కార్పొరేట్ వైద్య ప్యాకేజీపై వార్! | war on Corporate medical packag | Sakshi
Sakshi News home page

కార్పొరేట్ వైద్య ప్యాకేజీపై వార్!

Published Mon, Jul 6 2015 1:59 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

కార్పొరేట్ వైద్య ప్యాకేజీపై వార్! - Sakshi

కార్పొరేట్ వైద్య ప్యాకేజీపై వార్!

* అధికారులు, ఉద్యోగ సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం
* ఆర్థికంగా భారమైతే మీకేంటని ఉద్యోగ నేతల నిలదీత
* సర్కారుకు వాస్తవాలు చెబుతున్నామంటున్న అధికారులు

సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు సంబంధించి ప్రభుత్వంపైపడే ఆర్థికభారం గురించి అధికారులు చెబుతున్న వివరాలపై ఉద్యోగ సంఘాల నేతలు గుర్రుగా ఉన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు కార్పొరేట్ వైద్య సేవలు అందకుండా అధికారులే అడ్డుగా మారారని వారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు నిమ్స్ తరహా మెడికల్ ప్యాకేజీ, ఓపీ సేవలు అందిస్తే ప్రభుత్వంపై రూ. 500 కోట్లు అదనపు భారం పడుతుందని ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా సీఎస్ రాజీవ్‌శర్మకు వివరించారు. ఈ సందర్భంగా.. అంతకుముందు జరిగిన పలు సమావేశాల్లో ఉద్యోగ సంఘాల నేతలు అధికారులతో తీవ్రస్థాయిలో వాదోపవాదాలకు దిగినట్లు తెలిసింది.

ప్రభుత్వంపై ఎంత భారం పడితే మీకెందుకని... ఉద్యోగులకు కార్పొరేట్ వైద్య ప్యాకేజీపై సర్కారు నిర్ణయం తీసుకోకపోవడంలో అధికారులే అడ్డుగా ఉన్నారని నేతలు నిలదీసినట్లు సమాచారం. దీంతో ఉన్నతాధికారులు కూడా నేతల తీరుపట్ల తీవ్ర ఆక్షేపణ వ్యక్తంచేసినట్లు తెలిసింది. ‘ప్రభుత్వానికి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మాదే. ఎంత భారం పడుతుందో చెప్పకుండా.. ఆర్థికశాఖ ఆమోదం లేకుండా ముందుకు సాగడం కష్టం. మీకేమైనా అభ్యంతరాలుంటే సీఎం వద్ద, వైద్య మంత్రి వద్ద తేల్చుకోండి’ అని ఒక ఉన్నతాధికారి ఘాటుగా సమాధానం చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.
 
మొదటి నుంచీ వెనుకంజే: మొదటి నుంచీ ఉద్యోగులకు కార్పొరేట్ వైద్య సదుపాయంపై నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో వైద్య మంత్రి లక్ష్మారెడ్డి పలుమార్లు చర్చలు జరిపినా ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు ఉచితంగా ఇవ్వాలని, మెడికల్ ప్యాకేజీ ఇప్పుడున్నట్లే కొనసాగించాలని ప్రభుత్వం కోరుతోంది.

కానీ ఈ రెండింటినీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తిరస్కరిస్తున్న సంగతి తెలిసిందే. శస్త్రచికిత్సల ప్యాకేజీ 25 శాతం పెంచినా పెద్దగా భారం ఉండదని... మహా అయితే రూ. 150 కోట్లకు మించి ఖర్చు కాదని అధికారులు అంటున్నారు. ఓపీ, మెడికల్ ప్యాకేజీలపైనే అధిక భారం ఉంటుందని చెబుతున్నారు. దీనికి అంగీకరిస్తే మెడికల్ ప్యాకేజీ, ఓపీలకే రూ. 500 కోట్ల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement