
రోగులకు నరకం చూపుతున్నారు
‘‘రోజురోజుకూ పెరుగుతున్న వైద్య ఖర్చులు చూస్తుంటే భయమేస్తోంది. ఆర్థిక స్తోమత లేక చాలామంది వైద్యానికి దూరమవుతున్నారు.
- రోగుల విషయంలో ‘కార్పొరేట్’ తీరు బాధాకరం: గవర్నర్
- అనవసర పరీక్షలు, చికిత్సలపై సీరియస్
- మానవత్వాన్ని మరచిపోయి ప్రవర్తిస్తున్నారు
- బతికుండగానే రోగికి నరకం చూపుతున్నారు
- చిన్న సమస్యతో వెళ్తే నన్ను కూడా వదల్లేదు
- వైద్య ఖర్చుల నియంత్రణకు నేనే చొరవ తీసుకుంటా
- కార్పొరేట్ ఆస్పత్రులతో ప్రత్యేకంగా భేటీ అవుతా
- క్యాన్సర్ కేర్ ఇండియా-15 సదస్సులో వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ‘‘రోజురోజుకూ పెరుగుతున్న వైద్య ఖర్చులు చూస్తుంటే భయమేస్తోంది. ఆర్థిక స్తోమత లేక చాలామంది వైద్యానికి దూరమవుతున్నారు. అనేకమంది రోగుల మృతికి ఇదే కారణం. కొందరు వైద్యులు సంపాదనే ధ్వేయంగా పని చేస్తున్నారు. బ్రెయిన్‌డెడ్ అయి, వ్యక్తి ఇక బతకడని తెలిసినా కూడా వైద్యం పేరుతో బిల్లులు వసూలు చేస్తున్నారు’’ అంటూ గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యం పేరుతో రోగుల పట్ల కార్పొరేట్ ఆస్పత్రులు అనుసరిస్తున్న తీరు చూస్తే బాధగా ఉందన్నారు. శనివారం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో నిర్వహించిన‘అఖిల భారత క్యాన్సర్ కేర్-2015’ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు. చికిత్సల పేరుతో రోగులను దోచుకుంటున్న వైద్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రోగి బాధను అర్థం చేసుకునేందుకు కూడా వైద్యులు ప్రయత్నించడం లేదని, మనసు విప్పి మాట్లాడేందుకు కనీస సమయం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ‘‘రోగి బాధను పూర్తిగా వినకుండానే వైద్య పరీక్షలకు సిఫార్సు చేస్తున్నారు. ఇటీవల నేను ఓ చిన్న సమస్యతో ఓ ఆస్పత్రికి వెళ్తే నలుగురు వైద్యులు నాకు టెస్టులన్నీ చేశారు. ఎక్స్‌రే కూడా తీశారు. తీరా ఏమీ లేదని తేల్చారు. అవసరం లేకపోయినా టెస్టులు రాస్తూ రోగులకు బతికుండగానే నరకం చూపుతున్నారు’’ అన్నారు. వైద్య సేవల్లో పారదర్శకత కోసం ఆస్పత్రి ఖర్చులపై కామన్ చార్ట్ ఏర్పాటు చే యాల్సిందిగా ఆస్పత్రులను తాను అనేకసార్లు కోరినా ఇప్పటిదాకా ఒక్కరూ స్పందించలేదంటూఆగ్రహం వ్యక్తం చేశారు. రోజురోజుకు పెరుగుతున్న చికిత్స వ్యయాన్ని నియంత్రించేందుకు తానే స్వయంగా చొరవ తీసుకుని కార్పొరేట్ ఆస్పత్రులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయిస్తానని ప్రకటించారు.
సంపాదనంతా ఆస్పత్రి ఖర్చులకే
రాష్ట్రంలో వైద్యవిధానం బాగా లేదని గవర్నర్ అభిప్రాయపడ్డారు. సగటు మనిషి సంపాదనలో ఎక్కువ శాతం ఆస్పత్రి ఖర్చులకే అవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆస్పత్రులు, వైద్యుల దృక్పథం మారాల్సిన అవసరముందన్నారు. ‘‘పలు ఆస్పత్రులు రాజకీయ నేతలకు, వీఐపీలకు వైద్య ఖర్చుల్లో రాయితీ ఇస్తున్నాయి. అదేదో నిరుపేద రోగులకు ఇస్తే బాగుంటుంది. చాలామంది వైద్యులు హైదరాబాద్‌ను తమ సొత్తుగా భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి పేదలకు సేవచేయకుండా ఇక్కడే ఉంటున్నారు. ఇది చాలా బాధాకరం.
వైద్యులు తాము పాటిస్తున్న నైతిక నియమావళిని సమీక్షించుకోవాల్సిన అవసరముంది. రోగుల దృష్టిలో వైద్యులు దైవంతో సమానం. వారి బాధను అర్థం చేసుకొని, బతుకుపై భరోసా కల్పించాల్సిన బాధ్యత వైద్యులదే’’ అన్నారు. దేశాన్ని పట్టి పీడిస్తున్న క్యాన్సర్, టీబీ, మధుమేహం వంటి వ్యాధుల నిర్మూలనకు ప్రతి కార్పొరేట్ ఆస్పత్రీ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను ఇందుకు కేటాయించాలని సూచించారు. ‘‘ఆస్పత్రులు తమ వైద్య సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇందుకోసం ఒక్కో కార్పొరేట్ ఆస్పత్రి ఒక్కో జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకుని వైద్య పరీక్షలు నిర్వహించాలి’’ అని సూచించారు. సదస్సులో క్యాన్సర్ కేర్ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ జేకే సింగ్, జనరల్ సెక్రటరీ రేణుసైగల్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి సీఈవో ఆర్పీ సింగ్, మెడికల్ డెరైక్టర్ డాక్టర్ టీఎస్ రావు తదితరులు పాల్గొన్నారు.