ప్రక్షాళన దిశగా విద్యాశాఖ | o purslove problems in Education | Sakshi
Sakshi News home page

ప్రక్షాళన దిశగా విద్యాశాఖ

Published Tue, Jun 7 2016 1:51 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

ప్రక్షాళన దిశగా విద్యాశాఖ - Sakshi

ప్రక్షాళన దిశగా విద్యాశాఖ

సర్కారు సూళ్ల బలోపేతంపై దృష్టి
ఇకపై నియోజకవర్గస్థాయి సమీక్షలు, సమావేశాలు
మౌలిక సదుపాయాల కోసం ఎమ్మెల్యేల నిధులు
జూలైలో టీచర్ పోస్టుల భర్తీ  నోటిఫికేషన్
వీవీల నియామక బాధ్యత కలెక్టర్లకు
డెప్యూటీ సీఎం కడియం శ్రీహరి

సాక్షి, మంచిర్యాల/మంచిర్యాల రూరల్ :  ‘ప్రస్తుత పరిస్థితుల్లో విద్యాశాఖ ప్రక్షాళన ఎంతో అవసరం. ఆ మేరకు ప్రభుత్వమూ పని చేస్తోంది. జిల్లాలో సర్కారు స్కూళ్లు.. కాలేజీల్లో విద్యార్థులకు మెరుగైన బోధన అందేలా అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నం. భవిష్యత్తులో ఏ ఒక్క విద్యార్థిని కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్‌కు వెళ్లనీయం. ప్రైవేట్ స్కూల్ నుంచి సర్కారు స్కూల్‌లో చేరేలా ప్రభుత్వ పాఠశాలన్నీ బలోపేతం చేస్తాం. ఈ విద్యా సంవత్సరం సర్కారు స్కూళ్లలో విద్యార్థుల నమోదు పది శాతం పెరిగేలా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం.

సర్కారు స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తం..’ అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్పష్టం చేశారు. సోమవారం తూర్పు జిల్లా పరిధిలోని మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రిలో విస్తృతంగా పర్యటించిన ఆయన సీసీసీ సింగరేణి అతిథి గృహంలో ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి జిల్లా విద్యావ్యవస్థ-ప్రగతిపై మూడు గంటల పాటు సుదీర్ఘంగా సమీక్షించారు. సమీక్ష అనంతరం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చర్యలపై విలేకరులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గకుండా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు వివరించారు. సర్కారీ స్కూళ్లలో గతేడాది కంటే ఈ ఏడాది విద్యార్థుల నమోదు కనీసం పది శాతం పెరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

సర్కారీ స్కూళ్లపై ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంను విధిగా చేస్తూ పాఠశాలల పని తీరును సమీక్షించి మెరుగైన విద్య అందేలా చూస్తున్నట్లు తెలిపారు. విద్యా వ్యవస్థను మరింత గాడిలోకి తీసుకువచ్చేలా జిల్లాలోని విద్యాసంస్థల్లో నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తూ సమీక్ష జరిపేలా ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలిపారు. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కోసం ఎమ్మెల్యే నిధుల కింద రూ.కోటి మంజూరు చేస్తే విద్యాశాఖ ద్వారా రూ.3 కోట్లు మంజూరు చేస్తూ విద్యాసంస్థలను ఆధునిక వసతుల కల్పనకు పాటుపడుతున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల్లో విద్యార్థులకు కూర్చుండేలా రూ.40 కోట్ల విలువ చేసే బెంచీలు(డెస్క్‌లు) అవసరమని గుర్తించినట్లు చెప్పారు.


ఇందులో భాగంగా ముందుగా ప్రత్యేక అభివృద్ధి నిధుల కింద రూ.25 కోట్ల వరకు నిధులు విడుదల చేస్తూ బేంచీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ ప్రక్రియను ఇక టీఎస్‌పీఎస్సీకి అప్పగించామని అన్నారు. రెగ్యులర్, మోడల్ పాఠశాలల్లో కూడా టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని, జూలైలో ఇందుకు నోటిఫికేషన్ వెలువడనున్నాయని అన్నారు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో చేపట్టే వీవీల నియామక బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించినట్లు తెలిపారు. ప్రభుత్వ జూనియర్ డిగ్రీ, పాలిటెక్నిక్, రెసిడెన్షియల్ కళాశాలలకు ప్రహరీల నిర్మాణం, సీసీ కెమెరాల ఏర్పాటు, మంచినీటి వసతి, మూత్రశాలల ఏర్పాటుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్‌కు ఆదర్శంగా నిలిచేలా ఉపాధ్యాయులు పని తీరు మార్చుకోవాలని, ఇదే క్రమంలో మెరుగైన విద్యను అందిస్తూ అవసరమైతే ప్రైవేట్ నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా ఉపాధ్యాయులు చూడాలని అన్నారు.

దోస్త్ పథకం ద్వారా కళాశాలల్లో జరిగే అడ్మిషన్ల ప్రక్రియకు విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఒక విద్యార్థి ఏ కళాశాలలోనైనా కానీ తనకు నచ్చిన కోర్సులో చేరవచ్చన్నారు. ప్రైవేట్ కళాశాలలో  కోర్సులో చేరినా ప్రభుత్వ విద్యాశాఖ నిర్దారించిన ఫీజును మాత్రమే వసూలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో బోగస్ విద్యాసంస్థలు కూడా బయటపడే అవకాశం ఉందని, ఇలాంటి విద్యా సంస్థలను ఉపేక్షించేది లేదని అన్నారు.

ఉప ముఖ్యమంత్రి వెంట అటవీ, పర్యావరణ శాఖ, బీసీ శాఖా మంత్రి జోగు రామన్న, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎంపీ గెడెం నగేశ్, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, విఠల్‌రెడ్డి, కోనేరు కోనప్ప, కోవ లక్ష్మి, ఎమ్మెల్సీలు పురాణం సతీశ్‌కుమార్, పాతూరి సుధాకర్‌రెడ్డి, విద్యాశాఖ కమిషనర్ కిషన్, డైరైక్టర్ అశోక్ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement