జేబులకు ‘పరీక్ష’ పెడుతున్న ‘కాసు’పత్రులు | Corporate hospitals to make more spendings of people | Sakshi
Sakshi News home page

జేబులకు ‘పరీక్ష’ పెడుతున్న ‘కాసు’పత్రులు

Published Wed, Sep 9 2015 2:47 AM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM

జేబులకు ‘పరీక్ష’ పెడుతున్న ‘కాసు’పత్రులు

జేబులకు ‘పరీక్ష’ పెడుతున్న ‘కాసు’పత్రులు

కార్పొరేటు, ప్రైవేటు హాస్పిటళ్ల నిలువుదోపిడీ
అవసరం ఉన్నా.. లేకున్నా అడ్డగోలు పరీక్షలు
యంత్రాలు ఖాళీగా ఉంటే నష్టమంటూ వైద్యులకు టార్గెట్లు
రాత్రివేళల్లోనూ మిషన్లు పనిచేయిస్తే.. నజరానాలు
పరీక్షల ఫీజులు డయాగ్నస్టిక్ సెంటర్లతో పోలిస్తే ఎన్నో రెట్లు ఎక్కువ
రిఫరల్స్ పేరిట ప్రైవేటు అంబులెన్సులకూ వాటా
బ్రోకర్ల వ్యవస్థతో విష వలయంలా మారిన ప్రైవేటు వైద్యం

 
సాక్షి ప్రత్యేక బృందం: కిడ్నాపరు గొంతుపై కత్తి పెడతాడు. డబ్బులిస్తావా! చంపేయాలా? అని బంధువులకు ఫోన్ చేస్తాడు. అంత డబ్బులివ్వలేని వాళ్లకు కనీసం ఏ పోలీసులకో చెప్పే అవకాశం ఉంటుంది. తమ వారిని రక్షించుకునే చాన్సు కొంతయినా ఉంటుంది. కానీ.. ఆసుపత్రి బెడ్‌పై ఉన్న వ్యక్తికి అప్పటికప్పుడు సర్జరీ చేయాల్సిందేనని డాక్టరు చెబితే!? రెండు సందర్భాల్లోనూ ప్రాణానికి ప్రమాదమే. కాకపోతే ఇక్కడ వేరొకరి సాయం తీసుకోవటమో... మరొకరిని సంప్రదించటమో దాదాపు అసాధ్యం! ఎందుకంటే అంత సమయం ఉండదు. ఆ వైద్యుడో.. ఆసుపత్రో తన విధి తాను నిర్వర్తించి చికిత్స చేస్తే ప్రాణం దక్కొచ్చు.
 
ఆస్తులు అమ్మి, అప్పులు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. కానీ వారు అదే అవకాశంగా తీసుకుని డబ్బే పరమావధిగా... అందినంత గుంజి పడేయాలని భావిస్తే...!! పైన చెప్పిన కిడ్నాపర్లకూ వీళ్లకూ తేడా ఏమీ ఉండదు. దురదృష్టవశాత్తూ కొన్ని ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులు, కొందరు డాక్టర్ల విషయంలో జరుగుతున్నది ఇదే!! చికిత్స మాట దేవుడెరుగు. పరీక్షల నుంచే దోపిడీ మొదలైపోతోంది. సదరు ఆసుపత్రులు చేసే పరీక్షలకే ఉన్న డబ్బంతా ఖర్చయిపోయి చికిత్స ఊసు మరిచి పోయి వెనుదిరిగిన పేదలున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
 
 ఇది దందా కాదా..?
 ఉదాహరణకు ఆదిలాబాద్‌కు చెందిన రమేలి రాజేశ్వర్‌నే తీసుకుందాం. నెల కిందట ఆయన తండ్రికి గుండెనొప్పి వచ్చింది. అందుబాటులో ఉన్న ఆర్‌ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. ‘ఏం కాదు. మామూలు నొప్పే’ అని చెప్పి పంపేశాడాయన. ఐదారు రోజులు గడవకుండానే మళ్లీ ఛాతీలో నొప్పి!! నేరుగా హైదరాబాద్ తీసుకొచ్చారు. బాగా పేరున్న ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చారు.
 
