కార్పొరేట్ ఆసుపత్రుల్లో వసూళ్లపై మండలిలో సభ్యుల ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఇష్టారాజ్యంగా బిల్లులు వసూలు చేస్తూ ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్నారని, వీటి నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అధికార, విపక్ష ఎమ్మెల్సీలు విజ్ఞప్తి చేశారు. అయితే, ఈ విషయం వాస్తవం కాదని మంత్రి సి.లక్ష్మారెడ్డి ఇచ్చిన సమాధానంపై శాసనమండలిలో పలువురు సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేశారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో బిల్లుల వసూలు, బీపీఎల్ కుటుంబాలకు 30 శాతం ఉచిత చికిత్స, పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటుపై తీసుకున్న చర్యలేమిటని సభ్యుడు ఫారుఖ్‌హుస్సేన్ ప్రశ్నిం చారు.
లక్ష్మారెడ్డి సమాధానమిస్తూ.. బిల్లుల వసూలు లేదని, బీపీఎల్ కుటుంబాలకు 30శాతం ఉచిత చికిత్స అందించాలనే నియమం లేదని, ప్రత్యేక విభాగం ఏర్పాటు లేదని చెప్పడంతో పలువురు విభేదించారు. సరైన ప్రమాణాలు, అనుమతులు లేని ఆసుపత్రులపై తీసుకుంటున్న చర్యలేమిటని ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణరావు ప్రశ్నిం చారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో అంతా దోపిడీ జరుగుతోందని, వీటిపై కమిటీ వేయాలని ఎమ్మెల్సీ ఎం.రంగారెడ్డి డిమాండ్ చేశారు. కాగా, ప్రైవేట్ ఆసుపత్రులను కంట్రోల్ చేయడానికి టాస్క్‌ఫోర్స్‌ను వేయాలని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు.
జిల్లాల నుంచి వచ్చే ఎమర్జెన్సీ కేసుల్లో డబ్బులు కట్టనిదే వైద్యం అందించే పరిస్థితి లేకుండా పోయిందని కె.రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం కచ్చితమైన ప్రణాళికలతో ముందుకెళ్లాలని అల్తాఫ్ రిజ్వీ సూచించారు. మంత్రి సమాధానమిస్తూ అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను పటిష్టం చేస్తామని, జిల్లాల్లో ఐసీయూలు కూడా లేని పరిస్థితి ఉన్నందున ఇప్పటికే మహబూబ్‌నగర్‌లో ప్రారంభించామని, కరీంనగర్, సిద్ధిపేటలలో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాగా, ఆసుపత్రుల్లో నిర్లక్ష్యం నిజమేనని, కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి, గతంలో జరిగిన లోపాల్ని సరిదిద్దుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
స్వైన్‌ఫ్లూ కేసులు తగ్గాయి
స్వైన్‌ఫ్లూ పరిస్థితి ఏమిటని ఎమ్మెల్సీలు ఎం.రంగారెడ్డి, ఎమ్మెస్ ప్రభాకరరావు, మహ్మద్ అలీ షబ్బీర్ వేసిన ప్రశ్నకు మంత్రి లక్ష్మారెడ్డి సమాధానమిచ్చారు. 2015తో పోల్చితే స్వైన్‌ఫ్లూ కేసులు గణనీయంగా తగ్గాయని గతంలో 2,956 కేసులు బయటపడగా 101 మరణాలు సంభవించాయని, ప్రస్తుతం 44 కేసులు రాగా 4 మరణాలున్నాయని, డెంగ్యూ కేసులు కూడా గతేడాది 1,831 కేసులు రాగా, ఇద్దరు మరణించారని, ఈ ఏడాది 21 కేసులకు ఒక్క మరణం కూడా లేదన్నారు. విషజ్వరాల నియంత్రణకు పంచాయతీరాజ్ శాఖ సమన్వయంతో చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రజల్ని పీల్చి పిప్పిచేస్తున్నా పట్టించుకోరా?
Published Thu, Mar 17 2016 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM
Advertisement
Advertisement