపు పొందుతున్నారు.
ప్రభుత్వ పథకాలకూ దూరం
సింగరేణి రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ అందుతుందనే సాకుతో ప్రభుత్వ పథకాలకు వీరిని దూరం చేస్తున్నారు. నెలవారీగా రూ.వెయ్యి లోపే పెన్షన్ వస్తున్నా నిరుపేదల జాబితాలో మాత్రం వీరికి చోటు కల్పించడం లేదు. ప్రభుత్వం రూ. లక్షలోపు ఆదాయం ఉన్నవారిని నిరుపేదలుగా గుర్తిస్తున్నా సింగరణి రిటైర్మెంట్ కార్మికులకు మాత్రం ఈ అవకాశం లేదు. కాబట్టి సింగరేణి విస్తరించి ఉన్న నాలుగు జిల్లాల్లో ఆసరా పెన్షన్లు, తెల్లకార్డులకు వీరు నోచుకోవడం లేదు. పెన్షన్ పెంపుదలపై జేబీసీసీఐలో నిర్ణయం తీసుకోవాలనే సాకుతో యాజమాన్యం 17 ఏళ్లుగా పదవీ విరమణ పొందుతున్న కార్మికులకు పెన్షన్ మాత్రం పెంచడంలేదు. కార్మికులతోపాటు సింగరేణిలో పనిచేసి రిటైర్డ్ అయిన అధికారుల పరిస్థితి కూడా పెన్షన్ విషయంలో ఇలాగే ఉంది.
తొల‘గని’ చీకట్లు
Published Fri, Aug 14 2015 3:35 AM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM
Advertisement
Advertisement