 యాం జియోగ్రామ్ సహా కొన్ని పరీక్షలు చేశారు. కాకపోతే అవేవీ ‘ఆరోగ్య శ్రీ’ పరిధిలోకి రావన్నారు. ఆ పరీక్షలకే.. రూ.40 వేలు బిల్లయింది. ఇన్ని పరీక్షల తర్వాత బైపాస్ సర్జరీ చేయాలని తేల్చారు ఆసుపత్రి వైద్యులు. ఆ సర్జరీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదంటూ.. దానికి రూ.4 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. ఎన్ని అమ్మినా అంత డబ్బు తేలేనని రాజేశ్వర్ చెప్పటంతో.. మాత్రలిచ్చి పంపించేశారు. మరో ఆసుపత్రయితే బాగుంటుందేమోనని భావించిన రాజేశ్వర్.. తన తండ్రిని ఇంకో కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అంతకుముందు ఆసుపత్రిలో చేసిన పరీక్షల రిపోర్ట్‌లు అన్నీ చూపించాడు.
 
 అక్కడి డాక్టర్లు మళ్లీ పరీక్షలు చేయాల్సిందేనన్నారు. అప్పుడే కరెక్ట్‌గా చెప్పగలమనటంతో అక్కడా పరీక్షలు చేయిం చాడు. వాటికి రూ.20 వేలు ఖర్చయ్యాయి. అక్కడ కూడా సర్జరీ అవసరమన్నారు. అది ఆరోగ్యశ్రీ పరిధిలోకి రాదని... కాబట్టి జీవితాంతం మందులు కొనసాగించాలని చెప్పి పంపేశారు. గమనించాల్సిన విషయం ఏంటంటే.. రాజేశ్వర్ తండ్రి పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. ఆయనకు ఎలాంటి చికి త్సా జరగలేదు. ముందు ఎలా ఉన్నాడో... ఇప్పుడూ అలానే ఉన్నాడు. కాకపోతే బైపాస్ అవసరమని తేల్చడానికి రూ.60 వేలు ఖర్చయింది. ఆ మేరకు రాజేశ్వర్ అప్పులపాలయ్యాడు. అయినా ఒక ఆసుపత్రిలో పరీక్షలు చేశాక.. మరో ఆసుపత్రి కూడా అవే పరీక్షలు చేయటంలో అర్థమేంటి? ఇది దందా కాదా? అవే పరీక్షలకు ఒక ఆసుపత్రిలో రూ.20 వేలై తే మరో ఆసుపత్రిలో రూ.40 వేలు ఎందుకైంది? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఒక్కటే. ప్రైవేటు ఆసుపత్రు ల్లో దోపిడీ అనేది పరీక్షల నుంచే మొదలవుతోంది.
 
