Employment associations Leaders
-
ప్రభుత్వం మొండివైఖరి వీడాలి
♦ కార్మికులకు కనీస వేతనాలు అందించాలి ♦ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం డిమాండ్ వికారాబాద్ : కనీస వేతనాలు ఇవ్వాలంటూ కార్మికులు, ఉద్యోగులు సమ్మెలు, పోరాటాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని, సీఎం కేసీఆర్ మొండివైఖరి వీడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సమ్మె చేస్తున్న గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్మికులు, డ్వామా ఉద్యోగులకు భరోసా కల్పించేందుకు 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు యాత్ర శుక్రవారం వికారాబాద్‌కు చేరుకుంది. ఇక్కడి ఎన్టీఆర్ చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో తమ్మినేని మాట్లాడారు. దళిత, బడుగు, బలహీన వర్గాలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. పంచాయతీ, మున్సిపల్ కార్మికులకు, ఈజీఎస్ సిబ్బందికి కనీస వేతనాలు ఇవ్వకుండా వారిని అన్యాయం చేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో పేద దళితులకు మూడు ఎకరాలు భూమి ఇస్తామన్న కేసీఆర్.. ఆ మాటే మరిచిపోయారన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద సమ్మె చేస్తే పోలీసులను పెట్టి అరెస్ట్ చేయించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ప్రభుత్వంపై తిరగబడే సమయం ఆసన్నమైందన్నారు. వికారాబాద్ మండలంలోని గిరిగేట్‌పల్లి గ్రామ పంచాయతీకి అనుబంధ గ్రామం కొట్టంగుట్ట తండాలో ఫారెస్ట్ అధికారులు రైతుల పొలాలపై దాడులు చేయడం దారుణమన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలమల్లేష్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు కేజీ రామచంద్రన్ మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం దొరల రాజ్యంగా మారిందని, హక్కుల అడగరాదని అడ్డుకోవాలని మంత్రులు చెప్పటం నియంత పోకడలకు నిదర్శనమన్నారు. అంతకు ముందు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్ఎస్పీ, సీపీఐ (ఎంఎల్) ఎంసీపీఐ రాష్ట్ర నాయకులు ఎర్రగడ్డ సాయిబాబా, భూతం వీరన్న, బి. బాబు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి వి.రాములు, జిల్లా కార్యదర్శి సి. వెంకటేశ్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింగ్‌రావు, న్యూడెమోక్రసీ నాయకులు రహీం, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పి.మల్లేశ్, అశోక్, ఎం.వెంకటయ్య, నాయకులు మహిపాల్, మహేందర్, గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాల్‌రాజ్, రత్నం, ఈజీఎస్ ఉద్యోగ సంఘం నాయకులు అశోక్, చంద్రశేఖర్, సీపీఐ, ఎంసీపీఐ డివిజన్ నాయకులు గోపాల్‌రెడ్డి, జంగయ్య పాల్గొన్నారు. -
కార్పొరేట్ వైద్య ప్యాకేజీపై వార్!
* అధికారులు, ఉద్యోగ సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం * ఆర్థికంగా భారమైతే మీకేంటని ఉద్యోగ నేతల నిలదీత * సర్కారుకు వాస్తవాలు చెబుతున్నామంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు సంబంధించి ప్రభుత్వంపైపడే ఆర్థికభారం గురించి అధికారులు చెబుతున్న వివరాలపై ఉద్యోగ సంఘాల నేతలు గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కార్పొరేట్ వైద్య సేవలు అందకుండా అధికారులే అడ్డుగా మారారని వారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు నిమ్స్ తరహా మెడికల్ ప్యాకేజీ, ఓపీ సేవలు అందిస్తే ప్రభుత్వంపై రూ. 500 కోట్లు అదనపు భారం పడుతుందని ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా సీఎస్ రాజీవ్‌శర్మకు వివరించారు. ఈ సందర్భంగా.. అంతకుముందు జరిగిన పలు సమావేశాల్లో ఉద్యోగ సంఘాల నేతలు అధికారులతో తీవ్రస్థాయిలో వాదోపవాదాలకు దిగినట్లు తెలిసింది. ప్రభుత్వంపై ఎంత భారం పడితే మీకెందుకని... ఉద్యోగులకు కార్పొరేట్ వైద్య ప్యాకేజీపై సర్కారు నిర్ణయం తీసుకోకపోవడంలో అధికారులే అడ్డుగా ఉన్నారని నేతలు నిలదీసినట్లు సమాచారం. దీంతో ఉన్నతాధికారులు కూడా నేతల తీరుపట్ల తీవ్ర ఆక్షేపణ వ్యక్తంచేసినట్లు తెలిసింది. ‘ప్రభుత్వానికి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మాదే. ఎంత భారం పడుతుందో చెప్పకుండా.. ఆర్థికశాఖ ఆమోదం లేకుండా ముందుకు సాగడం కష్టం. మీకేమైనా అభ్యంతరాలుంటే సీఎం వద్ద, వైద్య మంత్రి వద్ద తేల్చుకోండి’ అని ఒక ఉన్నతాధికారి ఘాటుగా సమాధానం చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. మొదటి నుంచీ వెనుకంజే: మొదటి నుంచీ ఉద్యోగులకు కార్పొరేట్ వైద్య సదుపాయంపై నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో వైద్య మంత్రి లక్ష్మారెడ్డి పలుమార్లు చర్చలు జరిపినా ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు ఉచితంగా ఇవ్వాలని, మెడికల్ ప్యాకేజీ ఇప్పుడున్నట్లే కొనసాగించాలని ప్రభుత్వం కోరుతోంది. కానీ ఈ రెండింటినీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తిరస్కరిస్తున్న సంగతి తెలిసిందే. శస్త్రచికిత్సల ప్యాకేజీ 25 శాతం పెంచినా పెద్దగా భారం ఉండదని... మహా అయితే రూ. 150 కోట్లకు మించి ఖర్చు కాదని అధికారులు అంటున్నారు. ఓపీ, మెడికల్ ప్యాకేజీలపైనే అధిక భారం ఉంటుందని చెబుతున్నారు. దీనికి అంగీకరిస్తే మెడికల్ ప్యాకేజీ, ఓపీలకే రూ. 500 కోట్ల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని చెబుతున్నారు.