సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కొత్త రూపం సంతరించుకుంది. ఇటీవలి వరకు రాష్ట్రంలో కరోనా సోకినవారిలో 70 శాతం మంది వరకు లక్షణాలు లేకపోగా.. ఇప్పుడు నమోదవుతున్న కొత్త కేసుల్లో 90 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు ఉండటం లేదని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. అంటే వైరస్ లక్షణాలు కనిపించేవారి సంఖ్య 10 శాతానికి తగ్గిపోయింది. గతంలో వైరస్ లక్షణాలున్న వారిలో జ్వరం, దగ్గు, గొంతునొప్పి, జలుబు వంటివి తీవ్రంగా ఉండగా.. ప్రస్తుతం స్వల్పంగా కనిపిస్తున్నాయని అధికారులు, వైద్యులు చెబుతున్నారు. అయితే లక్షణాలు లేకపోవడం, బాగా తక్కువ లక్షణాలు ఉండటంతో చాలా మంది తమకు ఏమీకాదన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు. దీంతో ఇమ్యూనిటీ తక్కువగా ఉండే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యక్తులకు వైరస్ వ్యాపించే ప్రమాదం నెలకొందని వైద్యారోగ్య వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
సరిహద్దులు, స్కూళ్లు..
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తోంది. ఆ ప్రభావం తెలంగాణపై పడుతోంది. సరిహద్దుల నుంచి రాష్ట్రంలోకి వస్తున్నవారి ద్వారా వైరస్ వ్యాపిస్తోంది. మరోవైపు పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కావడం, చాలా మంది ఒక్కచోటికి చేరుతుండటంతో.. విద్యార్థులకు కరోనా వ్యాపిస్తోంది. టెస్టులు చేసిన స్కూళ్లు, కాలేజీల్లో పాజిటివ్ కేసులు బయటపడుతుండగా.. పరీక్షలు చేయక వెలుగు చూడని వైరస్ బాధితులు ఎందరో ఉన్నారని అంచనా. అలాంటి వారి నుంచి ఇండ్లలో తల్లిదండ్రులకు, పెద్దవయసు వారికి వైరస్ సోకుతోంది. ఇక కార్యాలయాలు, ఇతర పని ప్రదేశాల్లో కరోనా నిబంధనల ఉల్లంఘనతో కేసులు పెరుగుతున్నాయని వైద్యారోగ్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. కరోనా ప్రభావం పెద్దగా లేని సాధారణ స్థితికి వచ్చామన్న భావనతో చాలా మంది మాస్కులు ధరించడం లేదని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే నెలా రెండు నెలల్లో రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుందని హెచ్చరిస్తున్నాయి.
కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్స్ ఫుల్
కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లోనూ బెడ్స్ నిండిపోతున్నాయి. వైద్యారోగ్యశాఖ తాజా నివేదిక ప్రకారం.. కొన్ని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్, ఐసీయూ బెడ్స్ 50 నుంచి 60 శాతం మేరకు కరోనా కేసులతో నిండాయి. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో కరోనాకు కేటాయించిన 90 ఆక్సిజన్ బెడ్లలో 70 నిండిపోయాయి. 40 ఐసీయూ బెడ్లలో 10 నిండాయి. గచ్చిబౌలిలోని సన్‌షైన్ ఆస్పత్రిలో 50 ఆక్సిజన్ బెడ్లలో 30.. 20 ఐసీయూ బెడ్లలో 12 నిండాయి. సోమాజిగూడలోని యశోదా ఆస్పత్రిలో 30 ఐసీయూ బెడ్లలో అన్నీ ఫుల్ అయ్యాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. కొండాపూర్‌లోని కిమ్స్‌లో 34 ఆక్సిజన్ బెడ్లలో 23, ఆరు ఐసీయూలలో నాలుగింటిలో కరోనా బాధితులు చేరారు. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో 58 ఆక్సిజన్ బెడ్లలో 31, 19 ఐసీయూ బెడ్లలో 13 నిండిపోయాయి. పరిస్థితి ఇలా తీవ్రంగా మారుతుండటంతో.. అధికారులు చర్యలు చేపట్టారు. ఆక్సిజన్ సరఫరాకు ఆర్డర్లు పెట్టడంతోపాటు 15 వేల రెమిడిసివిర్ ఇంజెక్షన్ వయల్స్‌ను తెప్పిస్తున్నారు. 30లక్షల మల్టీ విటమిన్ మాత్రలకు ఆర్డర్ పెట్టారు. ఇందుకోసం రూ.2 కోట్లకుపైగా వెచ్చిస్తున్నారు.
ఒక్కరోజే 313 కరోనా కేసులు
రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే 313 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,02,360కు చేరుకుందని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు బులెటిన్‌లో వెల్లడించారు. వైరస్‌తో మరో ఇద్దరు చనిపోగా.. మొత్తం మరణాల సంఖ్య 1,664కు చేరినట్టు తెలిపారు. ఇప్పటివరకు మొత్తంగా 2,98,262 మంది కోలుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం 2,434 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 943 మంది ఐసోలేషన్‌లో ఉన్నారని తెలిపారు. గురువారం 62,972 టెస్టులు చేయగా.. మొత్తం టెస్టుల సంఖ్య 94,82,649కు చేరుకుందని వివరించారు. కాగా.. తెలంగాణలో 1.22 శాతమే వ్యాక్సిన్ వృధా అవుతోందని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎక్కువ వ్యాక్సిన్లు వృధా అయినట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. వాస్తవంగా పది శాతం మేర వ్యాక్సిన్లు వృథా అవుతాయనే భావనతో.. కంపెనీలే 10 శాతం అధికంగా వ్యాక్సిన్లు ఇస్తాయని, ఈ లెక్కన మన దగ్గర వృథా చాలా తక్కువని వివరించారు.
పాఠశాలలు, పక్క రాష్ట్రాల నుంచే..
పాఠశాలల విద్యార్థుల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి రాష్ట్రానికి వ్యాప్తి జరుగుతోంది. ఈ రెండు కారణాల వల్ల రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువగా సరిహద్దు జిల్లాల్లోనే ఉంటున్నాయి. ప్రజలు మళ్లీ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అర్హులైన వారంతా టీకాలు వేసుకోవాలి.
– డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ
Comments
Please login to add a commentAdd a comment