 ఎమ్మారైతో ఏమార్చి.. కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు అవసరం లేని పరీక్షలు చేయటంలోనే కాదు.. ఆ పరీక్షలకు వసూలు చేసే ఫీజుల్లోనూ ‘ప్రత్యేకత’ ప్రదర్శిస్తుంటాయి. కార్పొరేట్ లెక్కల ప్రకరాం.. ఒక ఎమ్మారై మిషిన్‌ను ఖాళీగా ఉంచితే కూడా దానివల్ల వాటికి నష్టం వస్తుంది. అందుకోసం ఆసుపత్రుల యాజమాన్యాలు తమ డాక్టర్లకూ, విభాగాల నిపుణులకు కోటాలు విధిస్తాయి. అవసరం లేకపోయినా ఎమ్మారై పరీక్షలు రాయాలని డాక్టర్లపై ఒత్తిడి తీసుకొస్తుంటాయి. ఈ ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉంటుందంటే.. తమ సంస్థలో పనిచేసే డాక్టర్లనేగాక, బయట తమకు తెలిసిన ప్రభుత్వ, ప్రైవేటు డాక్టర్లను కూడా ఇందులో భాగం చేస్తారు. వాళ్లంతా తమ దగ్గరకు వచ్చే రోగులకు ‘‘ఎమ్మారై పరీక్ష యం త్రాలు బిజీగా ఉంటాయి. అదిగో.. అక్కడ రాత్రిళ్లు కాస్త ఖాళీగా ఉంటుంది. మంచి టెక్నీషియన్ ఉంటారు. రాత్రిళ్లు చేయించుకుంటే కొంత ఖర్చు తగ్గుతుంది’’ అని ప్రలోభపెట్టి, అవసరం లేకపోయినా ఆ పరీక్షలు చేయిస్తుంటారు. ఇలా పంపిం చినందుకు వారికి తగిన ప్రతిఫలం ముడుతుంది. కాస్త నిజాయితీగా ఉండి, మనస్సాక్షి అంగీకరించక.. ఇందుకు ఒప్పుకోని డాక్టర్లను సదరు ప్రైవేటు యాజ మాన్యాలు వేధించి బయటకు పంపేస్తాయి కూడా!
 
 అవసరం లేకున్నా పరీక్షలూ...
 రోగ నిర్ధారణ పరీక్షలు బీమా పరిధిలోకి రావు. ఆరోగ్య బీమా ఉన్నవారు కూడా సొంత ఖర్చులపై చేయించుకోవాల్సిందే. కాకపోతే ఇక్కడో చిన్న మెలిక ఉంది. ఏదైనా ఆసుపత్రిలో 24 గంటలపాటు అడ్మిట్ అయితే.. అప్పుడు చేయించుకున్న పరీక్షలకు బీమా వర్తిస్తుంది. ఈ లొసుగును ఆసరా చేసుకున్న కొంతమంది.. హెల్త్ చెకప్ కోసమని ఆసుపత్రిలో చేరి 24 గంటలపాటు అడ్మిట్ అవుతున్నారు. ఇదే అదనుగా వారికి భారీ రేట్లతో మొత్తం పరీక్షలు చేసి బీమా కంపెనీల నుంచి సొమ్ము గుంజుతున్నాయి ఆసుపత్రులు.  బీమా కంపెనీలు అధిక సంఖ్యలో పాలసీదార్ల నుంచి ప్రీమియం వసూలు చేసి.. దాన్ని క్లెయిమ్ చేసిన కొద్ది మందికి చెల్లిస్తూ ఉంటాయి. ఈ క్లెయిమ్‌లు పెరిగే కొద్దీ బీమా కంపెనీలు ప్రీమి యం మొత్తాన్ని కూడా పెంచేస్తుంటాయి. అంటే అంతిమంగా నష్టపోయేది పాలసీదారులే.
 
 ఏజెంట్లకు ముద్దుపేరు... రిఫరల్స్
 మనం అద్దె ఇల్లు చూయించినందుకు బ్రోకర్‌కు కమీషన్ ఇస్తాం. కార్పొరేట్ ఆసుపత్రులకు రోగులను తీసుకెళ్లడానికి కూడా అంచెలంచెలుగా ఈ బ్రోకర్ల వ్యవస్థ ఉంది. కాకపోతే దీన్ని గౌరవంగా ‘రిఫరల్’ వ్యవస్థగా పిలుస్తుంటారు. కార్పొరేట్ ఆసుపత్రులకు వాటి చుట్టు పక్కలుండే ఆర్‌ఎంపీలు రోగుల్ని పంపిస్తుంటారు. ఉదాహరణకు గుంటూరులో ఉండే డాక్టరు.. తన పేషెంట్‌కు చిన్న చీటీ ఇచ్చి హైదరాబాద్‌కు పంపిస్తాడు. ‘అరె! ఈ డాక్టర్ పెద్దాసుపత్రికి పంపిస్తున్నాడు. చాలా మంచాయన’ అని సంతోషిస్తూ హైదరాబాద్‌కు వస్తారు.
 
 అయితే అలా పంపినందుకు ఆ ఆర్‌ఎంపీకి కమీషన్ ముడుతుందనే విషయం వారికి తెలియదు. కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రుల నుంచి వాళ్లకు అందే డబ్బును ‘ఆర్‌ఎంపీ రిఫరల్’గా వ్యవహరిస్తుంటారు. ప్రైవేటు అంబులెన్స్‌ల వాళ్లు రోగిని ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళితే వారికి చెల్లించే మొత్తాన్ని ‘అంబులెన్స్ రిఫరల్’గా వ్యవహరిస్తున్నారు. వీటన్నిటితోపాటు ప్రైవేటువ్యక్తుల్ని ఏజెంట్లుగా పెట్టుకుని పక్కా మార్కెటింగ్ చేస్తున్న కొన్ని ఆసుపత్రులకు ‘మనీ’తత్వం తప్ప మానవత్వం ఉందనుకోగలమా?
 
 ప్రభుత్వ ఉద్యోగులకు సహాయకులుగా..
 కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు చికిత్స కోసం చేసే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. ఇందుకు కొన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఈ నిధుల చెల్లింపు విభాగం కూడా ఉంటుంది.  రోగుల నిధులను ఇవి పెద్ద మొత్తాలలో విడుదల చేస్తుం టాయి. కాకపోతే ప్రభుత్వ ఉద్యోగులు కార్పొరేట్ సంస్థలు ఆశించినంత వేగంగా పనిచేయవు. డబ్బు అందడంలో జాప్యం జరిగితే దాన్ని కూడా తీవ్ర నష్టంగానే పరిగణిస్తున్న కార్పొరేట్ ఆసుపత్రులు.. ఇలా నిధులందించే విభాగాల ఉద్యోగులకు సహా యం కోసం ప్రైవేటు సిబ్బం దిని ఏర్పాటు చేస్తున్నా యి. ‘ఇన్ని ఫైల్స్ క్లియర్ చేసినందుకు ఇంత మొత్తం’ అనే రీతిలో ముడుపులు అందజేయటం వీరి పని.
 
 కేంద్రం ఇచ్చే రేట్లకు మూడునాలుగు రెట్లు!
 వ్యాధి నిర్ధారన పరీక్షల కోసం కార్పొరేట్ ఆసుపత్రులు వసూలు చేస్తున్న రేట్లు చూస్తే గుండె గుభేలుమంటుంది. పేరున్న డయాగ్నస్టిక్ సెంటర్లు కూడా సీజీహెచ్‌ఎస్ కింద కేంద్రం నిర్దేశించిన రేట్లకు మించి భారీగా వసూలు చేస్తున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేస్తున్న రేట్లతో పోలిస్తే ఇవి చాలా తక్కువనే చెప్పాలి. రేట్ల తేడా ఇదిగో...    
 
 రాయితీలు పొందారు.. సేవలు మరిచారు..
 ఎమ్మారై, సిటీస్కాన్, ఆల్ట్రాసౌండ్, ఎండోస్కోపి, కొలనోస్కోపి, ఎక్సరే తదితర మిషన్లలో చాలా వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నవే. ప్రభుత్వం వీటికి రాయితీ కూడా ఇస్తుంది. మిషనరీపై ప్రభుత్వం నుంచి రాయితీ పొందినందుకు ఒప్పందం ప్రకారం కార్పొరేట్ ఆస్పత్రుల్లో 20 శాతం ఉచిత సేవలు అందించాలి. అయితే హైదరాబాద్‌లో ఒక్క ఆస్పత్రి కూడా ఈ నిబంధనలు పాటించడం లేదు. చివరకు వైద్య సేవల పేరుతో ఆస్పత్రుల ఏర్పాటు కోసం ప్రభుత్వం నుంచి ఖరీదైన భూములు పొందిన హాస్పిటళ్లు సైతం వీటిని అమలు చేయడం లేదు. ఒకే కంపెనీకి చెందిన యంత్రాల్లో, ఒకే పరీక్షలకు వేర్వేరు చార్జీలు వసూలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతున్న రోగ నిర్ధారణ ఖర్చులను ఎప్పటికప్పుడు నియంత్రించాల్సిన ప్రభుత్వం.. ఈ అంశాన్ని పట్టించుకున్న దాఖలాలు మచ్చుకైనా కన్పించడం లేదు.
 
  దోపిడీలో ఆర్‌ఎంపీల పాత్ర ఇదీ..
 కరీంనగర్ హెల్త్: కార్పొరేట్ ఆసుపత్రులు ఆర్‌ఎం పీలతో రోగులను రప్పించుకుంటూ ఎంత పక్కాగా దోపిడీకి పాల్పడుతున్నాయో తెలిపే ఘటన ఇదీ. మంగళవారం కరీంనగర్‌లోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలోకి వెళ్లగా సాక్షి విలేకరికి కనిపించిన దృశ్యాలివీ.. ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన ఎన్.సమ్మక్క(54) కాళ్లు, కీళ్లు, మెడ నొప్పులతో బాధపడుతోంది.  ఆమె నివాసముండే ప్రాంతంలో ఓ ఆర్‌ఎంపీ.. ఆమెను కరీంనగర్‌లో పేరున్న కార్పొరేట్ ఆస్పత్రికి అంబులెన్స్‌లో తీసుకొచ్చాడు. డ్రైవర్ రిసెప్షన్ సిబ్బంది ఇచ్చిన కవర్ తీసుకుని వెళ్లిపోయాడు. ఆర్‌ఎంపీ ఆసుపత్రిలోనికి వెళ్లి కాసేపటికి బయటకు వచ్చా డు. సమ్మక్కను లోపలికి తీసుకువెళ్లాడు. న్యూరోఫిజిషియన్.. వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకున్నా రు. ‘‘నరాల సమస్య ఉందమ్మా. మంచి మం దులు రాస్తాను. ముందుగా మెదడు, వెన్నుపూసకు వేర్వేరు ఎంఆర్‌ఐ స్కాన్ పరీక్షలు చేయిం చండి’’ అని చీటీ రాసిచ్చాడు.
 
 స్కానింగ్ వద్దకు వెళితే అక్కడ.. ‘‘రూ.12 వేలు ఇవ్వండి. వీటితోపాటు రక్తం, మూత్ర పరీక్షకు మరో వెయ్యి..’’ అన్నారు. కొంచెం తగ్గించండని రోగి బతిమాలుకోగా పక్కనే ఉన్న ఆర్‌ఎంపీ అక్కడున్న సిబ్బం దికి సైగచేశాడు. కార్పొరేట్ ఆస్పత్రిలో బిల్లు తగ్గింపు ఉండదని నచ్చచెప్పాడు. సమ్మక్క రూ.13 వేల బిల్లు చెల్లించింది. అరగంటలో రిపోర్టు అందింది.  డాక్టర్ దాన్ని పరిశీలించి రూ.2,700 మందులు రాశాడు. ఈ మందులు రెండు వారాలకే రాశాడని చెబుతూ ఆ ఆర్‌ఎంపీ.. డాక్టర్‌ను కలిసేందుకు లోపలికి వెళ్లాడు. కాసేపటికే డాక్టర్ ఇచ్చిన కమీషన్ కవర్‌ను జేబులో సర్దుకుంటూ నవ్వుతూ బయటకి వచ్చాడు.
 
  ఓ తండ్రి గుండెకోత..
 సాక్షి, హైదరాబాద్: అల్లారుముద్దుగా పెంచుకుం టున్న బాబు మరణించాడన్న గుండెకోత ఓవైపు.. మృతదేహం అప్పగించాలంటే లక్షల బిల్లు కట్టాలంటూ ఆసుపత్రి ఒత్తిడి మరోవైపు! ఈ రెండింటి మధ్య ఓ తండ్రి గుండె విలవిల్లాడిపోయింది. ఆవేదన ఆయన మాటల్లోనే..
 
 ‘‘ప్లేట్‌లెట్‌లు పడిపోవడంతో ఆగస్టు 29న బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ పిల్లల ఆస్పత్రిలో నా కొడుకు ప్రజయ్ నిహాల్(తొమ్మిది నెలలు) జాయిన్ చేశాం. శుక్రవారం వరకు రికవరీ అవుతున్నారని చెప్పి, శనివారం ఉదయం నుంచి సీరియస్‌గా ఉందన్నారు. ‘మేం చేయాల్సింది అంతా చేశాం.. మీ బాబును కాపాడలేకపోయాం’ అని మంగళవారం చెప్పారు.  రూ.6.43 లక్షల బిల్లుకుతోడు మరో రూ.50 వేల నాన్ మెడికల్ బిల్లు ఇచ్చా రు. ఇన్సూరెన్స్ కంపెనీ క్లియరెన్స్ వచ్చాకే బిల్లు క్లియర్ చేసి బాడీని తీసు కెళ్లమన్నారు.   ఈ పరిస్థితి మరెవరికీ రావొద్దు’’
 - వినయ్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, కూకట్‌పల్లి, హైదరాబాద్
 
 వైద్య పరీక్ష    కార్పొరేటు ఆసుపత్రులు    సీజీహెచ్‌ఎస్(రూ.ల్లో)
 ఓపీడీ కన్సల్టేషన్    500 - 600    135
 ఈసీజీ పరీక్ష    180 - 300    58
 సీరమ్ క్రియాటినిన్    200 - 250    58
 టీఎస్‌హెచ్    500 - 600    104
 హీమోగ్రామ్ (రక్తపరీక్ష)    500 - 700    140
 2డి ఎకో    1,500 - 2,000    1,242
 ఎల్‌ఎఫ్‌టీ    900 - 1,000    245
 చాతీ ఎక్స్‌రే     300 - 500    69
 బ్లడ్ షుగర్ రాండమ్    160- 250    25
 హెచ్‌బీఏ1సీ    850 - 1000    616
 బ్లడ్ షుగర్ ఫాస్టింగ్    200 - 250    25
 లిపిడ్ ప్రొఫైల్    850 - 1,000    616
 యూఎస్‌జీ అబ్డామిన్ 1,200-1,500 371
 విటమిన్-డి    2,500 - 3,000    633
 
 కదులుదాం.. కదిలిద్దాం
 సర్కారీ, కార్పొరేట్ వైద్యంలో మీకెదురైన చేదు అనుభవాలను.. మీరు చూసిన మంచి డాక్టర్ల గురించి ‘సాక్షి’తో పంచుకోండి. వైద్య దుస్థితిని మార్చడానికి సూచనలు కూడా తెలియజేయండి. వీటిని ప్రచురించటం ద్వారా నిర్మాణాత్మకమైన చర్చకు అవకాశమిద్దాం. మీ అనుభవాలు, ఆలోచనలను ఈమెయిల్స్, లేఖల ద్వారా ‘సాక్షి’కి పంపేటపుడు... మీ పేరు, మీకు చికిత్స చేసిన ఆసుపత్రి లేదా డాక్టరు పూర్తి పేరును, మొబైల్ నంబర్లను తప్పనిసరిగా తెలియజేయండి. మీ పేరు రహస్యంగా ఉంచాలని భావిస్తే అది కూడా రాయండి.
 
 లేఖలు, మెయిల్స్ పంపాల్సిన చిరునామా:
 ఎడిటర్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-34
 sakshihealth15@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement